Breaking News

24/06/2019

బీసీలకు గాలం వేస్తున్న జగన్


రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు
న్యూఢిల్లీ, జూన్ 24, (way2newstv.in)
ఏపీలో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీసీల అండతో ఘనవిజయం అందుకున్న సీఎం జగన్.. వారిని రెడ్లు, మైనార్టీలు, ఎస్సీ,ఎస్టీల తరహాలో స్ధిరమైన ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకు దీర్ఘకాలిక వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతూ ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో నిన్న ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రవేశపెట్టారు. ఇప్పటికే బీసీలకు తన కేబినెట్‌లో సింహభాగం కేటాయించిన జగన్.. భవిష్యత్తులో వారికి మరిన్ని తాయిలాలు ప్రకటించే అవకాశముంది. ఏపీలో దశాబ్దాలుగా టీడీపీ ఓటు బ్యాంకుగా ఉన్న బీసీలు తొలిసారిగా వైసీపీ వైపు మొగ్గారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సహా పలువురు ప్రభావశీలమైన కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ వారు ఆ పార్టీ కన్నెత్తి చూడలేదు. కానీ ఈసారి పరిస్ధితి మారింది. ఇచ్చిన మాట మీద నిలబడతారని వైఎస్ కుటుంబానికి ఉన్న పేరు ఈసారి బీసీలను జగన్ వైపు మొగ్గేలా చేసింది.. 


బీసీలకు గాలం వేస్తున్న జగన్
తాజా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్బంగా టీడీపీ కూడా భారీఎత్తున బీసీ సభలను నిర్వహించినా బీసీ కులాలు మాత్రం తొలిసారిగా వైఎస్ జగన్ ను నమ్మాయి. దీని ఫలితమే రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతంగా ఉన్న బీసీలు ఎన్నడూ లేని స్ధాయిలో వైసీపీకి అండగా నిలవడం, తద్వారా ఆ పార్టీ ఘనవిజయం అందుకోవడం చకచకా జరిగిపోయాయి.వాస్తవానికి తాను అధికారంలోకి రావాలంటే బీసీ కులాలను టీడీపీ కంటే ఎక్కువగా ఆకట్టుకోవాలన్న ప్రశాంత్ కిషోర్ సూచనను జగన్ అక్షరాలా పాటించారు. అప్పటికే తనపై ఉన్న విశ్వసనీయత బ్రాండ్ కు బీసీ కులాలకు ఇచ్చిన హామీలు తోడు కావడంతో ఈసారి జగన్ భారీగా లబ్ది పొందారు. అయితే అంతటితే ఆగిపోతే ఆయన సాధారణ అవకాశవాద రాజకీయ నాయకుడిగానే మిగిలిపోయేవారు. కానీ తొలిసారిగా తనకు అండగా నిలిచిన బీసీ కులాలను తనకు స్ధిరమైన ఓటు బ్యాంకుగా మార్చుకునే దిశగా అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోరాదని జగన్ భావిస్తున్నారు. అందుకే తన సొంత సామాజికవర్గమైన రెడ్లను కూడా కాదని తొలి కేబినెట్ లోనే ఏడుగురు బీసీ మంత్రులకు జగన్ స్ధానం కల్పించారు. అందులోనూ రేపల్లె నుంచి ఓటమిపాలైన మోపిదేవి వెంకటరమణకు సైతం మంత్రిగా అవకాశమిచ్చారు. కేవలం కేబినెట్ లో బెర్తులతోనే సరిపెట్టకుండా వారికి రిజర్వేషన్లను భారీగా పెంచేందుకు కూడా జగన్ భారీ వ్యూహరచన చేశారు. అందులోనూ ఒక్క ఏపీకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ఓబీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతూ తన పార్టీకి చెందిన ఎంపీ విజయసాయిరెడ్డితో రాజ్యసభలో ప్రైవేటు మెంబర్ బిల్లు కూడా ప్రవేశపెట్టించారు. తద్వారా బీసీలకు తాను ఇస్తున్న ప్రాధాన్యతను కేవలం ఏపీ మాత్రమే కాకుండా యావత్ దేశం గుర్తించాలనేది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. వాస్తవానికి ఏపీతో పాటు తెలంగాణలోనూ బీసీ జనాభా అధికంగానే ఉంది. అయినా అక్కడ వారికి తగిన ప్రాతినిధ్యం లభించడం లేదు. ఈ నేపథ్యంలో భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని బీసీలకు రిజర్వేషన్ పెంపు అంశాన్ని జగన్ వ్యూహాత‌్మకంగా తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఈ అంశంపై సాధ్యమైనంత ఎక్కువ చర్చ జరగాలని జగన్ కోరుకుంటున్నట్లుగా తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. 

No comments:

Post a Comment