Breaking News

08/06/2019

రోజాకు నిరాశే


తిరుపతి, జూన్ 8, (way2newstv.in)
ఏపీ మంత్రివర్గం ఖరారయ్యింది. 25మంది సభ్యులతో జగన్ టీమ్ సిద్ధమయ్యింది. సీనియర్లు, జూనియర్లతో సమతూకంగా.. సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారు వైఎస్ జగన్. పదవులు ఆశించినవారికి దాదాపు బెర్తులు ఖాయమైనా.. అనూహ్యంగా కొత్తవారికి కేబినెట్‌లో స్థానం కల్పించారు. అయితే ఊహించని విధంగా పార్టీలో కీలకంగా వ్యవహరించిన రోజాకు పదవి దక్కలేదు. మొదటి నుంచి మంత్రి పదవి ఆశించారు.. స్పీకర్ పదవి వరిస్తుందని భావించారు. కానీ రోజాకు నిరాశే ఎదురయ్యింది. రోజాకు మంత్రి పదవి ఖాయమని అనుచరులు కూడా భావించారు. శుక్రవారం జరిగిన వైసీపీఎల్పీ సమావేశానికి వచ్చిన రోజా.. మీడియాతోనూ మాట్లాడారు. జగన్ ఏ బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా నిర్వర్తిస్తానని చెప్పుకొచ్చారు. తనది ఐరెన్ లెగ్ కాదు.. గోల్డెన్ లెగ్ అంటూ మరోసారి ప్రతిపక్షాలపై సెటైర్లు వేశారు. ఇటు మహిళా కోటాలో హోంమంత్రి పదవి దక్కబోతుందని కొద్దిరోజులుగా ప్రచారం జరగింది. కానీ చివరి నిమిషంలో ఆమెకు పదవి దక్కకుండా పోయింది. 


రోజాకు నిరాశే
రోజాకు పదవి దక్కకపోవడం ఆమె అనుచరుల్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. ఇటు సినిమా రంగం నుంచి ఆమెకు పరిచయాలు ఉండటంతో ఆమెకు కేబినెట్ పోస్టు వస్తుందని భావించిన ప్రముఖులు కూడా కాస్త షాకయ్యారు. మంత్రివర్గ జాబితా విడుదలకాగానే రోజా.. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలో స్థానం దక్కకపోవడం రోజాకు కూడా షాకనే చెప్పాలి.సామాజిక వర్గాల ప్రాధాన్యతల వల్లే రోజాకు పదవి దక్కలేదని తెలుస్తోంది. ఇటు వైసీపీఎల్పీ సమావేశంలోనూ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం లేకపోయినా.. ఈ తొమ్మిదేళ్లు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తనతో పాటు ప్రయాణాన్ని కొనసాగించామని వ్యాఖ్యానించారట. ఎవరికీ అన్యాయం చేయను.. ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తానంటూ భరోసా ఇచ్చారట. ఎవరినీ విస్మరించను.. ఎవర్నీ వదులుకోనని చెప్పారట. అందరం కలిసి ఏపీ ప్రజలకు సేవ చేద్దామని నేతలకు పిలుపునిచ్చారు. అలాగే రెండున్నరేళ్ల తర్వాత 90శాతం మంత్రుల్ని మారుస్తామని చెప్పారు. కాబట్టి అప్పుడు రోజాకు అవకాశం దక్కతుందా.. కేబినెట్ హోదా ఉండే మరో పదవి ఇస్తారా అన్నది చూడాలి. వైసీపీ స్థాపించిన తర్వాత రోజా టీడీపీని వీడి వైసీపీలో చేరారు. అప్పటి నుంచి వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా ఉంటున్నారు. 2014లో చిత్తూరు జిల్లా నగరి నుంచి పోటీ చేసి.. టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడిపై గెలిచారు.. కానీ వైసీపీ అధికారంలోకి రాలేదు. ప్రతిపక్షంలో ఉన్నా సరే.. రోజా వైసీపీ తరపున తన వాయిస్‌ను బలంగా వినిపించారు. టీడీపీ సర్కార్ అవినీతితో పాటూ లోటుపాట్లపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ పోరాటాలు చేశారు. అసెంబ్లీ నుంచి సస్పెండ్ కావడం సంచలనం రేపింది. 2019 ఎన్నికల్లో మళ్లీ చంద్రగిరి నుంచి విజయం సాధించారు. పార్టీ కోసం గత తొమ్మిదేళ్లుగా పోరాటం చేస్తున్నందుకు తనకు పదవి రావడం ఖాయమని భావించినా.. ఆ ఆశ నెరవేరలేదు. 

No comments:

Post a Comment