Breaking News

01/06/2019

నీళ్లివ్వని నిధులు (ఆదిలాబాద్)


ఆదిలాబాద్, జూన్ 1, (way2newstv.in)
మూగజీవాల దాహార్తిని తీర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రూ.లక్షలు వెచ్చించి నీటి తొట్టెలను నిర్మించింది. అధికారుల అవగాహన లోపం, పర్యవేక్షణ లేని కారణంగా కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా నిర్మించడంతో నీటితొట్టెలు నిరుపయోగంగా మారాయి. తొట్టెలను నిర్మించినా అందుకు అవసరమైన నీటి సౌకర్యం కల్పించలేదు. దీంతో పశువుల దాహార్తి తీరకపోగా నిధులు అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లాయి. వేెసవి తీవ్రతకు భూగర్భ జలాలు అడుగంటడంతో గుక్కెడు నీటికి మూగజీవాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.ఆదిలాబాద్‌ జిల్లావ్యాప్తంగా జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా 2009 నుంచి ఇప్పటి వరకు 756 నీటి తొట్టెలు మంజూరయ్యాయి. ఇందుకు ఒక్కో నీటితొట్టెకు రూ.22,000ల చొప్పున మొత్తం రూ.1.66 కోట్ల నిధులు కేటాయించారు. 


నీళ్లివ్వని నిధులు (ఆదిలాబాద్)
మంజూరైన వాటిలో దాదాపు 340 తొట్టెల నిర్మాణాలు పూర్తయ్యాయి. నిర్మాణ దశలో 150, ప్రారంభానికి నోచుకోనివి 106 ఉన్నాయి. నిరుపయోగంగా ఉన్నవి 160. ప్రస్తుత ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా ఆవులు, గేదెలు 3,50,000. గొర్రెలు, మేకలు 1,95,000 ఉన్నాయి. రోజు రోజుకు ఎండలు తీవ్రమవుతుండటంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దీంతో మూగజీవాలు నీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. పశువుల దాహార్తి తీర్చడానికి ఏర్పాటు చేసిన నీటి తొట్టెల్లో అవినీతి పగుళ్లు తేలుతున్నాయి. అవసరంలేని ప్రదేశాలు, నీటి జాడలేని స్థలాల్లో నాసిరకం నిర్మాణాల కారణంగా రూ.లక్షల వ్యయం నిరుపయోగంగా మారాయి. పంచాయతీల ఆధ్వర్యంలో కొనసాగే బోర్ల నుంచి తొట్టెలకు నీటి సరఫరా చేయాల్సి ఉండగా ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో మేతకు వెళ్లి దాహంతో తొట్ల వద్దకు వస్తున్న పశువులు అందులో నీళ్లు లేకపోవడంతో ఉసూరుమంటూ వెనుతిరుగుతున్నాయి.వేసవి నేపథ్యంలో నిరుపయోగంగా ఉన్న నీటి తొట్టెలను వినియోగంలోకి తేవాలి. పశుసంవర్ధకశాఖ, ఆర్‌డబ్ల్యూఎస్‌, పంచాయతీశాఖ అధికారులు తమకు సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారు. నీటితొట్టెలకు బోరు ఏర్పాటు, విద్యుత్తు కనెక్షన్‌ కల్పించడంలో దృష్టి సారించడం లేదు. పశువుల సంరక్షణకు ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నా వాటి దాహార్తిని తీర్చడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

No comments:

Post a Comment