Breaking News

15/06/2019

బుగ్గన సెంటిమెంట్ కలిసొస్తుందా


కర్నూలు, జూన్ 15, (way2newstv.in)
అది సెంటిమెంటో తెలియదు… అలా కలసి వస్తుందో తెలియదు కాని ఆ నియోజకవర్గం నుంచి గెలిస్తే మాత్రం ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా పదవి మాత్రం ఖాయం. నియోజకవర్గం ఆవిర్భావం నుంచి ఇదే జరుగుతుంది. ఇక్కడ గెలిస్తే చాలు ఏదో ఒక పదవి దక్కుతుంది. అదే కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం. డోన్ నియోజకవర్గం నుంచి గెలిస్తే చాలు ఏదో ఒక పదవి ఖాయమని గత కొన్ని దశాబ్దాలుగా రుజువవుతూ వస్తోంది.డోన్ నియోజకవర్గం ఒకప్పుడు కోట్ల, కేఈ కుటుంబాలకు కంచుకోటగా ఉండేది. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఇదే నియోజకవర్గం నుంచి గెలిచిన కేఈ కృష్ణమూర్తికి కూడా అనేక సార్లు మంత్రి పదవి దక్కింది. 


బుగ్గన సెంటిమెంట్ కలిసొస్తుందా
ఒకవేళ ఇక్కడ గెలిచి తాము ప్రాతినిధ్యం వహించే పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాలేకపోయినప్పటికీ ఏదో ఒక ప్రభుత్వ పదవి దక్కుతూ వస్తోంది.అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు ఇక్కడి నుంచి గెలిచిన కేఈ కృష్ణమూర్తికి పీఏసీ ఛైర్మన్ పదవి లభించింది. తిరిగి 2014లో ఇదే నియోజకవర్గం నుంచి గెలిచిన బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డికి కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ పీఏసీ ఛైర్మన్ పదవి దక్కింది. అధికారంలో ఉంటే మంత్రి పదవి, లేకుంటే ప్రభుత్వ పదవి ఈనియోజకవర్గం నుంచి గెలిచిన నేతలు దక్కించుకోవడం విశేషం.తాజాగా బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ఇక్కడి నుంచి గెలిచి రాష్ట్ర ఆర్థికమంత్రి అయ్యారు. డోన్ నియోజకవర్గం ఏర్పడిన తొలిసారి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి తాత బుగ్గన శేషారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అయితే బుగ్గన కుటుంబం ఈ నియోజకవర్గంపై పట్టు సంపాదించుకోలేకపోవడంతో కేఈ, కోట్ల ఫ్యామిలీలకు కంచుకోటగా మారింది. మళ్లీ బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి మంత్రి కావడంతో ఈ కుటుంబం కూడా పట్టు సంపాదించుకోనుంది. అయితే ఎన్ని పదవులు వచ్చినా… ఎందరు మంత్రులయినా నియోజకవర్గ సమస్యలు మాత్రం అలాగే ఉండటం గమనార్హం

No comments:

Post a Comment