Breaking News

17/07/2019

22 తర్వాతే కాంగ్రెస్ అధ్యక్షుడి పేరు

న్యూఢిల్లీ, జూలై 17, (way2newstv.in)
కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతల నుంచి రాహుల్ గాంధీ వైదొలగడంతో ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేయనున్నారన్న అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి విషయంలో పార్టీ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో కొత్త సారధి ఎంపిక మరింత ఆలస్యంకావచ్చని తెలుస్తోంది. పార్లమెంటు సమావేశాలు కొనసాగుతుండడం కూడా కాంగ్రెస్ సారథి ఎంపిక ప్రక్రియ ఆలస్యం కావడానికి కారణంగా తెలుస్తోంది. ఈ నెల 22 తర్వాతే ఈ విషయంలో ఓ నిర్ణయానికి వచ్చే అవకాశముందని కాంగ్రెస్ వర్గాల సమాచారం.మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోర వైఫల్యం చెందడంతో పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు రాహుల్ గాంధీ ప్రకటించారు. 
22 తర్వాతే కాంగ్రెస్ అధ్యక్షుడి పేరు

పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలని పలువురు పార్టీ నేతలు, మిత్రపక్షాల నేతలు బుజ్జగించినా రాహుల్ వెనక్కి తగ్గలేదు. అధ్యక్షుడిగా కొనసాగేది లేదని రాహుల్ గాంధీ తెగేసి చెప్పేయడంతో...ఆయన వారసుడిగా అశోక్ గెహ్లెట్, ఏకే ఆంటోనీ, మల్లికార్జున ఖర్గే తదితర సీనియర్ల పేర్లు వినిపించాయి. అటు రాహుల్ గాంధీ వారసుడిగా పార్టీ యువనేతలు సచిన్ పైలెట్, జ్యోతిరాధిత్య సింథియా, మిలింద్ థేవ్‌రా కూడా రేసులో ఉన్నట్లు గత వారం ప్రచారం జరిగింది. యువ నాయకత్వానికి పార్టీ సారథ్య పగ్గాలు అప్పగించాలని పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీంధర్ సింగ్ ఇది వరకే పార్టీ నాయకత్వానికి సూచించారు.దాదాపు రెండు మాసాలు కావస్తున్నా...ఇప్పటి వరకు కాంగ్రెస్ అధ్యక్షుడి విషయంలో ఆ పార్టీ నేతలు ఓ తుది నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఈ నెల 22 తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమై...రాహుల్ గాంధీ రాజీనామాను ఆమోదించనున్నట్లు తెలుస్తోంది. అలాగే త్వరలో పలు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు బాధ్యునిగా ఓ పార్టీ నేతను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించే అవకాశమున్నట్లు సమాచారం. పార్టీ అధ్యక్షుడి ఎంపికకు ముందు ప్రధాన కార్యదర్శిని నియమించడం ద్వారా కనీసం ఆరు మాసాలు నెట్టుకురావచ్చన్నది కాంగ్రెస్ సీనియర్ల యోచనగా తెలుస్తోంది.

No comments:

Post a Comment