Breaking News

08/06/2019

రైతన్నకు భరోసా (ఖమ్మం)

ఖమ్మం, జూన్ 8 (way2newstv.in): 
భూ రికార్డుల నవీకరణ పథకం సాధ్యమైనంత త్వరగా కొలిక్కి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఖరీఫ్‌ సీజన్‌ సమీపంలో ఉండటం.. భూ సమస్యలు వేలల్లో ఉండటంతో సదరు పక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని నిర్దేశించింది. పెట్టుబడి సాయం ఈ నెల రెండో వారంలో రైతుల ఖాతాలకు చేర్చాలన్న కృతనిశ్చయంతో ఉండగా.. సదరు గడువులోగా రికార్డుల నిర్వహణ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ధరణి వెబ్‌సైట్‌లో వివరాల క్రోడీకరణ మేరకు పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేస్తోంది.ఇటీవల జిల్లాకు 4,427 పట్టాదారు పాసుపుస్తకాలు రాగా.. నెల రోజుల క్రితం 8 వేల వరకు పాసుపుస్తకాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రైతులకు వెంట వెంటనే పంపిణీ చేయాలని నిర్దేశించగా తహసీల్దార్లు కార్యాచరణ రూపొందిస్తున్నారు. కరీంనగర్‌ రెవెన్యూ డివిజన్‌లో 1,989, హుజూరాబాద్‌ డివిజన్‌లో 2,438 పాసుపుస్తకాలు రాగా రెండ్రోజుల్లో పంపిణీ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఈనెల 10లోగా రికార్డుల నవీకరణ పూర్తయితే రైతులందరికి పెట్టుబడి సాయంతో పాటు పంట రుణం తీసుకునే అవకాశముంటుంది. 

రైతన్నకు భరోసా (ఖమ్మం)

అందులో భాగంగానే పది రోజుల్లో రైతుల భూ సమస్యలు తీర్చాలని నిర్దేశించారు. రాయితీ విత్తనాలు తీసుకోవాలన్నా.. ఎరువులు తీసుకోవాలన్నా పట్టాదారు పాసుపుస్తకం అనివార్యం కావడంతో వేలమంది రైతులు పరిష్కారం కొరకు ఎదురుచూస్తున్నారు. గత ఖరీఫ్‌ నుంచి పెట్టుబడి సాయం పథకానికి అంకురార్పణ చేయగా జిల్లాలో 1.52 లక్షల మంది లబ్ధి పొందిన రైతులు ఉండగా సుమారు 34 వేల మందికి పైగా రైతులు సంక్షేమ పథకాలకు దూరమయ్యారు. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతు సమస్య తీర్చాలని స్పష్టం చేయడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి.కోర్టు కేసులున్న భూములను పార్ట్‌-బిలో చేర్చిన విషయం విధితమే. పార్ట్‌-ఎలో ఇతర భూముల వివరాలుండగా సదరు ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చినట్లే. పార్ట్‌-బిలో దేవాదాయ భూములు, అటవీ భూములు, కోర్టు కేసులుండటంతో రాజీపడే అంశాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. కరీంనగర్‌, హుజూరాబాద్‌ రెవెన్యూ డివిజన్లలో 11,232 మంది రైతులున్నారని సమాచారం. వారసత్వ వివాదాలు, విక్రయ లొసుగులు, అన్నదమ్ముల మధ్య వివాదాలు, సమాన వాటా తదితర కేసులు కోర్టులో ఉండగా వాటిపై దృష్టి సారించనున్నారు. కాగా ధరణి వెబ్‌సైట్‌ సిటిజన్‌ పోర్టల్‌లో కనిపిస్తుండగా వారం రోజుల్లో ప్రజలకు అందుబాటులో రానుంది.భూ రికార్డుల నవీకరణ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 12 విడతలుగా పట్టాదారు పాసుపుస్తకాలు వచ్చాయి. తహసీల్దార్‌ కార్యాలయాలకు వాటిని చేర్చుతుండగా.. పాసుపుస్తకం ఇచ్చేందుకు పలువురు వీఆర్వోలు, గిర్దావర్లు డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. డిమాండ్‌ మేరకు ఇవ్వకుంటే వివిధ కారణాలతో తిప్పుకుంటున్నారని గతంలో పాసుపుస్తకాలు తీసుకున్న రైతులు వివరించారు. మామూళ్ల బెడద లేకుండా పనులు జరిగేలా చూడాలని రైతులు కోరుతున్నారు.

No comments:

Post a Comment