Breaking News

27/06/2019

మూగజీవాల ఆకలి తీర్చేదెవరు..? (మహబూబ్ నగర్)

నాగర్‌కర్నూల్‌, జూన్ 27 (way2newstv.in):  
జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో వరి పంట తక్కువగా సాగైంది. ఇది పశువుల మనుగడపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గ్రాసం లేకపోవడంతో మూగజీవాలు ఆకలితో నకనకలాడుతున్నాయి. అసలే గ్రాసానికి కొరత ఉండగా.. ఉన్న కొద్దిపాటి గ్రాసానికి అధిక ధరలు పలుకుతున్నాయి. జిల్లాలోని మూగజీవాల పశుగ్రాసం కోసం అధికారులూ అరకొరగా విత్తనాలను పంపిణీ చేశారు. గ్రాసాన్ని కొనుగోలు చేస్తే ఆర్థిక స్థోమత కరవై, పశువులను పోషించలేక రైతులు సతమతమవుతున్నారు. కొందరు రైతులు విధిలేని పరిస్థితుల్లో పశువులను సంతల్లో విక్రయిస్తున్నారు. అయినా.. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రైతులను పశుగ్రాసం కొరత వెంటాడుతోంది. గత రబీలో వర్షాలు సమృద్ధిగా కురియకపోవడంతో నాగర్‌కర్నూల్‌ జిల్లా రైతులు వరి పంటను సాగు చేయలేకపోయారు.
మూగజీవాల ఆకలి తీర్చేదెవరు..? (మహబూబ్ నగర్)

ఫలితంగా పశువులను గ్రాసం సమస్య తలెత్తింది. గ్రాసం లేకపోవడంతో మూగజీవాలను కాపాడుకోవడానికి రైతులు తంటాలు పడుతున్నారు. దీన్ని అదనుగా భావిస్తున్న దళారులు ఉన్న కొద్దిపాటి పశుగ్రాసాన్ని అధిక ధరలకు విక్రయిస్తూ రైతుల నుంచి డబ్బులు దండుకుంటున్నారు. ఎక్కువ మొత్తంలో ధరలను చెల్లించి గ్రాసాన్ని కొనుగోలు చేయలేక రైతులు పశువులను తీసుకొస్తూ విక్రయిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో జూరాల, కేఎల్‌ఐ, కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టుల ద్వారా పంట పొలాలకు నీరు అందినా.. రైతులు ఎక్కువగా వరి మినహా ఇతర పంటలను సాగు చేశారు. దీంతో పశువులకు గ్రాసం కొరత తలెత్తింది. జిల్లాలో 2.45 లక్షల పశువులు ఉన్నాయి. అందులో పాడి పశువులు 1.65 లక్షలు. పాడిపరిశ్రమకు రాష్ట్రంలోనే నాగర్‌కర్నూల్‌ జిల్లా ప్రసిద్ధి చెందింది. అందులో కల్వకుర్తి ప్రాంతంలో పాడిరైతులు అధికంగా ఉన్నారు. ఈ ప్రాంతంలోని అధిక గ్రామాలకు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందలేదు. భూగర్భజలాలు అడుగంటాయి. వీటికి తోడు వర్షాలు లేకపోవడంతో వరి పంటను సాగు చేయలేకపోయారు. ఇది పశువులను పోషించడంపై ప్రభావం చూపింది. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో పశుగ్రాసం ధర భగ్గుమంటోంది. గత మార్చి వరకు ట్రాక్టరు పశుగ్రాసం ధర రూ.10 వేల వరకు పలికింది. ఏప్రిల్‌ నుంచి మే రెండో వారం వరకు ట్రాక్టరు గడ్డి ధర రూ.15 వేల వరకు పలికింది. మే మూడో వారం నుంచి రూ. 20 వేల ధర పలుకుతోంది. దళారులే పశుగ్రాసాన్ని సంతకు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లోని కొందరు రైతుల నుంచి గ్రాసాన్ని కొనుగోలు చేస్తున్న దళారులు కల్వకుర్తి సంతకు తీసుకొచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఇంతమొత్తం ధరలకు గ్రాసాన్ని కొనుగోలు చేయడానికి రైతులు జంకుతున్నారు. ఎక్కువ ధరలకు గ్రాసాన్ని కొనుగోలు చేయలేక రైతులు కల్వకుర్తి సంతకు పశువులను తీసుకొచ్చి విక్రయిస్తున్నారు.గ్రాసం దొరకక, కొనుగోలు చేసే స్థోమత కరవై తప్పనిసరి పరిస్థితుల్లో పశువులను విక్రయిస్తున్నామని రైతులు వాపోతున్నారు.

No comments:

Post a Comment