Breaking News

20/06/2019

హైద్రాబాద్ లో హై డ్రామా


రాజా సింగ్ వర్సెస్  పోలీసులు
హైద్రాబాద్, జూన్ 20, (way2newstv.in)
హైదరాబాద్‌లోని జుమ్మెరాత్ బజార్‌లో అర్ధరాత్రి పోలీసులు లాఠీచార్జ్ చేశారని, తనను గాయపరిచారని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. పోలీసుల లాఠీచార్జ్‌ చేయడంతో ఎమ్మెల్యే రాజాసింగ్ గాయపడ్డారంటూ ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి. కానీ, రాజాసింగ్ స్వయంగా రాయితో కొట్టుకుని గాయపరుచుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు వీడియో ఆధారాన్ని కూడా చూపుతున్నారు. తాజాగా బయటికొచ్చిన వీడియో ప్రకారం.. పోలీసులు అడ్డుకుంటున్నా రాజాసింగ్ మాత్రం పెద్ద రాయిని రెండు చేతులతో పైకిలేపి ఒక్కసారిగా తలపై కొట్టుకున్నారు. దీంతో ఆయన తలకు గాయమైంది. స్వాతంత్య్ర సమరయోధురాలు రాణి అవంతిబాయి లోధి విగ్రహాన్ని పోలీసుల అనుమతి లేకుండా అర్ధరాత్రి జుమ్మెరాత్ బజార్ చౌక్‌ వద్ద పున:ప్రతిష్ఠ చేయడానికి రాజాసింగ్, ఆయన అనుచరులు ప్రయత్నించడంతో ఈ ఘర్షణ జరిగింది. విగ్రహ పున:ప్రతిష్ఠను పోలీసులు అడ్డుకున్నారు. అయినప్పటికీ ఎమ్మెల్యే రాజాసింగ్ వర్గం విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ప్రయత్నించింది. దీంతో పోలీసులకు, ఆ వర్గానికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 


హైద్రాబాద్ లో హై డ్రామా

ఎట్టిపరిస్థితుల్లో విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి వీల్లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టారు. దీంతో ఆగ్రహానికి గురైన రాజాసింగ్ రాయితో తలపై కొట్టుకున్నారు. విగ్రహ ప్రతిష్ఠను అడ్డుకుంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ రాజాసింగ్ బెదిరించారు. గాయపడిన రాజాసింగ్‌ను వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ అవుట్ పేషెంట్‌లో పోలీసులు లాఠీచార్జ్ చేయడం వల్ల తాను గాయపడ్డానని రాజాసింగ్ పేర్కొన్నారు. ఆసిఫ్ నగర్ ఏసీపీ ఎన్.నరసింహారెడ్డి, గోషామహల్ ఏసీపీ ఎం.నరేంద్రరెడ్డి, షాహినయత్‌గంజ్ ఎస్సైలు గురుమూర్తి, రవికుమార్ లాఠీలతో రాత్రి 1.30 గంటల సమయంలో తనపై దాడిచేసినట్లు అవుట్ పేషెంట్ పేపర్‌పై రాశారు. ఈ ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేస్తానని కూడా చెప్పారు. అయితే, ఈ ఘటనపై షాహినయత్ గంజ్ ఇన్‌స్పెక్టర్‌తో ‘సమయం’ మాట్లాడింది. రాజాసింగ్‌, ఆయన అనుచరులపై తాము లాఠీ చార్జ్ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యే రాజాసింగ్, ఆయన అనుచరులు రాణి అవంతిబాయి లోధి విగ్రహాన్ని జుమ్మెరాత్ బజార్ సర్కిల్ వద్ద పున:ప్రతిష్ఠ చేస్తున్నారనే సమాచారం అందడంతో అక్కడికి వెళ్లామని, వారిని అడ్డుకున్నామని అన్నారు. తాము అడ్డుకోవడంతో ఆగ్రహానికి లోనైన రాజాసింగ్ తనకు తానే రాయితో తలపై కొట్టుకున్నారని, పైగా తనపై లాఠీచార్జ్ చేశారని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఇన్‌స్పెక్టర్ వివరించారు. 
పోలీసులు అసలు వీడియో బయిటపెట్టండి : రాజాసింగ్
హైదరాబాద్ లోని జుమ్మేరాత్ బజార్ లో గత రాత్రి జరిగిన ఘటనలో తన తలకు గాయమైందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన ఆరోపణలు అవాస్తవమని, తన తలను తానే రాయితో ఆయనే కొట్టుకున్నారంటూ పోలీసులు పేర్కొన్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఓ వీడియో క్లిప్ ను పోలీసులు విడుదల చేయడంపై రాజాసింగ్ స్పందించారు. నిన్న రాత్రి జరిగిన ఘటనపై అసలు వీడియో ఏమైందో పోలీసులు చెప్పాలని, తనను పోలీసులు కొడుతున్న వీడియోను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. తాను రాయి పట్టుకున్న వీడియో క్లిప్ ను మాత్రమే పోలీసులు విడుదల చేశారు తప్ప, తనను పోలీసులు కొడుతున్న క్లిప్ ను మాత్రం బయటపెట్టలేదని అన్నారు. జుమ్మేరాత్ బజార్ లో ఫ్రీడమ్ ఫైటర్ రాణి అవంతి విగ్రహం ఏర్పాటు చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. పోలీసులు అకారణంగా తనపై దాడి చేశారని ఆరోపించారు.  ఎంఐఎం ప్రోద్బలంతోనే బీజేపీ నాయకులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ బలపడుతుంటే టీఆర్ఎస్ కు భయం పట్టుకుందని, హైదరాబాద్ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందన్న వార్తలు వాస్తవమేనంటూ రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.రాజా సింగ్ పై కేసు
గోషామహల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదైంది. ఐపీసీ 143, 145, 152, 153(ఏ), 353 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పశ్చిమ మండల డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. రాణి అవంతి బాయ్ లోథ్ విగ్రహాన్ని జుమ్మెరాత్ బజార్‌లో నిన్న రాత్రి కొందరు యువకులు ప్రతిష్ఠాపన చేసేందుకు యత్నించారు. పాత విగ్రహం తొలగించి కొత్తది పెట్టే యత్నం చేశారు. గత విగ్రహం కన్నా పెద్దది ఏర్పాటుకు జీహెచ్‌ఎంసీ నుంచి అనుమతి తీసుకోలేదు. 25 అడుగుల విగ్రహం పునఃప్రతిష్ఠించేందుకు యత్నించారు. అనుమతిలేని కారణంగా పోలీసులు ఈ చర్యను అడ్డుకున్నారు. ఆ సమయంలో రాజాసింగ్ అక్కడికి చేరుకుని యువకులకు మద్దతుగా ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అడ్డుకున్న పోలీసులపై ఎమ్మెల్యే అనుచరులు దాడికి పాల్పడ్డారు.

No comments:

Post a Comment