Breaking News

14/06/2019

బాలారిష్టాలు (విజయవాడ)

విజయవాడ, జూన్ 14 (way2newstv.in): 
దుర్గగుడిలో ఏర్పాటు చేసిన సౌండ్‌ అండ్‌ లైటింగ్‌ షోకు ప్రారంభ కష్టాలు తప్పడం లేదు. దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు జగన్మాత చరిత్ర, దుర్గగుడి అందాలను కనులకు కట్టినట్లు చూపించాలనే ఉద్దేశంతో మూడేళ్ల క్రితం అప్పటి ఈవో సూర్యకుమారి సౌండ్‌ అండ్‌ లైట్‌ షో తయారు చేసే బాధ్యతను ముంబాయికి చెందిన ప్రీమియర్‌ వరల్డ్‌ సంస్థకు అప్పగించారు. అందుకు రూ.3 కోట్లు వెచ్చించారు. ఆ సంస్థ నిర్వాహకులు గత ఏడాది దసరా ఉత్సవాల నుంచి ప్రదర్శన ప్రారంభించాలని తొలుత నిర్ణయించారు. పనులు పూర్తి కాకపోవడంతో ఈ ఏడాది సంక్రాంతి పర్వదినం రోజున మొదలు పెట్టాలని ట్రయల్‌రన్‌ వేశారు. లైట్‌ షో కొంత మేర భక్తుల మదిని దోచుకున్నప్పటికీ దుర్గమ్మ చరిత్రను వివరించే యానిమేషన్‌ చిత్రాలు అంతగా ఆకర్షించలేదు.

బాలారిష్టాలు (విజయవాడ)
ప్రముఖ సినీ నటులు సాయికుమార్‌, రాజేంద్ర ప్రసాద్‌ వంటి వారితో యానిమేషన్‌ చిత్రానికి బ్యాక్‌ డ్రాప్‌ వాయిస్‌ చెప్పించాలని అధికారులు ప్రయత్నించినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. దేవస్థానం అధికారులు రూ.3 కోట్లు చెల్లించినా షో పూర్తి స్థాయిలో భక్తులను ఆకర్షించక పోవడంతో ఇప్పటికి నాలుగు సార్లు ట్రయల్‌ రన్‌ వేసి ఆపేశారు. ఆరు నెలలు గడిచినప్పటికీ ప్రదర్శనను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడానికి కారణం నాణ్యత లేకపోవడమేననే ప్రచారం సాగుతోంది.భక్తులు మొక్కులు చెల్లించి దుర్గమ్మ ఖజానాకు జమ చేసిన రూ.కోట్లు సొమ్మును ఎటువంటి ప్రయోజనం లేని పనులకు కేటాయిస్తున్నారు.  దుర్గగుడిలో రూ.8 కోట్ల వ్యయంతో భక్తులకు ఏ మాత్రం ఉపయోగం లేని రాతి మండపాన్ని నిర్మించారు. అష్ట వంకర్లతో అసంపూర్తిగా చేపట్టిన నిర్మాణం దేవస్థానానికి అందాన్ని అందించక పోగా వాహనాలు నిలిపేందుకు అవరోధంగా మారింది. ఆర్కియాలజీ విభాగం స్థలంలో కట్టారన్న ఆరోపణలపై ఆ శాఖ అధికారులు కోర్టులో కేసు కూడా వేశారు.ఘాట్‌ రోడ్డు విస్తరణ పేరుతో రిటైనింగ్‌ గోడను (చైనా గోడ) రూ.5 కోట్లు వెచ్చించి ఇంజినీరింగ్‌ అధికారులు నిర్మించారు. వంద కార్లు పార్కింగ్‌ చేయడం కోసం అంత సొమ్ము వెచ్చించడం, నాణ్యంగా పనులు చేయక పోవడం వల్ల రిటైనింగ్‌ గోడ జారిపోయిన ఘటనలు ఉన్నాయి. విస్తరించిన ఆ ప్రాంతంలో 50 కార్లు కూడా పట్టని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా దుర్గగుడి అధికారులు స్పందించి సొమ్ము వృథా కాకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.

No comments:

Post a Comment