Breaking News

17/07/2019

నీరంటే అంత నిర్లక్ష్యమా.? (ఖమ్మం)

ఖమ్మం, జూలై 17 (way2newstv.in): 
భూగర్భ జలాలు ఏటేటా పాతాళానికి పడిపోతుండడంతో నీటి ఇక్కట్లు తీవ్రమవుతున్నాయి. వాననీటిని ఒడిసిపట్టుకోకుంటే ఇప్పుడు ఇబ్బందులే కాకుండా.. భవిష్యత్తు తరాలకు మనుగడ కష్టంగా ఉంటుందని చెబుతున్నా.. చెవికెక్కడం లేదు. నగరాల్లో భూగర్భజలాల పెంపుపై ప్రజల్లో అవగాహన లేకపోవడం ఓ సమస్య కాగా, బహుళ అంతస్తుల భవనాల్లో కచ్చితంగా ఇంకుడుగుంతలు నిర్మించాలన్న నిబంధనను అధికారులు, యజమానులు  పట్టించుకోపోవడంతో నీటి కష్టాలు తప్పడంలేదు.  ప్రస్తుతం ఖమ్మం నగరంలో నీటి ఎద్దడికి ఇదీ ఓ కారణమే. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు తప్పవని ఆ విభాగం అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇంకుడుగుంతల నిర్మాణంలో ఖమ్మం నగరపాలక సంస్థ అధికారులు పెద్దగా దృష్టిసారించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. 
నీరంటే అంత నిర్లక్ష్యమా.? (ఖమ్మం)

ఇళ్ల నిర్మాణ సమయంలో అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి నుంచి రూ.2 వేలు చొప్పున ముక్కు పిండి వసూలు చేస్తున్న ప్రణాళిక విభాగం, వాటి నిర్మాణాన్ని మాత్రం పట్టించుకోవడంలేదు. వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో బోర్లు ఎండిపోయి, బావుల్లో నీరు లేక ప్రజలు ట్యాంకర్ల మీద ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది.నగరపాలకంలో వేలల్లో ఇంటి నిర్మాణాలు కొనసాగుతుండగా, ఇంకుడు గుంతల నిర్మాణం మాత్రం పదుల సంఖ్యలో ఉంటున్నాయి. నగరంలో ఉన్న 532 బహుళ అంతస్తుల భవనాల్లో కేవలం 60 మాత్రమే ఇంకుడు గుంతలు నిర్మించుకోవడం నగరపాలక ప్రణాళిక విభాగం అధికారుల పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది. రూ.లక్షలు వెచ్చించి    ఇళ్లు నిర్మించుకుంటున్న యజమానులు, రూ.2 వేల నుంచి రూ.10వేలు ఖర్చుపెట్టి ఇంకుడు గుంతలను నిర్మించుకోపోవడానికి అవగాహన లోపమే కారణమన్న వాదన వినిపిస్తోంది. ఈ చిన్నపాటి నిర్లక్ష్యం భవిష్యత్తులో ఎన్నో సమస్యలకు మూలమవుతుందని గుర్తించలేకపోతున్నారు. పుర, నగరపాలకాల్లో ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో యజమానుల నుంచి ఇంకుడు గుంత నిర్మాణానికి రూ.2 వేలు డిపాజిట్‌ చెల్లించుకుంటారు. ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత అధికారులు పరిశీలించి ఇంకుడుగుంత నిర్మాణం పూర్తయితే డిపాజిట్‌ను తిరిగి యజమానికి చెల్లిస్తారు. డిపాజిట్‌ చెల్లింపుపై చూపుతున్న శ్రద్ధ ఇంకుడుగుంతల నిర్మాణంలో చూపడంలేదు. దీంతో నిర్మాణదారులు దానిని పెద్దగా పట్టించుకోవడంలేదు. అధికారులు పరిశీలన చేయకపోవడంతో నీటి సంరక్షణ చర్యలు నీరుగారిపోతున్నాయి. ఈ నిర్లక్ష్యమే రాన్రాను నీటి ఎద్దడికి దారితీస్తోంది.
పుర, నగరపాలకాల్లో 300 చ.మీల విస్తీర్ణంలో నిర్మించే ఇళ్లు, బహుళ అంతస్తుల భవనాల ఆవరణలో తప్పనిసరిగా ఇంకుడు గుంతలు నిర్మించాలి. 2.5 క్యూబిక్‌ మీటర్ల పరిమాణపు ఇంకుడుగుంత నిర్మాణం ద్వారా 22 వేల లీటర్ల వర్షపునీరు భూమిలోకి ఇంకుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇకముందు చేపట్టే ఇంటి నిర్మాణాలకైనా తప్పనిసరిగా ఇంకుడుగుంతల నిర్మాణం చేపట్టేలా యజమానులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.

No comments:

Post a Comment