Breaking News

25/07/2019

చెరువులు మాయం... (మెదక్)

మెదక్, జూలై 25 (way2newstv.in): 
భావితరాలకు బహుమతిగా అందించాల్సిన చెరువులు, కుంటలు కళ్లెదుటే కనుమరుగవుతున్నాయి. ఎక్కడికక్కడ ఆక్రమణలకు గురవుతున్నాయి. కబ్జాలకు అడ్డుకట్ట వేయాల్సిందెవరు? జల వనరులను రక్షించేదెవరు? చెరువులు, కుంటల రక్షణను నీటి పారుదల శాఖకు అప్పగించాలంటూ హెచ్‌ఎండీఏ చేతులెత్తేసింది. నెలకోసారి సమావేశమై చర్యలు తీసుకోవాల్సిన లేక్‌ ప్రొటెక్షన్‌ కమిటీ (ఎల్‌పీసీ) కాగితాలకే పరిమితమైంది. క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సిన రెవెన్యూ అధికారులు వారికేం సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తుండటంపై పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.చెరువులు, కుంటలు కబ్జాలకు గురై కనుమరుగైతే తలెత్తే ప్రమాదం అంతా ఇంతా కాదు. సెప్టెంబర్‌ 2017లో ఒక్కసారిగా 10 సెం.మీ వర్షపాతం నమోదు కావడంతో చెరువులు పొంగి పొర్లాయి. మల్కాజిగిరి లాలాపేట్‌ నాలా ఎగువన ఉంటుంది. ఆ మార్గంలో తొలుత బండ చెరువు, దానిపై సఫిల్‌గూడ, ఆర్‌కేపురం చెరువులున్నాయి. 
చెరువులు మాయం... (మెదక్)

అదేరోజు కీసరలోనూ భారీ వర్షం కురిసింది. వాననీరంతా ఆర్‌కే పురం చెరువును ముంచెత్తింది. అక్కడి నుంచి వరద వాజ్‌పేయినగర్‌ నాలా మీదుగా సఫిల్‌గూడ చెరువుకు, అక్కడి నుంచి బండచెరువుకు పోటెత్తింది. బండచెరువు అప్పటికే మురుగుతో నిండి ఉండటం వల్ల పైనుంచి వచ్చిన నీరంతా చుట్టూ ఉన్న కాలనీల్లోకి పొంగి పొర్లింది. కాసేపటికి మూడు చెరువుల్లో అదే పరిస్థితి ఉత్పన్నం అయింది. ఎన్‌ఎండీసీ కాలనీ, అనిల్‌ సరస్వతి నగర్‌, షిరిడీనగర్‌, శీపల్లికాలనీ, కృష్ణానగర్‌, పటేల్‌నగర్‌, దుర్గానగర్‌, వసంతపురి కాలనీ, ప్రశాంతపురి కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి. కాలనీల్లో నడుము లోతు నీరు చేరింది. నాలాలు, కాలనీలు చెరువులను తలపించాయి. మూడు చెరువుల్లోనూ ఎఫ్‌టీఎల్‌తో పాటు బఫర్‌జోన్‌ను ఆక్రమించి వందలాది నిర్మాణాలు వెలిశాయి. చెరువుల మత్తడి సైతం పూడిపోయింది. దిగువకు వరదను తీసుకెళ్లే నాలాలూ కనుమరుగు కావడమే ఈ పరిస్థితి కారణం.హెచ్‌ఎండీఏ పరిధిలోకి వచ్చే ఏడు జిల్లాల్ల్లో (7,257 చ.కి.మీ విస్తీర్ణం) జల వనరుల లెక్క తేల్చే బాధ్యతను ఓ ప్రైవేట్‌ కన్సల్టెన్సీకి అప్పట్లో అప్పగించారు. సదరు సంస్థ వివిధ దశల్లో లెక్కింపు ప్రక్రియను చేపట్టి 3132 చెరువులు, కుంటలు ఉన్నట్లుగా తేల్చింది. లెక్కలోకి రాని వనరుల సంఖ్య ఇంకా ఉంది. ఎక్కడికక్కడ కబ్జాలకు గురవుతున్నా హెచ్‌ఎండీఏ అధికారులు అటువైపు చూడటం లేదు. ఎవరైనా ఫిర్యాదు చేసినప్పుడే మాత్రమే హడావిడి చేస్తున్నారు. ఆ తర్వాత తమకేం సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. సిబ్బంది కొరత ఇతర కారణాలతో చెరువులు, కుంటల రక్షణను తమ నుంచి తప్పించాలంటూ ఎప్పటి నుంచో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి చేతులు దులుపుకొన్నారు. పోనీ జల వనరులకు లక్ష్మణ రేఖలాంటి పూర్తిస్థాయి నీటి సామర్థ్యం (ఎఫ్‌టీఎల్‌) సరిహద్దులనైనా గుర్తించారా అంటే అదీ లేదు. 2013 నుంచి కొనసా...గుతోంది. 3132కు కేవలం 165కు మాత్రమే తుది నోటిఫికేషన్‌ను జారీ చేశారంటే వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రెవెన్యూ, నీటి పారుదల శాఖాధికారులు సహకరించక పోవడం వల్లే అడుగు ముందుకు పడటం లేదని వివరిస్తున్నారు.చెరువులు, కుంటల రక్షణలో కీలకంగా వ్యవహరించాల్సిన లేక్‌ ప్రొటెక్షన్‌ కమిటీ (ఎల్‌పీసీ) సమావేశమై ఏకంగా 8 నెలలు దాటిందంటే వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. చెరువుల రక్షణకు హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం 2010 ఏప్రిల్‌లో ఎల్‌పీసీ ఏర్పాటైంది. ఇందులో వివిధ ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, జలమండలి ఎండీ, హెచ్‌ఎండీఏ పరిధిలోకి వచ్చే జిల్లాల కలెక్టర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. హెచ్‌ఎండీఏ కమిషనర్‌ ఛైర్మన్‌గా, హెచ్‌ఎండీఏ అర్బన్‌ ఫారెస్ట్రీ డైరెక్టర్‌ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. నెలకోసారి సమావేశమై జల వనరులను కబ్జాల నుంచి రక్షించేందుకు చొరవ చూపాలి. ఇప్పటివరకు 17 సార్లు సమావేశమైనా ఒక్క చెరువు, కుంటనూ కాపాడేందుకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అప్పుడప్పుడు నిర్వహించే ఎల్‌పీసీ సమావేశాలకు హాజరయ్యే తీరిక కూడా సభ్యులకు లేదు. గంటసేపు హడావిడిగా సమావేశాన్ని నిర్వహించి మమ అనిపిస్తున్నారు హెచ్‌ఎండీఏ అధికారులు.నగర శివారు ప్రాంతాల్లో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. చెరువులు, కుంటలను ఆక్రమించి లేఅవుట్లు వేసేస్తున్నారు. ఎఫ్‌టీఎల్‌ భూముల్లోనే భారీ భవనాలు నిర్మిస్తున్నారు. శిఖం భూములు కబ్జాకు గురవడంతో గండిపేట నీటి నిల్వ సామర్థ్యం 5.541 టీఎంసీల నుంచి 3.900 టీఎంసీలకు పడిపోయింది. హిమాయత్‌సాగర్‌ నీటి నిల్వ సామర్థ్యం 3.232 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 1.480 టీఎంసీలకు తగ్గిపోయిందంటే వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. తటాకాలు మురుగు, ప్రమాదకర పారిశ్రామిక రసాయన వ్యర్థాలు చేరుతుండటంతో కాలుష్యంతో కంపు కొడుతున్నాయి. ఆక్రమణలను తొలగించాల్సిన హెచ్‌ఎండీఏ అధికారులు అభివృద్ధి పేరిట హడావిడి చేస్తున్నారు. చెరువుల సుందరీకరణ పనులు శిఖం భూముల ఆక్రమణకు తావిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చుట్టూ కాలిబాటలు నిర్మిస్తూ వాటికి వెలుపల చెరువు స్థలాలను వదిలేస్తున్నారని, కంచె నిర్మాణంలోనూ జాగ్రత్తలు తీసుకోవట్లేదని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు క్షేత్రస్థాయిలో ఉండే రెవెన్యూ సిబ్బంది అక్రమార్కులతో కుమ్మక్కై కబ్జాలను చూసీ చూడనట్లుగా వదిలేస్తున్నారంటూ వాపోతున్నారు. ఇలాంటి తరుణంలో చెరువులు, కుంటల రక్షణకు ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరముందని స్పష్టం చేస్తున్నారు. కర్ణాటక, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో ఉన్నట్లుగా ‘లేక్‌ ప్రొటెక్షన్‌ అథారిటీ’కి శ్రీకారం చుట్టాలని సూచిస్తున్నారు. కేంద్రం నుంచి కూడా నిధులు అందే అవకాశముందని వివరిస్తున్నారు.

No comments:

Post a Comment