కరీంనగర్, ధాన్యం తూకం, తేమ శాతం, తాలు, తరుగు.. పేరిట అన్నదాతను ముప్పుతిప్పలు పెడుతున్నారు.. ఆరుగాలం కష్టపడి పంటలు పండించడం ఒక ఎత్తయితే.. ధాన్యాన్ని విక్రయించడం మరో ఎత్తుగా మారింది.. కల్లాల్లో ధాన్యం పోసింది మొదలు కాంటా వేసి రైసు మిల్లులకు చేరే వరకు కళ్లల్లో ఒత్తులేసుకొని కాపాడుకోవడం వారి వంతవుతోంది. సకాలంలో డబ్బులు ఇవ్వడంలోనూ అధికార యంత్రాగం చేతులెత్తేస్తోంది.అన్నదాతలు పండించిన ధాన్యం కొనుగోలు చేయడానికి అధికారులు సవా లక్ష కొర్రీలు పెడుతూ, రైతులను అతలాకుతలం చేస్తున్నారు. తేమ శాతం అధికంగా ఉందని రోజుల తరబడి ఆరబెట్టిస్తున్నారు.. అలా ఆరిన ధాన్యంలో తాలు అధికంగా ఉందని కల్లాల్లోనే రైతులతో మరోమారు తూర్పార పట్టిస్తున్నారు. సరిపడా హమాలీలను నియమించకుండా రోజుల తరబడి కొనుగోళ్లను కొనసాగిస్తున్నారు. తూకంలో తరుగు, రైస్‌మిల్లులకు తరలించిన అనంతరం సైతం బస్తాలు తక్కువ వచ్చాయనే నెపంతో కోత వేస్తున్నారు.
తప్పని తిప్పలు (కరీంనగర్)
ఆఖరికి 48 గంటల్లో డబ్బులు ఖాతాలో పడతాయని చెప్పిన అధికార యంత్రాంగం 20 రోజులైనా డబ్బుల జాడ లేకపోవడంతో అన్నదాత బ్యాంకుల చుట్టూ తిరుగుతూ కాలం వెళ్లదీస్తున్నారు. బాధిత రైతులు ఎవరికి మొరపెట్టుకోవాలో తెలియని పరిస్థితి నెలకొంది. జిల్లాలో వివిధ సంస్థల ఆధ్వర్యంలో 212 కేంద్రాలను నెలకొల్పి రైతుల నుంచి ధాన్యం సేకరిస్తున్నారు. ఐకేపీ-పీఏసీఎస్-డీసీఎంఎస్, మెప్మా ఆధ్వర్యంలో 14 మండలాల్లో 213 కేంద్రాలకు గాను 212 కొనుగోలు కేంద్రాలు పనిచేస్తున్నాయి.ఇటీవల ఎలక్ట్రానిక్ కాంటాలను జిల్లా యంత్రాంగం ప్రతి కేంద్రానికి పంపించినా తూకం మాత్రం సాధారణ కాంటాలపైనే కొనసాగిస్తున్నారు. తూకం వేసే సమయంలో ప్రతి బస్తాకు రూ.2 కిలోల తరుగు తీస్తున్నారు. ధాన్యం నింపే బస్తా వజను 600గ్రా. ఉండగా రెండు కిలోల తరుగు తీసివేయడం ఏంటని ప్రశ్నించే సాహసం ఏ రైతు చేయలేకపోతున్నాడు. కిలో 400 గ్రా. డబ్బులు ఎవరి ఖాతాలో జమవుతున్నాయో అధికారులకే తెలియాలి. తూకం వేసిన అనంతరం రైతు పేరు, తూకం వేసిన క్వింటాళ్ల సంఖ్యతో రశీదు అక్కడికక్కడే ఇవ్వాల్సి ఉండగా తూకం వేసిన ధాన్యం రైస్‌మిల్లుకు చేరేవరకు ఇవ్వడం లేదు. తీరా లారీల ద్వారా రైస్‌మిల్లులో తూకం వేసే సమయంలోనూ తక్కువ వజను వచ్చిందని అక్కడా రైతులకు కోత విధిస్తూ అడుగడుగునా అన్నదాతను నిలువునా ముంచుతున్నారు.నిబంధనల ప్రకారం తూకం వేసిన 48 గంటల్లో రైతు ఖాతాల్లో డబ్బులు జమ కావాల్సి ఉంది. కానీ 20 రోజులు గడుస్తున్నా రైతులకు డబ్బులు అందడం లేదు. తూకం వేసిన అనంతరం రైతు పేరు, పాస్‌బుక్ నంబరు, బ్యాంకు ఖాతా నమోదు చేయాల్సి ఉంటుంది. ఇలా నమోదు చేయడానికి రోజుల తరబడి జాప్యం జరుగుతోంది. దాంతో రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ డబ్బులు వచ్చాయా అని ఎదురు చూడటం, నిరాశతో వెనుదిరగడం రోజుల తరబడి కొనసాగుతోంది.
No comments:
Post a Comment