Breaking News

08/07/2019

వెనక్కిపోతున్న చెక్కులు


కరీంనగర్, జూలై 8, (way2newstv.in)
పేర్లు, ఫొటోల్లో తప్పులు.. వివాదాస్పద భూములు.. విస్తీర్ణంలో తేడాలు అన్నదాతలకు అవస్థలు తెచ్చిపెడుతున్నాయి. అటు పెట్టుబడి సాయం నోచుకోక.. ఇటు పాస్‌బుక్కులు అందక ఆందోళనకు గురవుతున్నారు. ధరణి వెబ్‌సైట్‌ ప్రారంభించినా సాంకేతిక సమస్యలు కొనసాగడం.. కొన్నిచోట్ల వివరాలు ఎంట్రీ చేయకపోవడంతో తప్పుల సవరణకు వీల్లేకుండా పోయింది. దీంతో చెక్కులొచ్చినా పాస్‌బుక్కుల్లేక రైతులు డబ్బులందుకోని పరిస్థితి నెలకొంది.అన్ని సక్రమంగా ఉన్నా కొత్త పాస్‌పుస్తకాలు జారీచేయడంలో అలసత్వం కొనసాగుతోంది. జనగామ జిల్లాలో 193 గ్రామాలుండగా 200 మంది చొప్పున 38వేల600 మందికి అందించాల్సి ఉన్నది. అదేజిల్లాలో గోవర్దనగిరి గ్రామంలో కొన్నె సంజీవ్‌ అనే రైతుకు రెండున్నరెకరాలుండగా 10 వేల చెక్కు వచ్చింది. పాస్‌పుస్తకం రాకపోవడంతో చెక్కు చెల్లదంటున్నారు. సిద్ధిపేట జిల్లాలో 21,596, మంచిర్యాలలో 1574, కరీంనగర్‌లో 18570, పెద్దపల్లిలో 5608, ఆదిలాబాద్‌లో 15వేలు, నిర్మల్‌లో 14,337, భూపాలపల్లిలో 22వేలు, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 46,296 పాస్‌పుస్తకాలు పెండింగ్‌లో ఉన్నాయి. నిజామాబాద్‌లో 37062, కామారెడ్డిలో 26,300 మందికి అందాల్సి ఉన్నది. 

వెనక్కిపోతున్న చెక్కులు

సంగారెడ్డి జిల్లాలో పాస్‌పుస్తకాలు ఇచ్చే నెల రోజుల ముందుకు చనిపోయినవారికి, వారసత్వ పేర్ల మార్చకున్న వారికి కొత్త పుస్తకాలు రాలేదు. రంగారెడ్డి జిల్లాలో 2.82 లక్షల మందికిగాను 2.42 లక్షల మందికి పాస్‌పుస్తకాలు పంపిణీ చేశారు. మిగిలిన రైతులకు ఆధార్‌సీడింగ్‌ కాకపోవడం, రైతులు సరైన సమాచారం ఇవ్వకపోవడం వల్ల పంపిణీ చేయలేదు. దీనికితోడు భూరికార్డులకు సంబంధించిన వివరాలను ఎల్‌ఆర్‌ఈపీ వెబ్‌సైట్‌ నుండి ధరణి వెబ్‌సైట్‌కు మార్చే ప్రక్రియలో సాంకేతిక లోపాలు కొనసాగడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.జగిత్యాల జిల్లాలో పట్టాదారు పాస్‌పుస్తకంలో భూ విస్తీర్ణం సరిపోక పంపిణీ చేయాల్సిన చెక్కులు 3492 మంది రైతులకు నిలిపివేశారు. ఒకరి ఫొటోకు బదులు మరొకరి ఫొటో ప్రింట్‌ అయినవారి సంఖ్య 578 మంది రైతులున్నారు. ఒకే ఖాతాను రెండు నమోదు చేయడంతో 973 చెక్కులను నిలిపేశారు. 832 మంది రైతులకు సంబంధించి 1బీ నమోదు కాలేదు. ఇలా జిల్లాలో మొత్తం 43 వేలకుపైగా పట్టాదారు పాస్‌పుస్తకాలకు పరిష్కారం లభించాల్సి ఉన్నది.నిజామాబాద్‌ జిల్లాలో భూ విస్తీర్ణంలో తేడాలు, భూ యజమాని ఒకరైతే మరొకరి పేర్లు నమోదుకావడం, ఇతర లోపాల కారణంగా జిల్లాలో 17670 పట్టా పాస్‌పుస్తకాలు పంపిణీకి నోచుకోలేదు. సమాచార లోపం, చిరునామాలు తెలియక సుమారు 20 వేల పాస్‌పుస్తకాలు ఆగిపోయాయి. నల్లగొండ జిల్లాలో 31 మండలాల్లో 4 లక్షల 41 వేల 838 మంది రైతులుండగా.. వారిలో 3 లక్షలా 83 వేల 906 మందికి మాత్రమే డిజిటల్‌ పట్టాదారు పాస్‌పుస్తకాలు జారీ అయ్యాయి. మిగతా 57,932 మందివి పెండింగ్‌లో ఉన్నాయి. తల్లిదండ్రులు చనిపోతే వారి వారసులకు పౌతీ చేయడం, అన్నదమ్ముల భాగపంపిణీ చేయడం, ఇటీవలే కొనుగోలు చేసిన భూముల్ని క్లియర్‌ చేయడంలో జాప్యం చేస్తున్నారు. ఆ రైతులకు సంబంధించినవే అధికంగా పెండింగ్‌లో ఉన్నాయి. అసైన్డ్‌ భూములకు కొత్త పట్టా పాస్‌పుస్తకాలు అందించడంలోనూ నిర్లక్ష్యం కొనసాగుతున్నది. 

No comments:

Post a Comment