Breaking News

04/06/2019

హెచ్ ఎండీఏ కు భారీగా వాణిజ్య బకాయిలు


హైద్రాబాద్, జూన్ 4, (way2newstv.in)
హైద్రాబాద్ మెట్రో డెవలప్ మెంట్ అధారిటీకి కమర్షియల్ బిల్డింగ్స్ గుది బండలా తయారయ్యాయి.. అమీర్‌పేట్‌, నాంపల్లి, తార్నాక తదితర ముఖ్యమైన ప్రాంతాల్లో భారీ వాణిజ్య భవనాలు ఉన్నాయి. అత్యంత కీలకమైన అమీర్‌పేట్‌లోని మైత్రీవనం, స్వర్ణజయంతి, మైత్రీవిహార్‌ వాణిజ్య కాంప్లెక్స్‌ల్లో సుమారు 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులో ఉంది. అదే ప్రైవేట్‌ సంస్థలైతే పండగ చేసుకునేవేమో. హెచ్‌ఎండీఏ అధికారులు మాత్రం విభిన్నం కదా. అంతటి మంచి అవకాశాన్ని కూడా వినియోగించుకోవడం లేదు. సంస్థకు ఆదాయం సమకూరితే మనకేం వస్తుందులేనన్న భావనతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. ఆ కాంప్లెక్స్‌లపై దృష్టి సారించడం లేదు. ఇంకేముంది సగానికి సగం ఖాళీలుగానే దర్శనమిస్తున్నాయి. ఒక్క స్వర్ణజయంతి కాంప్లెక్స్‌లోనే 1.63 లక్షల చదరపు అడుగులు విస్తీర్ణం ఖాళీగా ఉందంటే వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు..ఆదాయం సగానికి పడిపోయింది.ఎలాగూ ఖాళీలను పూరించడంపై అధికారులు దృష్టి సారించలేదు. కనీసం కిరాయికిచ్చిన దుకాణాల నుంచైనా పక్కాగా అద్దెను వసూలు చేశారా అంటే అదీ లేదు. ఆ విషయంలోనూ చూసీ చూడనట్లుగానే వదిలేశారు. 


హెచ్ ఎండీఏ కు భారీగా వాణిజ్య బకాయిలు
ఇంకేముంది.. బకాయిలు గుట్టల్లా పేరుకపోయాయి. ఎంతలా అంటే మైత్రీవనంలో ఒక్క సంస్థనే రూ.1.43 కోట్లు బకాయి పడిందంటే వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మరో సంస్థనేమో రూ.26 లక్షలు కట్టాల్సి ఉంది. ఈ సంస్థ యాజమాని ఇటీవలె మరణించారు. దీంతో ఆ మొత్తం ఎవరు చెల్లిస్తారో ప్రశ్నార్ధకంగా మారింది. ఈ మే నెల వరకు మైత్రీవనం, స్వర్ణజయంతి, మైత్రీవిహార్‌ వాణిజ్య కాంప్లెక్స్‌లో రూ.4.7 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. ఇంకా ఆశ్చర్యం కలిగించే అంశమేమిటంటే మేం బకాయిలను చెల్లించం.. మీరేం చేసుకుంటారో చేసుకోమంటూ కిరాయిదారులు ముఖం మీదే చెప్పేస్తుంటారు. అలాగనీ ఖాళీ చేస్తారా అంటే అదీ చేయరు. కొందరైతే రాత్రికి రాత్రే జెండా ఎత్తేస్తారు. మరికొందరేమో పాత బకాయిలను చెల్లించలేం కానీ ఈ నెలలోనే ఖాళీ చేస్తామంటూ హెచ్‌ఎండీఏ అధికారులకే ఆఫర్‌ ఇస్తున్నారు. కనీసం వేరే వాళ్లకైనా అద్దెకిచ్చుకోవచ్చనే ఉద్దేశంతో అందుకు అధికారులు కూడా ఒప్పుకుంటున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ రూ.4.7 కోట్లు వసూళ్లు కావడం కష్టమేనన్న మాట.రూ.కోట్లకు కోట్లు బకాయిలు ఉండగా, ఉన్నతాధికారులేమో కార్యాలయాల నుంచి కదలడం లేదు. కనీసం ఇటువైపుగా కూడా చూడట్లేదు. మూడు నెలలు కట్టకపోతే డిఫాల్డర్‌ కింద ఉత్తుత్తి నోటీసులు జారీ చేసి మా పని అయిపోయిందంటూ చేతులు దులుపుకొంటున్నారు. బకాయిలు చెల్లించని కిరాయిదారులను ఖాళీ చేయించి.. ఆ దుకాణాలను వేరే వాళ్లకు ఇవ్వొచ్చు కదా అంటే మాకు ఆ అధికారం లేదంటూ చేతులెత్తేస్తున్నారు. ఇంకేముంది.. స్థానికంగా ఉండే సిబ్బందిదే రాజ్యం. కిరాయిదారులతో కుమ్మక్కై ప్రతి నెలా అందిన కాడికి దండుకుంటూ తమ జేబులు నింపుకొంటున్నారు. సంస్థ ఆదాయానికి గండి కొడుతున్నారు. అడిగినంత ఇస్తే చాలూ.. రాత్రికి రాత్రే జెండా ఎత్తేస్తున్నా కూడా పట్టించుకోరు. ‘రెవెన్యూ రికవరీ(ఆర్‌ఆర్‌) యాక్టును అమలు చేసి.. పోలీసు కేసు పెడితేనే బకాయిదారులు దారికొస్తారు. కాకపోతే.. మాకు ఆ అధికారాలు లేవు. నోటీసులు మాత్రమే జారీ చేయగలం. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. మాకు కూడా ప్రత్యేక అధికారాలు ఇవ్వాల్సిందిగా కోరాం’ అని హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

No comments:

Post a Comment