Breaking News

05/06/2019

ఇంటర్ వెరిఫికేషన్ ఇంతింత కాదయా


హైద్రాబాద్, జూన్ 5, (way2newstv.in)
ఏప్రిల్‌‌లో విడుదల చేసిన రిజల్ట్స్‌‌లో ఇంటర్ సెకండియర్‌‌లో ఓ విద్యార్థికి హిందీలో 38 మార్కులు వచ్చాయి.. ఇప్పడు రీవెరిఫికేషన్ తర్వాత 96 మార్కులొచ్చాయి. మరో విద్యార్థికి సంస్కృతంలో అప్పుడు 55 మార్కులొస్తే.. రీవెరిఫికేషన్‌‌ తర్వాత 95 వచ్చాయి. ఇంకో విద్యార్థికి ఇంగ్లిష్‌‌లో 54 మార్కులు వస్తే.. రీవెరిఫికేషన్‌‌ తర్వాత ఏకంగా 91 మార్కులు వచ్చాయి. మరో విద్యార్థికి 36 మార్కులు రాగా, రీవెరిఫికేషన్ తర్వాత 71 వచ్చాయి! ఇలా చెప్పుకుంటూ పోతే వందల సంఖ్యలో స్టూడెంట్లకు భారీగా మార్కులు పెరిగాయి. ఫెయిలైనవారిలో ఇది మరింత ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. తవ్వినకొద్దీ ఇంటర్‌‌ బోర్డులో తప్పిదాలు ఇలా బయటపడుతూనే ఉన్నాయి.ఇంటర్‌‌ బోర్డు ఇప్పటికీ 19,788 మంది స్టూడెంట్ల ఫలితాలు వెల్లడించలేదు. 


ఇంటర్ వెరిఫికేషన్ ఇంతింత కాదయా
వారి ఆన్సర్‌‌ షీట్ల స్కానింగ్‌‌ పూర్తి కాలేదని వెబ్‌‌సైట్‌‌లో పెట్టింది. ఇవి ఫెయిలైన స్టూడెంట్స్‌‌ వివరాలా? లేక పాసైన విద్యార్థులకు చెందినవా అన్న విషయంలో మాత్రం బోర్డు స్పష్టత ఇవ్వడం లేదు. ఇక రీవెరిఫికేషన్‌‌ ఫలితాలు  బయటకొస్తున్న కొద్దీ తప్పుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రీవెరిఫికేషన్‌‌లో మార్కులు భారీగా యాడ్‌‌ అయిన వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒక్కో జిల్లా లెక్కలు చూసి, అధికారులే విస్మయం వ్యక్తంచేస్తున్నారు. అనామిక ఇష్యూలో ముందుగా ఫెయిల్‌‌ అయినట్టు చెప్పడం, రీవెరిఫికేషన్‌‌లో పాసైందనడం, దీనిపై గగ్గోలు రేగడంతో మళ్లీ ఫెయిల్‌‌ అయిందని ప్రకటించడం బోర్డు నిర్లక్ష్యాన్ని చూపింది. ఇంత జరిగినా ఇంటర్‌‌ బోర్డు కార్యదర్శి అశోక్‌‌కుమార్‌‌ మాత్రం రోజుకో ప్రకటన ఇస్తూ తమ తప్పేమీ లేదని చెప్పుకొస్తున్నారు. రీవెరిఫికేషన్‌‌, రీకౌంటింగ్‌‌ తర్వాత సుమారు లక్షమందికి పైగా స్టూడెంట్లలో మార్కులు పెరగడంపై ప్రభుత్వంగానీ, ఉన్నతాధికారులు గానీ నోరు మెదపడం లేదు.ఇంటర్‌‌ రీవెరిఫికేషన్‌‌, రీకౌంటింగ్‌‌ ఫలితాల తర్వాత ప్రభుత్వం స్పందించలేదు.  బోర్డు అధికారుల నిర్లక్ష్యంపై  ఒక్కరిపైనా చర్యలు తీసుకోలేదు. అనామిక మార్కుల విషయంలో ఉమ్మడి కరీంనగర్‌‌ జిల్లా సుల్తానాబాద్‌‌ జూనియర్‌‌ కాలేజీలో పనిచేసే ఓ కాంట్రాక్టు లెక్చరర్‌‌ను బాధ్యుడిగా చేస్తూ ఆయనపై చర్యలు తీసుకోవాలని ఇంటర్‌‌ బోర్డు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అయితే ఆ విద్యార్థికి సంబంధించిన ఆన్సర్‌‌షీట్లను ముందే హైదరాబాద్‌‌కు తెప్పించుకున్నట్టు సమాచారం. ఇప్పుడు ఇది పట్టించుకోకుండా కేవలం కాంట్రాక్టు లెక్చరర్లను బాధ్యుడిని చేయాలని చూడటాన్ని లెక్చరర్లు తప్పుపడుతున్నారు. ముందు ఇంటర్‌‌బోర్డు తప్పులకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఆ తర్వాతే కిందిస్థాయి సిబ్బంది జోలికి రావాలని వారు డిమాండ్‌‌ చేస్తున్నారు.

No comments:

Post a Comment