Breaking News

05/06/2019

హరిత హారానికి అంతా సిద్ధం...


అదిలాబాద్, జూన్ 5, (way2newstv.in)
తెలంగాణకు పచ్చని హారంలా మారిన హరితహారం పథకం ఐదో విడతకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే నెలలో నిర్వహించే కార్యక్రమానికి సరిపడా మొక్కలను నర్సరీల్లో సిద్ధం చేస్తున్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం మొక్కల పెంపకం చేపడుతున్న అధికారులు లక్ష్యాన్ని చేరుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈసారి జిల్లా వ్యాప్తంగా 1.23 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకోగా మొత్తం 215 నర్సరీల్లో వీటి పెంపకం చేపడుతున్నారు. అన్ని శాఖలను భాగస్వామ్యం చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కసరత్తు జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. హరితహారం ఐదో విడత కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా, మండల స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. జిల్లా స్థాయిలో కలెక్టర్, మండల స్థాయిలో ఎంపీడీవోల ఆధ్వర్యంలో ఈ కమిటీలు పనిచేయనున్నాయి. అయితే జూన్‌ మొదటి లేదా రెండో వారంలో కమిటీలు ఏర్పాటు చేసే ఆలోచనలో అధికారులు ఉన్నారు. కమిటీలు పూర్తయిన వెంటనే అన్ని ప్రభుత్వ శాఖలను భాగస్వామ్యం చేస్తూ శాఖల వారీగా లక్ష్యాన్ని నిర్దేశిస్తారు. 


హరిత హారానికి అంతా సిద్ధం...
దాంతో పాటు గ్రామాల్లోనూ పంచాయతీలవారీగా లక్ష్యాన్ని ఏర్పాటు చేసి అన్ని శాఖలు సమన్వయంతో లక్ష్యాన్ని సాధించేలా చర్యలు చేపట్టనున్నారు. సింగరేణి యాజమాన్యం సైతం ప్రతిఏట తనవంతు బాధ్యతగా హరితహారంలో పాలుపంచుకుంటూ విరివిగా మొక్కలు నాటుతోంది. గత సంవత్సరం సుమారు 6లక్షల మొక్కలు నాటగా ఈసారి ఆ సంఖ్యను పెంచేందుకు ప్రయత్నిస్తోంది.లక్ష్యాన్ని చేరుకునేందుకు ఉపాధిహామీ, అటవీ శాఖ ద్వారా నర్సరీల్లో మొక్కలను పెంచుతున్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండడంతో హరితహారంపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి ఆదేశాలు జారీ కాలేదు. కోడ్‌ ముగియగానే తేదీని ఖరారు చేసే అవకాశమున్న నేపథ్యంలో అధికారులు ముందస్తుగా సిద్ధమవుతున్నారు.గతేడాది కంటే ఈసారి హరితహారం మొక్కల లక్ష్యాన్ని పెంచారు. ఈసారి ఉపాధిహామీ పథకం ద్వారా 83 లక్షలు, అటవీశాఖ ద్వారా 40 లక్షల మొక్కలను నాటాలని  నిర్దేశించారు. ఈ మేరకు ఇప్పటికే ఈజీఎస్‌ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 215 నర్సరీలను ఏర్పాటు చేశారు. ఒక్కో నర్సరీలో సుమారు 20 వేల నుంచి లక్ష వరకు మొక్కలను సిద్ధం చేశారు. మరో 20 రోజుల్లో మొక్కలు అందుబాటులోకి రానున్నాయి. ఇక అటవీశాఖ సైతం హరితహారానికి కావాల్సిన మొక్కలను సిద్ధం చేసింది. అటవీజాతి మొక్కలతో పాటు పండ్ల మొక్కలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అటవీశాఖ ప్రధానంగా ఎవెన్యూ ప్లాంటేషన్‌ను దృష్టిలో ఉంచుకుని అటవీజాతి మొక్కలను అధిక మొత్తంలో సిద్ధం చేస్తోంది. రహదారుల వెంట ఎక్కువగా నాటేలా ప్రణాళికలు చేశారు.మొక్కలను నాటడంలో చూపుతున్న శ్రద్ధ వాటిని సంరక్షించడంలో లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లక్షల్లో మొక్కలు నాటుతున్నట్లు అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం వాటి ఆనవాళ్లు కూడా లేకుండా పోతున్నాయి. మొక్కల సంరక్షణ చర్యలు సరిగా లేకపోవడంతో నాటిన కొద్ది రోజులకే మొక్కలు చనిపోతున్నాయి. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ప్రభుత్వం ఆశించిన ఫలితం కనిపించడం లేదు. కేవలం మొక్కలను నాటడంతో తమ పనై పోయిందని అధికారులతో పాటు ప్రజలు భావిస్తుండటంతో పథకం లక్ష్యాన్ని చేరడం లేదన్నది నిజం. నాటిన ప్రతి మొక్కను జాగ్రత్తగా కాపాడుకున్నప్పుడే పచ్చదనం వెల్లివిరుస్తుంది. ప్రతిఒక్కరూ మొక్కల సంరక్షణను తమ వంతు బాధ్యతగా చేపట్టాల్సిన అవసరముంది. అధికారులు సైతం మొక్కల సంరక్షణ విషయంలో కఠినంగా వ్యవహరించాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు.

No comments:

Post a Comment