ఒంగోలు, జూన్ 1, (way2newstv.in) :
ప్రస్తుతం ఎండుగడ్డి, పచ్చగడ్డి రెండూ దొరకని పరిస్థితి నెలకొంది. నీళ్లు లేక వరి పండే పరిస్థితి లేదు. కనీస పశుగ్రాసాన్ని పండించాలన్నా నీరు అందించలేని తీవ్ర కరవు జిల్లాలో తాండవిస్తోంది. ప్రభుత్వం అందించే పథకాలు రైతులకు చేరక పశుపోషణకు తలమానికంగా ఉన్న జిల్లాలో నేడు వాటిని కాపాడటానికి పోషకులు నానా తంటాలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. వరుస కరవుతో అల్లాడుతున్న రైతులు పశువులకు బతికించుకొనేందుకు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి సమీపంలోని అడవులకు వెళ్లి గ్రాసాన్ని తెచ్చి కాపాడుకుంటున్నారు.
జిల్లాలో గేదెలు, ఆవులు, ఎద్దులు, దూడలు తదితర జీవాలు 10.50 లక్షలకు పైగా ఉండగా గొర్రెలు, మేకలు 20 లక్షల వరకు ఉన్నాయి. వీటిలో 6 లక్షలకు పైగా పాడి పశువులున్నాయి. బీడు భూముల్లో సైతం పచ్చిక ఎండిపోవడంతో జీవాలకు మేత కరవై బక్కచిక్కిపోతున్నాయి. పశ్చిమ ప్రకాశంలోని కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం ఇతర నియోజకవర్గాల్లోని మండలాల్లో అయిదేళ్లకు పైగా సరైన వర్షాలు లేక తీవ్రమైన కరవు పరిస్థితులు నెలకొన్నాయి. కనిగిరి నియోజకవర్గంలోని సి.ఎస్.పురం, పామూరు, పీసీపల్లి, వెలిగండ్ల, కనిగిరి, హనుమంతునిపాడు, గిద్దలూరు, మార్కాపురం, దర్శి, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లోని మండలాల్లో పశుగ్రాసం లేక మూగజీవాలు అల్లాడుతున్నాయి.
మూగరోదన (ప్రకాశం)
సాధారణంగా పెద్ద పశువుకు కనీసం రోజుకు 20 కిలోల గ్రాసం అందించాలి. 25 కిలోల దాణా బస్తా రూ.500కు పైగా ధర పలుకుతోంది. ఈ నేపథ్యంలో పచ్చిగడ్డి లేక, ఎండుగడ్డిని కొనుగోలు చేయడానికి పూర్తిస్థాయిలో అందుబాటులో లేక రైతులు అల్లాడుతున్నారు. వరిని ఈ ఏడాది తక్కువ స్థాయిలో పండించడంతో ఎండుగడ్డి ట్రాక్టరు ధర రూ.15 వేలు ఉంది. దూర ప్రాంతాల నుంచి ఎండుగడ్డిని రైతులు కొనుగోలు చేసి తెచ్చుకుంటున్నారు.కొంతమంది పశుపోషకులు జీవాలపై ఉన్న మమకారంతో కుటుంబాలను వదిలేసి నల్లమల అడవులు, నీటి వనరులున్న డెల్టా ప్రాంతాలు, ఇతర జిల్లాలకు వాటిని తీసుకొని వెళుతున్నారు. మరికొందరు సమీప అడవుల్లోకి కిలోమీటర్లు దూరం నడిచి వెళ్లి గ్రాసాన్ని తెచ్చుకుంటున్నారు. తినేందుకు ఆహార పదార్థాలను తీసుకొని తెల్లవారకముందే గడ్డి ఉన్న ప్రాంతానికి వెళ్లి కోసిన గడ్డిని మోసుకొంటూ సూర్యాస్తమయానికి రహదారిపైకి చేర్చేందుకు నానా తంటాలు పడుతున్నారు. అత్యవసరమైతే ఆ రాత్రి అడవిలోనే ఉండి మరుసటి రోజు తెచ్చుకుంటున్నారు.జిల్లాలో కరవు నివారణ చర్యలలో భాగంగా పశుసంవర్థకశాఖ పశుపోషకులకు దాణా, పాతర గడ్డి, గడ్డి జొన్న విత్తనాలు, దాణామృతం తదితర వాటిని రాయితీపై అందజేశామని చెబుతోంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 26 వేల మెట్రిక్ టన్నుల పాతర గడ్డి, 8,200 టన్నుల దాణా, 5,800 టన్నుల దాణామృతం, 812 టన్నుల జొన్నగడ్డి విత్తనాలను సుమారు 1.50 లక్షల మంది రైతులకు పంపిణీ చేశామని తెలిపారు. ఈ ఏడాదికి ప్రస్తుతానికి పాతర గడ్జి 1000 టన్నులు, గడ్డిజొన్న విత్తనాలు 200 టన్నులు, దాణామృతం 1000 టన్నులు, ఎండుజొన్నచొప్ప వెయ్యి టన్నులు చొప్పున ప్రభుత్వం జిల్లాకు విడుదల చేసిందని, త్వరలో వీటిని పోషకులకు పంపిణీ చేయనున్నట్లు పశువైద్యాధికారులు వివరించారు.
No comments:
Post a Comment