Breaking News

20/07/2019

కరకట్టపై టీడీపీ వ్యూహాత్మకం

విజయవాడ, జూలై 20, (way2newstv.in)
కృష్ణా కరకట్టపై అక్రమ నిర్మాణంగా ప్రభుత్వం గుర్తించిన చంద్రబాబు నివాసం కూల్చివేతను అడ్డుకునేందుకు టిడిపి ద్విముఖ వ్యూహాన్ని సిద్ధం చేసింది. వైసిపి సర్కార్ కక్ష సాధింపు కోసమే చంద్రబాబు నివాసాన్ని కూల్చేయడానికి రెడీ అయినట్లు ప్రజల్లో విస్తృతంగా ఇప్పటినుంచే ప్రచారం చేసే ఎత్తుగడ ఇందులో మొదటిది. దీంతో బాటు గతంలో కాంగ్రెస్ హయాంలోనే అక్రమకట్టడాలకు అనుమతులు ఇచ్చారంటూ కొన్ని కట్టడాలను సాక్ష్యంగా చూపాలని టిడిపి భావిస్తుంది. అలాగే రాష్ట్రంలో 74 వేల నిర్మాణాలు కృష్ణా, గోదావరి వంటి నదులపై నిర్మితం అయ్యాయాయని వాటినన్నిటిని ఎలా కూలుస్తారో చూస్తామంటూ ప్రజల మద్దతు కోసం వేచి చూస్తుంది టిడిపి. ఇవన్ని టచ్ చేయకుండా కేవలం చంద్రబాబు ఉంటున్న అతిధి గృహాన్ని ముట్టుకుంటే ఉద్యమించాలని తెలుగుదేశం సిద్ధం అవుతుంది.
కరకట్టపై  టీడీపీ వ్యూహాత్మకం

ప్రజావేదికను రాత్రికి రాత్రి కూల్చి నేలమట్టం చేసిన వైసిపి సర్కార్ ను తక్కువ అంచనా వేయకూడదని టిడిపి అధినేత భావిస్తున్నట్లు తమ్ముళ్ళు చెబుతున్నారు. ఒక పక్క న్యాయస్థానంలో పోరాడటం మరో పక్క ప్రజల మద్దతుతో ప్రభుత్వంపై వత్తిడి తేవడం ద్వారా వైసిపి దూకుడుకు చెక్ పెట్టాలని ఇప్పటికే టిడిపి శ్రేణులకు ఆదేశాలు వెళ్లిపోయాయి. ఈ నేపథ్యంలోనే ముఖ్య నేతలు ఇప్పటికే మీడియా సమావేశాలు పెట్టి వైసిపి కక్షసాధింపు ధోరణితోనే ముందుకు వెళుతుందని ఎక్కడికక్కడ ఆరోపణలకు దిగారు.ఎపి లోని నదీపరివాహక ప్రాంతాల్లో 74 వేల కట్టడాలు ఉన్నాయని ఇందులో ప్రభుత్వ భవనాలు, పర్యాటక శాఖ భవనాలు, అతిధి గృహాలు, పేదవర్గాలు ఉన్నాయని లెక్కలతో సహా టిడిపి దాడి మొదలు పెట్టింది. అక్రమ కట్టడాలు ఉన్నవారిలో ముఖ్యమంత్రి జగన్ బంధువులు నెల్లూరు లో చేసిన నిర్మాణాల మాటేమిటని విపక్ష డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటి వారు ప్రశ్నించడం గమనార్హం. వీరందరు దశాబ్దాలుగా కరకట్టలపైనే నివాసం వుంటున్నారని వీరిని టచ్ చేస్తే జగన్ సర్కార్ కి షాక్ తప్పదని టిడిపి నేతలు హెచ్చరిస్తున్నారు. తమ జోలికి వస్తే ఈ వర్గాలను ముందు పెట్టి పోరాడతామన్న సంకేతాలను టిడిపి పంపింది. ఈ నేపథ్యంలో వైసిపి సర్కార్ దీనికి ప్రతివ్యూహం ఏవిధంగా రూపొందిస్తుందో చూడాలి.

No comments:

Post a Comment