Breaking News

08/06/2019

దవఖానాపై నిఘా (ఆదిలాబాద్)

ఆదిలాబాద్, జూన్ 8 (way2newstv.in): 
జిల్లాలోని పీహెచ్‌సీ(ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు) ఇక నిఘా నీడలోకి చేరనున్నాయి. కేంద్రాల్లో పని చేస్తున్న సిబ్బంది హాజరు, ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులు, గర్భిణులు, టీకాల కార్యక్రమాన్ని పరిశీలించటానికి వీటిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ వ్యవస్థకు అంతర్జాలం జోడించి పర్యవేక్షణను కేంద్రీకరించనున్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలోనూ అంతర్జాలం ద్వారా పర్యవేక్షణ చేయటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా మొదట ఆదిలాబాద్‌ పట్టణంలోని పుత్లీబౌలి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ఏర్పాటు, వాటికి ఇంటర్నెట్ కు అనుసంధానించనున్నారు.జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మరో అయిదు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఇటీవల ఉట్నూర్‌ ప్రాంతంలో ఐటీడీఏ పీఓ ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించగా అక్కడ సిబ్బంది లేకపోవటాన్ని పసిగట్టారు. ఇతర గ్రామీణ పీహెచ్‌సీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉంది. 

దవఖానాపై నిఘా (ఆదిలాబాద్)
వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండటం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో జిల్లాలోని పీహెచ్‌సీల్లో పని చేసే సిబ్బంది హాజరు, కేంద్రాల పనితీరును పర్యవేక్షించటానికి అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా మొదట ఆదిలాబాద్‌ పట్టణంలోని పుత్లీబౌలి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రయోగాత్మకంగా బుధవారం ఈ నిఘా కెమెరాలను ఏర్పాటు చేశారు. దీనికి అంతర్జాలంను అనుసంధానించనున్నారు. ఈ విధానం ఇక్కడ విజయవంతమైతే మిగతా అన్ని పీహెచ్‌సీల్లోనూ ఏర్పాటు చేస్తారు. దీనికి తోడు ప్రతి కేంద్రంలో బయోమెట్రిక్‌ విధానం కొనసాగించనున్నారు.నిఘా కెమెరాలు ఏర్పాటు చేసి, అంతర్జాలం అనుసంధానించాక పీహెచ్‌సీల పని తీరును రాష్ట్ర, జిల్లా స్థాయిల్లోనూ పరిశీలించే వెసులుబాటు అధికారులకు కలుగుతుంది. ఏ కేంద్రంలో ఎన్ని గంటలకు సిబ్బంది వస్తున్నారు? రోగుల రాక ఎలా ఉంది? టీకాలు ఇచ్చే కార్యక్రమాలు కొనసాగుతున్నాయా? నిర్దేశిత సమయం వరకు ఈ కేంద్రాలు పని చేస్తున్నాయా? అనే అన్ని అంశాలను అధికారులు ప్రత్యక్షంగా పరిశీస్తారు. రాష్ట్ర స్థాయిలో పరిశీలన సందర్భంగా ఏమైనా లోటుపాట్లు గమనిస్తే జిల్లా స్థాయి అధికారులకు సూచనలు చేసి పరిస్థితిని క్రమబద్ధీకరించేలా చర్యలు తీసుకొంటారు.బయోమెట్రిక్‌ విధానం వల్ల సిబ్బంది వచ్చి అందులో వేలిముద్ర వేసి వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. కాని నిఘా కెమెరాల ఏర్పాటు అనంతరం వచ్చిన సిబ్బంది కేంద్రంలో ఉన్నారా? లేదా? అనే విషయాలను ఉన్నతాధికారులు నేరుగా పరిశీలించే అవవకాశం ఉంటుంది. దీంతో వైద్యులు, సిబ్బంది విధులకు డుమ్మా కొట్టడం కుదరదు. నిర్దేశిత సమయాల్లో కేంద్రాలకు వచ్చి బయోమెట్రిక్‌ విధానంలో వేలి ముద్రతో హాజరు వేసుకోవాల్సి ఉంటుంది. నిబంధనల మేరకు విధులు నిర్వర్తించాల్సి వస్తుంది. సిబ్బంది, అధికారులు ఇలా వచ్చి, అలా బయటకు వెళ్లిపోవటానికి వీలు కాదు.పీహెచ్‌సీల్లో అంతర్జాలం అనుసంధానంతో నిఘా కెమెరాల ఏర్పాటు చేయటం వల్ల రోగులకు ఆశించిన మేర సేవలు అందే అవకాశం ఉంది. అనధికారికంగా వైద్యులు, సిబ్బంది బయటకు వెళ్లటానికి వీలు కాదు.. వచ్చిన బాధితులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలందుతాయి. చిన్నారులు, గర్భిణులకు టీకాలు వేయటం, గర్భిణులకు నెలవారీ పరీక్షలు సజావుగా జరగటానికి వీలవుతుంది.

No comments:

Post a Comment