Breaking News

25/06/2019

పల్లెల్లో


చెత్త నుంచి ఎరువు 
ఖమ్మం, జూన్ 25, (way2newstv.in)
ఏటా వర్షాకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో తరుణ వ్యాధులు విజృంభిస్తున్నాయి.. విష జ్వరాలు ప్రబలి పదుల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడుతున్నారు. దీనికి కారణం పరిసరాల అపరిశుభ్రత, దోమల వ్యాప్తి.. పల్లెల్లో చెత్త నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పుడు పల్లెల్లో చెత్తను సేకరించి ఎరువుగా మార్చే ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. దీంతో గ్రామీణ ప్రాంతాలు పరిశుభ్రంగా మారనున్నాయి.గ్రామాల్లో ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను ఎరువుగా మార్చే ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో అమల్లోకి రానుంది. ఉపాధి హామీ పథకంతోపాటు టీఎఫ్‌సీ, పంచాయతీ నిధులను దీనికి వినియోగిస్తారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో భాగంగానే చెత్తను ఎరువుగా మార్చే ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ పేర్కొంది. దీని ప్రకారం ఒక్కో కార్మికుడు గ్రామాల్లో 75 ఇళ్ల నుంచి సుమారు 40 కిలోల చెత్త సేకరించాల్సి ఉంది. గిరిజన, కొండ ప్రాంతాల్లోని పల్లెల్లో 50 ఇళ్ల నుంచి సేకరిస్తే చాలని నిర్దేశించారు. ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను రిక్షా ద్వారా నిర్దేశిత ప్రదేశానికి తరలిస్తారు. అక్కడ చెత్త నుంచి ఎరువుగా మారేందుకు అనువుగా ఉన్న పదార్థాలను వేరు చేస్తారు. 

పల్లెల్లో 


కుళ్లడానికి వీలుగా ఉన్న పదార్థాలను ఎరువు తయారీకి తీసిన గోతిలో వేస్తారు. మిగతా చెత్తను డంప్‌యార్డుకు తరలిస్తారు. ఒక్కో కార్మికుడు 8గంటలు పనిచేస్తారు. వీరికి వేతనాలను పంచాయతీల నుంచి చెల్లించాలి. చెత్త సేకరించే, వీధులను శుభ్రం చేసే కార్మికులకు ఉపాధి హామీ కూలీలకు ఇచ్చే కనీస వేతనాన్ని పంచాయతీలు అందించాల్సి ఉంది. టీఎఫ్‌సీ నిధులతో కార్మికులకు చేతి తొడుగులు, బూట్లు, జాకెట్లు, మాస్కులు, చీపుర్లు, టార్ఫాలిన్‌ పట్టాలు పంచాయతీలు సమకూరుస్తాయి. చెత్త వేసే ప్లాట్‌ఫాం, ఎరువుల గోతుల తవ్వకం, డంప్‌యార్డుల నిర్మాణ పనులు ఉపాధి హామీ నిధులతో చేపట్టనున్నారు. స్వచ్ఛ భారత్‌ ద్వారా రిక్షాలు అందిస్తారు. ఈ ప్రక్రియ అమలులో గ్రామ పారిశుద్ధ్య కమిటీలు కీలక పాత్ర పోషించనున్నాయి.ఇళ్ల నుంచి సేకరించిన చెత్తలో అనువుగా ఉండే పదార్థాలతో ఎరువుగా మార్చే ప్రక్రియను అమలు చేయనుంది. ఉపాధి హామీతోపాటు వివిధ రకాల నిధులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ ప్రక్రియ కార్యరూపం దాల్చితే గిరిజన పల్లెలు పరిశుభ్రతకు నిలయంగా మారుతాయి. మన్యం జిల్లా అయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గ్రామాల్లో ఏటా వర్షాకాలంలో తరుణ వ్యాధులు విజృంభిస్తున్నాయి. దీనికి కారణం ప్రధానంగా అపరిశుభ్రత, దోమల స్వైరవిహారం, కలుషిత నీరే. దీంతో జిల్లాలోని వివిధ మండలాల్లో విష జ్వరాలు, అతిసారం వంటి వ్యాధులతో ప్రజలు మృత్యువాత పడుతున్నారంటే పరిస్థితి అర్థమవుతుంది. మలేరియా, డెంగీ, విష జ్వరంతో గుండాల, ఇల్లెందు, బయ్యారం, గార్ల, టేకులపల్లి, కారేపల్లి, కామేపల్లి, కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు తదితర మండలాల్లో గిరిజనులు తరుణ వ్యాధులతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. అధికంగా నిరక్షరాస్యులు కావడం, వ్యాధులపై అవగాహన లేకపోవడంతో విష జ్వరాలకు బలవుతున్నారు. గ్రామాల్లో మెరుగైన పారిశుద్ధ్యం అందించడంలో గ్రామ పంచాయతీలు విఫలమవుతున్నాయి. టీఎఫ్‌సీ నిధులను సక్రమంగా వినియోగించడం లేదనే విమర్శలున్నాయి. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా మారుతుంది. 

No comments:

Post a Comment