Breaking News

01/06/2019

గజగజ (విజయనగరం)


విజయనగరం, జూన్ 1, (way2newstv.in)
గజరాజులు గత కొన్ని నెలలుగా ఇటు అధికారులను, అటు జియ్యమ్మవలస, గరుగుబిల్లి, కొమరాడ మండల వాసులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రోజుకో ఊరు వెళ్తూ ఆయా ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడమే కాకుండా మంగళవారం జియ్యమ్మవలస మండలం పెదకుదమ గ్రామంలో కైదు కాశిందొర అనే గిరిజన రైతును పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. అలా వెళ్లాయి అనుకుంటున్న సమయంలో గత మూడు రోజులుగా జియ్యమ్మవలస మండలంలో హల్‌చల్‌ చేస్తున్నాయి. వీటి శాశ్వత తరలింపునకు చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు. ఏనుగుల గుంపును రిజర్వు అటవీ ప్రాంతానికి తరలించడానికి అటవీశాఖ సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. ట్రేకర్సు, సెక్షన్‌ అధికారులు, గార్డులు, బేస్‌క్యాంపు సిబ్బంది, రేంజర్లు, జిల్లా అటవీశాఖాధికారి దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నారు. కానీ మళ్లీ గజరాజులు హడావుడి చేస్తుండటంతో వీటి తరలింపునకు, మైదాన ప్రాంతానికి రాకుండా ఉండేందుకు శాశ్వత పరిష్కారం చూపాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు.


గజగజ (విజయనగరం)
ఏనుగుల గుంపు మళ్లీ గరుగుబిల్లి మండలం గిజబ పరిసరాలకు చేరుకుంది. ఇటీవల నాగావళి నదికి చేరుకొని తిష్ఠవేశాయి. వేసవి ఎండలకు నీటిలో నుంచి బయటకు రావడంలేదు. గతంలో గిజబ గ్రామంలో ఒక వ్యక్తిపై దాడిచేసి గాయపర్చాయి. దీంతో ఇక్కడి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. నదినుంచి బయటకు వస్తే అరటి, చెరకు పంటలు నాశనం చేసి నష్టపర్చుతాయని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఆపరేషన్‌ గజలాంటి చర్యలు తీసుకొని అరణ్యంలోకి పంపిస్తే తప్ప సమస్యలు తీరవని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.2007-08లో ఈ ప్రాంతంలో ఏనుగులు సంచరించి ముగ్గురిని పొట్టన పెట్టుకున్నాయి. అప్పట్లో జియ్యమ్మవలస మండలంలోని ఏనుగులగూడలో రాజుగారి పామాయిల్‌ తోటలో 20 రోజుల పాటు తిష్ఠవేశాయి. ప్రభుత్వం స్పందించి అపరేషన్‌ గజ పేరుతో ఏనుగులను ప్రత్యేక సిబ్బందిని తీసుకొచ్చి ఒడిశాకు తరలించారు. ఎలిఫెంట్‌ జోన్‌ ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కురుపాం, జియ్యమ్మవలస సరిహద్దుతో ఎలిఫెంట్‌ జోన్‌కు ప్రతిపాదనలు పంపించారు. అదీ కార్యరూపం దాల్చకపోవడంతో కథ తిరిగి మొదటికి వచ్చింది. దీంతో ప్రస్తుతం అటవీశాఖ సిబ్బంది ఏ చర్యలు తీసుకోనున్నారోనని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏది ఏమైనా ఈ ప్రాంతవాసులను ముప్పుతిప్పలు పెడుతున్న గజరాజుల తరలింపుపై శాశ్వత చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.గత ఏడాది సెప్టెంబరులో మొత్తం ఎనిమిది ఏనుగులు శ్రీకాకుళం జిల్లా వీరఘట్టాం మండలం గోర, గోపాలపురం నుంచి జిల్లా సరిహద్దు మండలమైన జియ్యమ్మవలస మండలం గడసింగుపురం, ఏనుగులగూడ, సీమలవానివలసకు చేరుకున్నాయి. అనంతరం పెదబుడ్డిడి, చినబుడ్డిడి, అంకవరం చేరుకొని ఆయా గ్రామాల్లో అరటి, వరి, చెరకు పంటలకు నష్టం కలిగించాయి. అలా సంచారం చేస్తూ మండలంలోని గిరిజన ప్రాంతాలైన అర్నాడ పంచాయతీ బిళ్లమానుగూడ, వనజ గ్రామాలకు చేరుకొని తిష్ఠ వేశాయి. అక్కడ నుంచి రిజర్వు అటవీ ప్రాంతానికి దగ్గరలోకి వెళ్లాయి. అక్కడ నుంచి పంపించే ఏర్పాట్లు చేస్తుండగా తిరిగి చినబుడ్డిడి, అంకవరం గ్రామాలకు చేరి ఆవాసం చేశాయి. అనంతరం బొమ్మిక, బీజేపురం తోటల్లో సంచరిస్తూ మన్యం నుంచి పూర్తి మైదాన ప్రాంతం గరుగుబిల్లి మండలం గిజబ, నందివానివలస, బాసంగి నుంచి కొమరాడ మండలానికి చేరుకున్నాయి. రెండు ఏనుగులు పలు కారణాలతో మృత్యువాత పడటంతో చివరకు ఆరు మిగిలాయి. కొమరాడ మండలం నుంచి గరుగుబిల్లి మీదుగా తిరిగి శ్రీకాకుళం జిల్లాకు మార్చి నెలలో వెళ్లాయి. దీంతో హమ్మయ్యా అనుకున్న ఈ ప్రాంతవాసులు మళ్లీ జియ్యమ్మవలస రాకతో భయపడుతున్నారు.

No comments:

Post a Comment