Breaking News

17/06/2019

అమ్మకానికి నిజాం షుగర్ ఫ్యాక్టరీ


నిజామాబాద్, జూన్ 17, (way2newstv.in)
నిజాంచక్కెర కర్మాగారాలు తెలంగాణ రాష్ట్రంలో అమ్మకానికి సిద్ధమయ్యాయి. నష్టాల సాకుతో ప్రైవేటు యాజమాన్యం లే ఆఫ్ ప్రకటించగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లిక్విడేషన్ ఉత్తర్వులు జారీ చేయడంతో కర్మాగారం పరిస్థితి గందరగోళంగా మారింది. అయితే ఈ ఫ్యాక్టరీల విషయంలో తెలంగాణ సర్కారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందన్నది సర్వత్రా ఉత్కంఠగా మారింది. అయతే ఇప్పుడు ప్రభుత్వం ఎదుట రెండే పరిష్కార మార్గాలు ఉన్నాయ. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లిక్విడేషన్ ఉత్తర్వులు ప్రకారం ఆస్తులు అమ్మి అప్పులు తీర్చడం, కార్మికుల బకాయ వేతనాలు చెల్లించడం ఒక మార్గం కాగా, దీనిని వేరే ప్రైవేట్ కంపెనీకి అప్పగించి ఎలాగైనా పునరుద్ధరించడం మరో మార్గం. గత నాలుగేళ్ల నుండి ఈ కర్మాగారాల విషయంలో సర్కారు ఎటూ తేల్చలేక పోయిన సంగతి తెలిసిందే. మొదటగా సహకార రంగంలో నడపాలని యోచించినా రైతులు ముందుకు రాకపోవడంతో ప్రభుత్వం ఏమీ చేయలేక ఉండిపోయింది. దీనికి తోడు ప్రైవేటు యాజమాన్యం 2015లో లే ఆఫ్ ప్రకటించి సర్కారును మరింత ఇరకాటంలో పడేసింది. 


 అమ్మకానికి నిజాం షుగర్ ఫ్యాక్టరీ
లిక్విడేషన్ ఉత్తర్వులతో ఫ్యాక్టరీ ఆస్తులు గనుక ప్రస్తుతం వేలం నిర్వహించినట్టయితే తెలంగాణ ప్రభుత్వం అప్రదిష్టను మూటగట్టుకోక తప్పదని చెప్పవచ్చు. నైజాం కాలంలో స్థాపించిన చక్కెర కర్మాగారాలు సమైక్య రాష్ట్రంలో ప్రైవేట్‌పరం అయితే తెలంగాణ సర్కారు ఏకంగా వాటిని మూసేసి విక్రయించేసిందని ప్రతిపక్షాలు, ప్రజలు సర్కారుపై విమర్శలు గుప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కావున ఈ కర్మాగారాల ఆస్తుల వేలం జరుగకుండా సర్కారు ఎటువంటి చర్యలు తీసుకుంటుందన్న దానిపై అధికార పార్టీ నాయకులు తర్జనభర్జనలు పడుతున్నారు. ఈ కర్మాగారాల ఆస్తులు వేలం వేయకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై సర్కారు దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకోసం ఉన్నత స్థాయిలో కసరత్తులు జరుగుతున్నట్ట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ కర్మాగారాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుండా మరో దీటైన ప్రైవేటు కంపెనీకి అప్పగించి పునరుద్ధరిస్తే ఎలా ఉంటుందన్న దానిపై ప్రభుత్వం సమాలోచనలు జరుపుతున్నట్టు సమాచారం. ఇదే గనుక సాధ్యమైనట్టయితే ఈ వ్యవహారంలో ప్రభుత్వం మధ్యవర్తిగా వ్యవహరించే అవకాశాలు లేకపోలేవు. ప్రభుత్వం గనుక స్వాధీనం చేసుకుంటే ప్రస్తుత యాజమాన్యం బ్యాంకుల నుండి తెచ్చిన దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వమే చెల్లించాల్సి వస్తుందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. రాష్ట్రం విడిపోక ముందు ముఖ్యమంత్రి రోశయ్య హయాంలో ఫ్యాక్టరీల విషయంలో ఓ కమిటీ వేయగా ఆ కమిటీ సభ్యులు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పై విషయాన్ని ప్రస్తావించారు. కావున ప్రస్తుతం కూడా సర్కారు గనుక స్వాధీనానికి సిద్ధమైతే అప్పుల వ్యవహారం తెరపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది. ఈ కర్మాగారాల విషయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఉద్యమ కాలం నుండి అనేక సార్లు వాగ్దానాలు చేసిన సంగతి తెలిసిందె. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై తెరాస అధికారంలోనికి వస్తే చక్కెర కర్మాగారాలకు పూర్వ వైభవం తెస్తామని ముఖ్యమంత్రి కెసీఆర్ సైతం ప్రచార సభలో స్పష్టం చేశారు. దాంతో తెరాస అధికారంలోనికి రాగానే కర్మాగారాల విషయంలో తెలంగాణ సర్కారు ముందడుగు వేసి సహకార రంగంలో నడిపేందుకు ఆసక్తి కనబరిచింది. కానీ రైతుల నుండి ఎటువంటి స్పందన కనిపించక పోవడంతో ప్రభుత్వం కూడా వెనుకడుగు వేయాల్సి వచ్చింది. కాగా 2015 డిసెంబర్ 23న ప్రైవేటు యాజమాన్యం నష్టాల సాకుతూ ఈ కర్మాగారాలలో లే ఆఫ్ ప్రకటించింది. లే ఆఫ్ ఎత్తివేత కోసం కార్మికులు ఎన్ని ఆందోళనలు చేసినా ఫలితం లేకుండా పోయింది. నాటి నుండి వేతనాలు లేక కార్మికులు ఆర్థిక ఇబ్బందులలో కూరుకుపోయారు. వీరి వేతనాల చెల్లింపుల కోసం మాజీ ఎంపీ కవిత పలు రకాల ప్రయత్నాలు కూడా చేశారు. చివరికి ఈ వేతనాల సమస్య లేబర్ కోర్టుకు చేరింది. ఇదిలా ఉండగా చక్కెర కర్మాగారాల వ్యవహారం పై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ 2017 సెప్టెంబర్ మాసంలో రంగ ప్రవేశం చేసి బోధన్, మెదక్, మెట్‌పల్లి కర్మాగారాలను పరిశీలించింది. ఈ ఫ్యాక్టరీలపై ప్రైవేటు యాజమాన్యం వివిధ బ్యాంకుల నుండి తెచ్చిన అప్పులు, కార్మికులకు చెల్లించాల్సిన వేతనాలు తదితర వాటిపై క్షుణ్ణంగా వివరాలు సేకరించిన ట్రిబ్యునల్ ఈ కర్మాగారాలను ప్రభుత్వమైన స్వాధీనం చేసుకొని పునరుద్ధరించాలని, లేదా ప్రస్తుత యాజమాన్యమైనా నడిపించాలని లేదా ఇతర ప్రైవేటు కంపెనీలను ఆహ్వానించాలన్న అభిప్రాయానికి వచ్చింది. ప్రైవేటు యాజమాన్యం, అప్పులు ఇచ్చినటువంటి బ్యాంకుల వాదనలు విన్న ట్రిబ్యునల్ చివరికి లిక్విడేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం కర్మాగారాల ఆస్తులను విక్రయించి బ్యాంకుల అప్పులు, కార్మికుల వేతనాలు చెల్లించే అవకాశాలు ఉంటాయి. ఇదే గనుక జరిగినట్టయితే నిజాంసుగర్స్ రాష్ట్ర ప్రభుత్వానికి మాయని మచ్చను తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ మచ్చ తమ సర్కారుపై పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఉన్నత స్థాయిలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం. ఓ ప్రైవేటు కంపెనీకి ఈ చక్కెర కర్మాగారాలను అప్పగించే యోచనలో సర్కారు కనిపిస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం మధ్యవర్తిగా వ్యవహరించే అవకాశం ఉంది

No comments:

Post a Comment