Breaking News

27/06/2019

అంతా బంద్(కృష్ణాజిల్లా)

విజయవాడ, జూన్ 27 (way2newstv.in) : 

ఇంకా ఆరంభానికి నోచుకోని పలు పనులను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేయడంతో సాగునీటి ప్రాజెక్టు పనులకు బ్రేకులు పడ్డాయి. మరికొన్నింటిపై నిపుణుల కమిటీ త్వరలో తేల్చనుంది. ప్రభుత్వం ఏర్పడిన తొలి నాళ్లల్లోనే జలవనరుల ప్రాజెక్టులపై కొంత వరకు స్పష్టతనిచ్చింది. ప్రభుత్వ నిర్ణయం మేరకు ఇప్పటికే జిల్లాకు చెందిన జలవనరుల శాఖ అధికారులు పనుల జాబితాను రూపొందించారు. ఈ మేరకు నివేదికను ఉన్నతాధికారులకు పంపించారు. ఈ జాబితాలో పలు ముఖ్యమైన పనులు ఉన్నాయి. ఎన్నికల ముందు టెండర్లు పిలిచి.. ఇంకా మొదలు కాని పనులు, టెండర్ల ప్రక్రియ ముగిసి.. ఇంకా ఒప్పందం కానివి పూర్తిగా రద్దు అయినట్లే అని అధికారులు చెబుతున్నారు. కొత్త ప్రాజెక్టుల పనులు మొదలై.. 25 శాతం లోపు జరిగిన వాటిపై సమీక్షించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్‌ వద్ద జరిగిన సమీక్ష సమావేశంలో స్పష్టత ఇచ్చారు.గత ఏడాది కృష్ణా జిల్లాలో జగన్‌ పాదయాత్ర నిర్వహించారు. 

అంతా బంద్(కృష్ణాజిల్లా)


ఈ సందర్భంగా జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు జరుగుతున్న తీరు, వాటిలో అక్రమాలపై తూర్పారబట్టారు. తాను అధికారంలోకి వస్తే.. వాటిపై సమీక్షించి ప్రజాధనం దుబారాను అరికడతానని చెప్పారు. ఇందులో భాగంగానే.. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రాగానే ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై దృష్టి సారించారు. జిల్లాలోని పెదలంక మేజర్‌ డ్రెయిన్‌ పనులు ఆగిపోయాయి. 4.500 కి.మీ నుంచి 21.400 కి.మీ వరకు పూడిక తీయాల్సి ఉంది. ఈ పనికి సంబంధించి రూ. 24.04 కోట్లకు ఆమోదిస్తూ ప్రభుత్వం జనవరి, 31న ఉత్తర్వులు విడుదల చేసింది. దీనికి సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తి అయింది. విజయవాడ నగరంలో బుడమేరుపై రెండు వరుసల వంతెన నిర్మాణ పనులు నిలిచిపోయాయి. కృష్ణా డెల్టా ఆధునికీకరణ పనుల్లో భాగంగా ఈ నిర్మాణాన్ని చేపట్టారు. దీని నిర్మాణానికి రూ. 3.54 కోట్లు వెచ్చించాలని నిర్ణయించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో టెండర్ల ప్రక్రియ పూర్తి అయింది.విజయవాడ నగరంలో ఉన్న జలవనరుల శాఖ ప్రాంగణంలోని డేటా కాంప్లెక్స్‌, రైతు శిక్షణ కేంద్రం, ఇతర కార్యాలయాల వార్షిక నిర్వహణ పనులు కూడా ఆగిపోయాయి. 2019 - 20 సంవత్సరానికి సంబంధించి రూ. 63 లక్షల టెండరు ప్రక్రియ పూర్తి అయింది. దీనికే సంబంధించి రూ. 43 లక్షల మరో పని కూడా నిలిచింది. వత్సవాయి మండలం పోలంపల్లిలోని మున్నేరు రిజర్వాయర్‌ ప్రాజెక్టు ఆధునికీకరణ పనులపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ పనులకు సంబంధించి ప్రభుత్వం.. గత ఏడాది నవరబరులో రూ. 64.05 కోట్లకు ఆమోద ముద్ర వేస్తూ జీవో జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి, 12న రూ. 49.64 కోట్లతో ఒప్పందం జరిగింది. ఈ పనులు జైకా నిధులతో సాగుతున్నాయి. ప్రస్తుతం ఇవి పురోగతిలో ఉన్నాయి. ఇప్పటి వరకు 21.36 శాతం మేరకు పనులు జరిగాయి. పోలవరం ప్రధాన కుడి కాలువ 137.290 కి.మీ నుంచి ఏలూరు కాలువ 36.000 కి.మీ వరకు అనుసంధానం చేయాల్సిన పని కూడా ఆగిపోయినట్లే. అనుసంధానం ద్వారా కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 80 వేల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. దీనికి రూ. 15.35 కోట్లు వ్యయం అవుతుందని తేల్చారు. పనికి సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరి, 23న ఒప్పందం కూడా జరిగింది. అయితే పని ఇంకా మొదలు కాలేదు. ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. ఇవి కూడా రద్దు అయ్యాయి. కృష్ణా నది ఎడమ గట్టున.. జగ్గయ్యపేట మండలం ముక్త్యాల వద్ద ఎన్నికల ముందు శంకుస్థాపన చేసిన ఎత్తిపోతల పథకం కూడా అటకెక్కినట్లే. రూ. 300 కోట్ల మేర వ్యయం అయ్యే ఈ ప్రాజెక్టు ఆగిపోనుంది. దీనికి సంబంధించి గుత్తేదారుతో ఫిబ్రవరి, 22న ఒప్పందం జరిగింది. ఈపీసీ పద్ధతిలో పనిచేసేలా గుత్తేదారు పనిని దక్కించుకున్నారు. కృష్ణా నది నుంచి 386.27 క్యూసెక్కుల మేర నీటిని డీవీఆర్‌ బ్రాంచి కాలువకు ఎత్తిపోయాలన్నది ప్రాజెక్టు లక్ష్యం. రెండు దశలలో.. 18.2 కి.మీ, 13.671 కి.మీ, 6.84 కి.మీ వద్ద ఎత్తిపోయనున్నారు. పనులను దక్కించుకున్న సంస్థ  డిజైన్లను సిద్ధం చేస్తోంది. ఈ దశలో పనులు రద్దు జాబితాలో చేరాయి. జిల్లా వ్యాప్తంగా ప్రపంచ బ్యాంకు నిధులతో చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టారు. రూ. వంద కోట్లతో 78 చెరువుల పనులు  మొదలుపెట్టారు. చాలా చెరువుల పనులు ఒప్పందం జరిగి.. ఇంకా మొదలు కాలేదు. ఈ పనులు 25 శాతం లోపే అయ్యాయి. ఇవి కూడా ఆగిపోయాయి.

No comments:

Post a Comment