Breaking News

04/06/2019

హరిత హారానికి అంతా సిద్ధం


మహబూబ్ నగర్, జూన్ 4, (way2newstv.in)
అటవీ విస్తీర్ణం పెంచి.. రాష్ట్రాన్ని హరిత తెలంగాణా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా వాడవాడనా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతోంది. ఇందుకోసం ఏటా రూ.కోట్ల నిధులు వెచ్చిస్తోంది. ఇప్పటికే మూడు పర్యాయాలు హరితహారం కార్యక్రమం పూర్తికాగా.. నాలుగో విడత హరితహారం కోసంగ్రామీణాభివృద్ధి, అటవీశాఖల  అధికారులు సిద్ధమవుతున్నారు.  నర్సరీల్లో మొక్కలు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే 70 శాతం మేర సిద్ధంగా ఉన్నాయి. లక్ష్యాన్ని పూర్తిచేసేలా ఈ సారి కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించనున్నారు. జిల్లావ్యాప్తంగా మొక్కల లక్ష్యాలను నిర్దేశించారు. ఈ నెలాఖరులో కార్యక్రమం ప్రారంభించాలని భావిస్తుండటంతో ఉపాధిహామీ కూలీల ద్వారా గుంతలు తవ్వించే పని అపుడే ప్రారంభించారు. గత మూడేళ్లుగా మొక్కలు నాటుతున్నా.. వాటి సంరక్షణ లేక ఎండిపోతుండటంతో లక్ష్యం నెరవేరడం లేదు. ఈ సారి పక్కా ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకునేలా పకడ్బందీగా హరితహారం కార్యక్రమం నిర్వహించేందుకు అధికారులు వ్యూహరచన చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న 195 గ్రామ పంచాయతీలు, రెండు పురపాలికలల్లో గత మూడేళ్ల హరితహారం కార్యక్రమంలో సుమారు 2 కోట్లకు పైగా మొక్కలను నాటారు. 

హరిత హారానికి అంతా సిద్ధం
పర్యవేక్షణ లేకపోవడం, అధికారుల నిర్లక్ష్యం.. వెరసి ఇందులో 40 శాతం మొక్కలు కూడా బతకని పరిస్థితి. ఈ ఏడాది 80 లక్షల మొక్కలు జిల్లా వ్యాప్తంగా నాటాలని డీఆర్‌డీవో అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఈ మేరకు ఉపాధిహామీ పథకం కింద పెంచిన 13 నర్సరీల్లో 16 లక్షల మొక్కలు పెంచుతుండగా, అటవీశాఖ ద్వారా 30 నర్సరీల్లో 64 లక్షల మొక్కలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో అధికశాతం రైతుల పొలాలు, ఇంటి ఆవరణలు, రహదారుల వెంట నాటేందుకు వీలుగా టేకు, సుబాబులు, వేప, కానుగ, చింత మొక్కలతోపాటుగా మామిడి, నిమ్మ, జామ, కొబ్బరి వంటి పలురకాల మొక్కలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని మండలాల్లో అక్కడక్కడా మొక్కలు నాటేందుకు వీలుగా గోతులను సిద్ధం చేశారు. రానున్న పక్షం రోజుల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉండటంతో జిల్లాలో 50 వేల మొక్కలను సిద్ధం చేసినట్లుగా డీఆర్‌డీవో అధికారులు చెబుతున్నారు.హరితహారం లక్ష్యం నెరవేరాలంటే కఠిన నిబంధనలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఇటీవల అమల్లోకి తెచ్చిన కొత్త పంచాయతీరాజ్‌ చట్టంలో హరితహారంపై కీలక నిర్ణయం తీసుకుంది. నాటిన ప్రతి మొక్కను రక్షించాలనే లక్ష్యంతో ఈ చర్యలకు ఉపక్రమిస్తోంది. ప్రతి గ్రామానికి 20 వేల నుంచి 30 వేల మొక్కలు నాటాలనే లక్ష్యాన్ని నిర్దేశిస్తారు. ఆ గ్రామంలో నాటిన మొక్కల సంరక్షణ బాధ్యత పూర్తిగా సర్పంచి, పంచాయతీ కార్యదర్శిపై ఉంటుంది. సంరక్షణ లేక అవి ఎండిపోతే ఇరువురిపైనా చర్యలు తీసుకుంటారు. దీంతోపాటుగా హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి అయిదు లేదా ఆరు మొక్కలను పంపిణీ చేస్తారు. వాటిని కార్యదర్శి రికార్డుల్లో నమోదు చేస్తారు. ఇచ్చిన మొక్కలకు నీరు పోసి సంరక్షణను పూర్తిగా ఇంటి యజమాని చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అవి ఎండిపోతే.. ఆ ఇంటికి ఎంతైతే  వార్షిక ఆస్తిపన్ను ఉంటుందో అంతే మొత్తాన్ని గృహ యజమానికి జరిమానాగా విధించనున్నారు. హరితహారం మొక్కల సంరక్షణకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారు. మొక్కలను జియోట్యాగింగు చేశారు. ఇన్ని చర్యలు తీసుకున్నా.. క్షేత్రస్థాయిలో కొందరు అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంతో మొక్కలు ఎండుతున్నాయి.

No comments:

Post a Comment