Breaking News

19/07/2019

ఈ ఏడాది కరువు బారిన అనంత రైతులు

అనంతపురం, జూలై 19, (way2newstv.in)
అనంతపురం లో మళ్లీ కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. ఈసారి సాధారణ వర్షాలు కురుస్తాయని అధికారులు ముందుగా చెబితే రైతులంతా సంతోషించారు. జూన్‌ ఆరంభంలోనే విత్తు కొనుగోలు చేసి సిద్ధమయ్యారు.జిల్లాలో ఈసారి వరుణుడు జాడలేకుండా పోతున్నాడు. జూన్‌ ఆరంభంలో కొన్ని వర్షాలు కురవడంతో రైతులు విత్తు వేసేందుకు ముందుకొచ్చారు. జూన్‌ నెల అంతా కలిపి అక్కడక్కడ వర్షాలు కురిశాయి. మొత్తంగా జూన్‌లో 63.9 మి.మీ. సాధారణ వర్షపాతం కురవాల్సి ఉండగా, కచ్చితంగా అంత వర్షపాతం నమోదైంది. అయితే ఇందులో ఎక్కువగా రాయదుర్గం, తాడిపత్రి, గుంతకల్లు, రాప్తాడు తదితర నియోజకవర్గాల్లోని కొన్ని మండలాల్లో ఎక్కువ వర్షపాతం నమోదైంది.  తీరా ఇప్పుడు పరిస్థితులు తారుమారు అవుతున్నాయి. జిల్లాలోని అతి కొద్ది ప్రాంతాల్లో మినహా అత్యధిక మండలాల్లో వరుణుడు ముఖం చాటేశాడు. ఇది రైతులపై తీవ్ర ప్రభావం చూపనుంది. 
ఈ ఏడాది కరువు బారిన అనంత రైతులు

జూన్‌ నుంచి మొదలైన ఖరీఫ్‌లో ఈసారి జిల్లాలో అన్ని పంటలు కలిపి 7.41 లక్షల హెక్టార్లలో పంటలు వేస్తారని అంచనా వేశారు. ఇందులో సాగునీటి సదుపాయం ఉన్న 48,481 హెక్టార్లు, మిగిలిన 6.92 లక్షల హెక్టార్లంతా వర్షాధారంగానే పంటలు వేస్తారని వ్యవసాయ దిక్కు తోచడం లేదు.మరోవైపు వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిపెడుతున్నారు. ఆయా ప్రత్యామ్నాయ పంటల విత్తును సిద్ధం చేయడంపై చర్చలు జరుపుతున్నారు. ఈసారి వర్షాభావం ఏర్పడితే దాదాపు లక్ష హెక్టార్లలో ప్రత్యామ్నాయ పంటలు వేసే వీలుందని తొలుత అంచనా వేశారు. అయితే వర్షాలు లేకపోవడంతో, 2 లక్షల హెక్టార్లకుపైగానే ప్రత్యామ్నాయ పంటలు వేసే అవకాశం ఉంటుందని తాజాగా భావిస్తున్నారు. ఎక్కువగా ఉలవలు, కందులు, పెసలు విత్తును సిద్ధం చేయడంపై సమాలోచనలు చేస్తున్నారు. వీటికి కూడా ఓ పదును వర్షం అవసరమేనని, ఆ వర్షం కురిస్తేనే ప్రత్యామ్నాయ పంటలు కూడా సాగయ్యే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతానికి మాత్రం ఈ నెలాఖరు వరకు వర్షాలు కురిస్తే, వేరుసెనగ సాగు పెరుగుతుందనే ఆశతో అటు రైతులు, ఇటు వ్యవసాయశాఖ అధికారులు ఎదురుచూస్తున్నారు. జిల్లా అంతటా సగటున సాధారణ వర్షపాతంగా లెక్కించారు. ఇక ఈ నెలలో అసలు వర్షాలు లేకుండా పోతున్నాయి. ఈ నెలలో సగటున 67.4 మి.మీ వర్షపాతం కురవాల్సి ఉంది. అలాగే మంగళవారం నాటికి (17వ తేదీ) 42.4 మి.మీ వర్షానికి గాను కేవలం 17.6 మి.మీ. వర్షమే కురిసింది. అంటే 58.5 శాతం తక్కువ వర్షపాతం నమోదయింది .సాధారణంగా జిల్లాలో సగటున 2.5 మి.మీ వర్షం కురిస్తే, దానిని సాధారణ వర్షం కురిసిన రోజుగా అధికారులు పరిగణిస్తారు. అయితే జిల్లాలో ఈ నెలలోని 17 రోజుల్లో మూడు రోజులు మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. 2, 10, 12 తేదీల్లో 2.5 మీ.మీ, అంతకంటే ఎక్కువగా వర్షం కురిసింది. 12 రోజులు సగటున కేవలం 1 మి.మీ. కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. అలాగే ఇందులో మూడు రోజులు అసలు జిల్లాలో ఎక్కడా వర్షపాతమే నమోదు కాకపోవడం విశేషం.జిల్లాలో అత్యధిక విస్తీర్ణంలో వర్షాధారంగా వేరుసెనగ పంట సాగు చేస్తారు. దాదాపు అన్ని మండలాల్లో రైతులకు ఇదే ప్రధాన పంట. అయితే ఎక్కడా ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గత ఏడాది జూన్‌ ఆరంభంలో కొంత వర్షాలు, తర్వాత జులైలో ఆలస్యంగా వర్షాలు కురిశాయి. దీంతో కొందరు రైతులు ఆలస్యంగా విత్తువేశారు. అలాగే పంటలు ఎండిపోతున్నాయనే సమయంలో సెప్టెంబరు, అక్టోబరులో రికార్డు స్థాయిలో భారీ వర్షాలు కురిసి మంచి దిగుబడి వచ్చేలా చేశాయి. అయితే ఈసారి ఆ పరిస్థితి కన్పించడం లేదు. ఒక పదును ఉన్న మంచి వర్షం కురిస్తే, విత్తు వేద్దామనుకుంటున్న రైతులకు తీవ్ర నిరాశ ఎదురవుతోంది. ఎక్కడా వర్షపు జాడ లేదు. సాధారణంగా జులై 15-20 వరకు వేరుసెనగ విత్తు వేస్తే మంచి దిగుబడి వస్తుందని రైతులు భావిస్తుంటారు. ఇప్పుడా సమయం ముగిసిపోయింది. ఈ నెలాఖరు వరకు విత్తు వేసినా ఫర్వాలేదని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నా.. అప్పటికైనా వర్షాలు కురుస్తాయనే నమ్మకాలు కనిపించడం లేదు.కొద్ది రోజులుగా పెద్దఎత్తున పడమటి గాలులు వీస్తున్నాయి. సాధారణంగా ఈ సమయంలో జిల్లాలో సగటున గంటకు 18 కి.మీ. వేగంతో గాలులు వీయాలి. వారం రోజులుగా సగటున 23.4 కి.మీ. నుంచి 23.6 కి.మీ. వేగంతో వీస్తున్నాయి. కొన్ని మండలాల్లో 30 కి.మీ.కుపైగా వేగంతో గాలులు వీస్తున్నాయి. మంగళవారం కొన్ని సమయాల్లో బత్తలపల్లిలో 37.21 కి.మీ.లు, వజ్రకరూరులో 34 కి.మీ. వేగంతో గాలులు వీచినట్లు నమోదైంది. ఈ భారీ గాలులు వర్షాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. వర్షం కురవనివ్వకపోవడం, అసలు మేఘమే నిలకడగా ఉండనివ్వకుండా చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నెలాఖరు వరకు జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏదైనా అల్పపీడనం ఏర్పడటం, తుపాన్లు వస్తే వాటితో అనంతపురం జిల్లాలో వర్షాలు కురవడం మినహా, ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధారణ వర్షం కురిసే పరిస్థితులు కూడా లేవని చెబుతున్నారు. గాలుల ప్రభావం కూడా వచ్చే ఐదు రోజులు కూడా 19 కి.మీ. నుంచి 22 కి.మీ. వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

No comments:

Post a Comment