Breaking News

18/07/2019

విద్యా వాలంటీర్ల పై రాని క్లారిటీ

కరీంనగర్, జూలై 18, (way2newstv.in)
కరీంనగర్‌ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా వలంటీర్ల నియామకాలపై స్పష్టత కొరవడింది.. ఉపాధ్యాయుల కొరత, దీర్ఘకాలిక సెలవుల్లోని ఉపాధ్యాయులు, విద్యార్థుల సంఖ్య అధికంగా గల బడుల్లో బోధనకు ఆటంకాలు ఎదురవకుండా ప్రత్యామ్నాయంగా నిలవాల్సిన విద్యా వలంటీర్ల నియామకాలు జిల్లాలో అవసరానికి తగ్గట్లు ఉండటం లేదు. ఇటీవల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయుల బదిలీలు జరిగాయి. వీటి అనంతరం కూడా చాల పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత నెలకొనగా.. పలు పాఠశాలల్లో పదవీ విరమణ పొందిన వారి పోస్టులతో పాటు దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్న వారి స్థానాలు ఖాళీగా ఉంటున్నాయి. మరో వైపు విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండి ఉపాధ్యాయుల సంఖ్య  తక్కువగా ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో బోధనకు ఇక్కట్లు ఎదురవుతున్నాయి.
విద్యా వాలంటీర్ల పై రాని క్లారిటీ

బదిలీల అనంతరం పాఠశాలల్లో ఇలాంటి సమస్యను నివారించేందుకు రాష్ట్ర విద్యా శాఖ విద్యా వలంటీర్ల నియామకాలకు ముందుకురావడం ఉపాధ్యాయుల్లో సంతోషాన్ని నింపింది. జిల్లాలో విద్యా వలంటీర్ల అవసరం గల పాఠశాలలను గుర్తించి 205 మంది అవసరమని జిల్లా విద్యాశాఖ ఇటీవల రాష్ట్ర విద్యాశాఖకు ప్రతిపాదనలను పంపింది. అయితే రాష్ట్ర విద్యాశాఖ మొత్తం 139 మంది విద్యా వలంటీర్లను నియమించుకోవాలని ఉత్తర్వులను జారీ చేస్తూ నియామకాల ప్రకటన విడుదల చేయడంతో జిల్లా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు కంగు తినాల్సి వచ్చింది. అవసరానికి తగ్గట్లు నియమించుకొనే అవకాశం లేకుండా పోయింది. వీరిని ఏ పాఠశాలల్లో నియమించాలన్న దానిపైనా స్పష్టత కొరవడుతోందిజిల్లాలోని పాఠశాలల్లో వారు ఎంతమంది అవసరం ఉన్నారని జిల్లా విద్యాశాఖ గుర్తిస్తే.. రాష్ట్ర విద్యాశాఖ అందుకు భిన్నంగా నియామకాలు చేపట్టాల్సిన సంఖ్యను మంజూరు చేసింది. దీంతో పలు పాఠశాలల్లో బోధనకు సమస్యలు ఏర్పడనున్నాయి. విద్యార్థులు లేక మూతపడుతున్న బడులను తెరిపించే అవకాశాలు కనిపించడం లేదు. జిల్లాలోని 13 పాఠశాలలు విద్యార్థులు లేక మూతపడగా, తక్కువ సంఖ్యలో గల విద్యార్థులు గల మరో 40 ప్రాథమిక పాఠశాలల్లో ఒకే ఉపాధ్యాయునితో బోధన కొనసాగుతోంది. 80 ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమ తరగతులను బోధిస్తున్నా వాటిల్లో బోధనకు అదనంగా ఉపాధ్యాయులు కరవయ్యారు. వీరికి తోడు పలు ఉన్నత పాఠశాలల్లో, ఉర్దూ మాధ్యమ పాఠశాలల్లో పండిత పోస్టుల కొరత నెలకొంది. ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు 205 మంది విద్యా వలంటీర్లు అవసరమని జిల్లా విద్యాశాఖ పంపిన ప్రతిపాదనలకు రాష్ట్ర విద్యాశాఖ కొరివి పెట్టడంతో బోధన సమస్యలు తీరేలా కనిపించడం లేదు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండి ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువగా గల పాఠశాలల నుంచి ఉపాధ్యాయులను ఈ ఏడాది సర్దుబాటు చేయలేదు. గ్రామస్థులు, ఉపాధ్యాయులు సమష్టి కృషితో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలను పెంచుకుని వాటికి జీవం పోస్తున్న తరుణంలో బోధనకు ఏర్పడుతున్న సమస్యలు ప్రతిబంధకంగా మారుతున్నాయి. జిల్లాలో అవసరం మేరకు విద్యా వలంటీర్ల నియామకాలను చేపట్టే విషయంలో జిల్లాలోని పాలకులు జోక్యం చేసుకుని పాఠశాలల్లో బోధనకు సమస్య లేకుండా వారి నియామకాలను చేపట్టాలని పలు ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు, పలువురు ఉపాధ్యాయులు కోరుతున్నారు.

No comments:

Post a Comment