Breaking News

26/07/2019

ఏజెన్సీలో మావోయిస్టుల కోసం జల్లెడ


ఖమ్మం, జూలై 26, (way2newstv.in)
మావోయిస్టు వారోత్సవాలు ఈ నెల 28వ తేదీ నుంచి జరగనున్న నేపథ్యంలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య జరుగుతున్న పోరాటంలో ఏజెన్సీ మరింత ఉద్రిక్తంగా మారింది. తెలంగాణ, చత్తీస్‌గఢ్ సరిహద్దులోని భద్రాచలం ఏజన్సీ ప్రాంతంలో గడిచిన రెండురోజులుగా జరుగుతున్న పరిణామాలు ఆందోళనకరంగా మారాయి. మావోయిస్టు వారోత్సవాలను విజయవంతం చేయడంతో పాటు ప్రభుత్వాల విధానాలను నిరసించాలంటూ సీపీఐ మావోయిస్టు పార్లీ చర్ల శబరి ఏరియా కమిటీ ఆధ్వర్యంలో గురువారం పోస్టర్లు, బ్యానర్లు, కరపత్రాలు వెలిశాయి. 
 ఏజెన్సీలో మావోయిస్టుల కోసం జల్లెడ

భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలోని అనేక చోట్ల ఇవి కనిపించడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. జూలై 28నుంచి ఆగస్టు 3వరకు జరిగే అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను ఘనంగా జరుపుకోవాలని, పోలీసులు సాగిస్తున్న సమాధాన్‌ను ఓడించాలని, అన్ని గ్రామాల్లోనూ వారోత్సవాలు నిర్వహించాలని మావోయిస్టులు కరపత్రాలు, బ్యానర్లలో పేర్కొన్నారు. అయితే వారోత్సవాల సందర్భంగా మావోయిస్టుల చర్యలపై ప్రత్యేక దృష్టిపెట్టిన పోలీసులు తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి పర్యటన పూర్తికాగానే చర్ల మండల పరిధిలోని కలివేరు అడ్డరోడ్డు వద్ద 8మంది మిలీషియా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 8 డిటోనేటర్లు, 30 జిలెటన్‌స్టిక్స్ స్వాధీనం చేసుకున్నారు. మరోవైపుఅమరవీరుల వారోత్సవాల సమయంలో మావోయిస్టులు గ్రామాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అలాగే ఇటీవల కాలంలో మావోయిస్టులు అనేక చర్యలకు పాల్పడటంతో వారోత్సవాల సందర్భంగా మరో సంఘటన జరగకుండా ముందస్తుగా జాగ్రత్తలు చేపడుతున్నారు. దీనిపై తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి తన రెండురోజుల పర్యటనలో సారపాకలో జరిగిన పోలీస్ అధికారుల సమావేశంలో అనేక సూచనలు చేసినట్లు సమాచారం. మావోయిస్టుల కదలికలు అధికంగా ఉన్న భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఇప్పటికే అధికార పార్టీకి చెందిన ఎంపీటీసీ శ్రీనివాసరావును మావోయిస్టులు హతమార్చడంతో మరో సంఘటన జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో అదనపు బలగాలను భద్రాచలం, వెంకటాపురం ఏజెన్సీ ప్రాంతాలకు రప్పించి కూంబింగ్‌ను విస్తృతం చేయనున్నట్లు తెలుస్తున్నది. అదే సమయంలో మావోయిస్టులు కూడా తాము ఈ ప్రాంతంలోనే ఉన్నామన్నట్లుగా బ్యానర్లు, పోస్టర్లు, కరపత్రాలు వేస్తుండటం విశేషం. అటు మావోలు, ఇటు పోలీసుల వైఖరితో ఏజెన్సీ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. దీంతో స్థానికంగా ఉన్న గిరిజనులు భయబ్రాంతులకు గురవుతున్నారు.

No comments:

Post a Comment