Breaking News

07/06/2019

నాలుగేళ్లు అసెంబ్లీలో నో వాయిస్...

హైద్రాబాద్, జూన్ 7 (way2newstv.in):
తెలంగాణలో ప్రతిపక్షం గల్లంతైంది. ఓ జాతీయ పార్టీకి సంబంధించిన ఎల్పీ.. ప్రాంతీయ పార్టీ ఎల్పీలో విలీనం అయింది. టీఆర్ఎస్ లో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ విలీనం పూర్తయింది. 12మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్ ను ఈ మధ్యాహ్నం కలిసి .. సీఎల్పీని విలీనం చేయాలని కోరారు. ఎమ్మెల్యేల సంతకాలతో సిద్ధం చేసిన ఓ వినతిపత్రం అందించారు. అసెంబ్లీ రూల్స్ పరిశీలించిన తర్వాత.. స్పీకర్ ఆ విజ్ఞప్తిని అంగీకరించారు. సీఎల్పీ విలీనం పూర్తయినట్టు అసెంబ్లీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.పార్టీ మారిన ఎమ్మెల్యేల నుంచి విజ్ఞప్తి వచ్చిన 4 గంటల్లోనే  స్పీకర్ కార్యాలయం విలీన ప్రక్రియ పూర్తిచేసింది.

 నాలుగేళ్లు అసెంబ్లీలో నో వాయిస్...
తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు కారెక్కారు. వీరంతా స్పీకర్‌ను కలిసి సీఎల్పీని టీఆర్ఎస్‌లో విలీనం చేయాలని కోరారు. 12 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను స్పీకర్‌తో పాటూ అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. అంతకముందు ఈ 12 మంది ఎమ్మెల్యేలు ప్రగతి భవన్‌కు వెళ్లి.. కేసీఆర్, కేటీఆర్‌తో సమావేశమయ్యారు. దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ బలం ఆరుకు పడిపోయింది. హస్తం పార్టీ బలం తగ్గడంతో.. అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా మజ్లిస్ అవతరించింది. ఆ పార్టీకి ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి 19 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు. ఇప్పటికే 11 మంది టీఆర్ఎస్‌లో చేరడం.. తాజాగా తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కూడా కారెక్కడం.. ఉత్తమ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో.. సీఎల్పీ విలీనానికి టీఆర్ఎస్ వేగంగా పావులు కదిపింది.కాంగ్రెస్ 8, బీజేపీ ఒకటి కలుపుకొంటే.. రెండు జాతీయ పార్టీల బలం తెలంగాణ అసెంబ్లీలో ఏడు మాత్రమే. తెలంగాణలో రెండు ప్రధాన జాతీయ పార్టీల బలం.. హైదరాబాద్ నగరానికి, ముఖ్యంగా పాత బస్తీ ఏరియాకు మాత్రమే పరిమితమైన ఎంఐఎంకు సమానం కావడం గమనార్హం. టీడీపీకి కూడా మిగిలింది ఒక్క ఎమ్మెల్యేనే. దీంతో మరో నాలుగేళ్లపాటు తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్షాల గళం పెద్దగా వినిపించకపోవచ్చు.

No comments:

Post a Comment