Breaking News

27/06/2019

చదువుకు దిక్కెవరు..? ( కరీంనగర్)

కరీంనగర్, జూన్ 27 (way2newstv.in): 
జిల్లాలో విద్యావ్యవస్థ పూర్తి నిర్లక్ష్యానికి గురవుతోంది. ఏళ్ల తరబడి మండల విద్యాధికారుల పోస్టులు ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. జిల్లాలోని 14 మండలాల్లో ఒక్కచోట కూడా రెగ్యూలర్‌ ఎంఈవోలు లేరు. ప్రధానోపాధ్యాయులే ఇంఛార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒక వైపు తమ పాఠశాలలో బోధన..మరోవైపు మండల పరిధిలో పర్యవేక్షణ విధులు వీరికి అదనపు భారమవుతున్నాయి. ఎంఈవోలతోపాటు పలు పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుల పోస్టుల ఖాళీలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. జిల్లాలో 14 మండలాల్లో 83 ప్రాథమికోన్నత, 105 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన రామగిరి, అంతర్గాం, పాలకుర్తి మండలాలకు ఎంఈవో పోస్టులు మంజూరు లేదు. దీంతో పూర్వపు మండల విద్యాధికారులకే బాధ్యతలు కట్టబెట్టారు. రామగుండం మండల విద్యాధికారి పాలకుర్తి, అంతర్గం మండలాల్లో అదనపు బాధ్యతలు నిర్వహించే పరిస్థితి నెలకొంది.విద్యా విధానంలో సమూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానోపాధ్యాయులకు తరుచూ సమావేశాలు నిర్వహిస్తుండటంతో బోధనపరమైన అంశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. 

చదువుకు దిక్కెవరు..? ( కరీంనగర్)
పాఠశాల సముదాయ సమావేశం, మండల స్థాయిలో ఏదో ఒక సమావేశం, ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన కల్పించే విధంగా అదనపు బాధ్యతలు మోయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రధానోపాధ్యాయులు కచ్చితంగా తమ సబ్జెక్టుకు సంబంధించి బోధన చేయాల్సి ఉంటుంది. ప్రధానోపాధ్యాయులే ఇంఛార్జి ఎంఈవోలుగా విధులు నిర్వహిస్తుండటంతో విద్యార్థులకు బోధన చేయడం లేదు. దీంతో మరో ఉపాధ్యాయుడు ఈ పాఠాలు చెప్పే పరిస్థితి ఉంది. ఉపాధ్యాయుల జీతభత్యాలు, ఇతర కార్యాలయ నిర్వహణ పనులు తలకు మించిన భారవుతున్నాయి. మధ్యాహ్న భోజన అమలు, పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తుల పంపిణీలో జాప్యం నెలకొంది. బడిబయట పిల్లల నమోదు, పాఠశాలల్లో మౌలిక వసతులు, యూడైస్‌, ఆధార్‌ నమోదు వంటి సమాచార సేకరణతో సకాలంలో ముందుకెళ్లడం లేదు.ప్రజలకు సౌలభ్య పాలన అందించేందుకు జిల్లాల పునర్విభనలో పురుడు పోసుకున్న కొత్త మండలాల్లో మండల విద్యాధికారుల పోస్టుల మంజూరు లేదు. జిల్లాలో రామగిరి, అంతర్గాం, పాలకుర్తి మండలాలు కొత్తగా ఏర్పడ్డాయి. వీటికి కొత్త పోస్టులు లేకపోవడంతో కమాన్‌పూర్‌ ఎంఈవో రామగిరి, రామగుండం ఎంఈవో అంతర్గాం, పాలకుర్తి మండలాల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పాఠశాలల బాధ్యతలతోపాటు రెండేసి మండలాల బాధ్యతలు అధికారులకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. పర్యవేక్షణ లోపంతో సకాలంలో వేతనాల బిల్లుల చెల్లింపుకు నోచుకోకపోవడంతో ఉపాధ్యాయులు ఆందోళన బాటపడుతున్నారు. ప్రధానోపాధ్యాయులకే ఇంఛార్జి ఎంఈవో బాధ్యతలు కట్టబెట్టడంతో కొన్నిచోట్ల ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మరికొందరు ఆ పోస్టు విధులు నిర్వహించలేకపోతున్నామని వాపోతున్నారు.

No comments:

Post a Comment