Breaking News

11/06/2019

అసెంబ్లీకి పసుపు చోక్కాలతో టీడీపీ ఎమ్మెల్యేలు


అమరావతి, జూన్ 11 (way2newstv.in
రాష్టంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై, నాయకులపై జరుగుతున్న దాడులను, దౌర్జన్యాలను ఖండిస్తూ టిడిఎల్ పి తీర్మానం ఆమోదించింది. కార్యకర్తల రక్షణ కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కార్యకర్తల రక్షణ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, 15వ తేదీ వర్క్ షాప్ లో దీనికి సంబంధించి కార్యాచరణ సిద్దం చేయాలని తీర్మానించింది. శాసన సభ తొలిరోజు సమావేశాల సందర్భంగా అందరూ పసుపు చొక్కాలతో అసెంబ్లీకి హాజరు కావాలి. ఉదయం 9.30కల్లా ఉండవల్లి అధ్యక్షుల వారి నివాసం వద్దకు చేరుకుని అక్కడ నుంచి బయల్దేరి వెంకటపాలెం వద్ద ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళులు అర్పించి అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకుంటారు.ఈ భేటిలో చంద్రబాబు మాట్లాడుతూ,‘‘ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నాయకత్వ సామర్ధ్యం బైటపడుతుంది. పార్టీ పట్ల, ప్రజల పట్ల బాధ్యత తూచా తప్పకుండా నిర్వర్తించాలి. కార్యకర్తల్లో, నాయకుల్లో ఆత్మ విశ్వాసం పెంచాలి. మనో ధైర్యం పెంచాలి. సమస్యల పరిష్కారంపై మన పోరాట పటిమ ప్రజల్లోకి వెళ్లాలి.గత 15రోజుల్లో అనంతపురం, ప్రకాశం జిల్లాలలో, తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం, గుంటూరు జిల్లా గురజాల, నరసరావుపేట, వినుకొండ నియోజకవర్గాలలో, ఇతర ప్రాంతాలలో టిడిపి కార్యకర్తలపై, నాయకులపై దాడులు చేయడం, దౌర్జన్యాలకు పాల్పడటం గర్హనీయం. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుంది. 



అసెంబ్లీకి పసుపు చోక్కాలతో టీడీపీ ఎమ్మెల్యేలు

దీనిపై జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పార్టీ తరఫున ఏం చేయాలనేదానిపై కార్యాచరణ 
రూపొందించాలి. నియోజకవర్గంలో ఎప్పుడేం జరుగుతుందో సమాచారం నేరుగా తెలియజేయాలి. దానినిబట్టి అప్రమత్తం కావడానికి దోహదపడుతుంది.రాష్ట్రం కోసం, ప్రజల కోసం పట్టుదలతో పోరాడదాం. హక్కుల సాధనే తెలుగుదేశం పార్టీ లక్ష్యం. పేదల సంక్షేమమే మనందరి ధ్యేయం కావాలి. తెలుగుదేశం పార్టీ చారిత్రాత్మక అవసరం. ప్రజల పట్ల పూర్తి బాధ్యత ఉన్న పార్టీ తెలుగుదేశం. గత 37ఏళ్లలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాం. ఎన్టీఆర్ హయాంలో, ఆ తరువాత అనేక అవమానాలు భరించాం. రాజీవ్ గాంధీ హత్యోదంతం దరిమిలా విశాఖ నుంచి హైదరాబాద్ వస్తుంటే ఎన్టీఆర్ కు ఎదురైన అవమానాలను గుర్తుంచుకోవాలి. అన్నింటిని తట్టుకుని నిలబడ్డామంటే అదంతా ప్రజల వల్లే. పార్టీ కోసం, రాష్ట్రం కోసం, ప్రజల కోసం పట్టుదలతో పోరాడటమే మనందరి కర్తవ్యం. 
రాష్ట్రం కోసమే తెలుగుదేశం పార్టీ పోరాటం. పేదల సంక్షేమం కోసమే మన పోరాటం. ప్రజల హక్కుల సాధనే మనందరి లక్ష్యం. అందరూ టీమ్ స్పిరిట్ తో పనిచేయాలి. శాసన సభకు ఎన్నికైన 23మంది కలిసికట్టుగా, పట్టుదలగా పనిచేయాలి. రాష్ట్ర అభివృద్ధి, పేదల సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్లాలి.అధికారం కాదు తెలుగుదేశం పార్టీ లక్ష్యం. రాష్ట్ర అభివృద్ది, పేదల సంక్షేమమే టిడిపి లక్ష్యం. శాసన సభ వేదికగా దానినే ప్రజల్లోకి తీసుకెళ్లాలి. తెలుగుదేశం పార్టీ చరిత్రలో చాలా సందర్భాలలో గెలిచాం, కొన్ని సందర్భాలలో ఓడాం..కానీ ఎప్పుడూ లేనిది ఇప్పుడు ప్రతిరోజూ అన్ని ప్రాంతాలనుంచి ప్రజలు తరలివస్తున్నారు. అందరిలో పాజిటివ్ కన్సెర్న్ మన పట్ల, పార్టీ పట్ల ఉంది. కలిసిన ప్రతిఒకరిలో ఏదో ఆవేదన కనిపిస్తోంది. ఏం జరిగింది, ఇదెలా జరిగిందనే ప్రశ్నలే అందరిలో...
రుణమాఫీ 4,5 కిస్తీలు చెల్లించడం ప్రభుత్వ బాధ్యత. 10% వడ్డీతో సహా రైతులకు ఇచ్చిన బాండ్లను ఆనర్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. 4,5కిస్తీలకింద రూ.10వేల కోట్లు రైతుల సొమ్ము. దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకూడదు. ప్రతిరోజూ కలుస్తున్న అనేక మంది రైతులు, రైతు కుటుంబాల మహిళలు దీనిపైనే ఆందోళన చెందుతున్నారు. ఈ ఖరీఫ్ నుంచే రైతులకు పెట్టుబడులకు కొరత లేకుండా చేయాలి. రబీ నుంచి ఇవ్వడం వల్ల రైతులకు ఖరీఫ్ లో పెట్టుబడులకు సమస్య వస్తుంది. అవగాహన లేకుండా పోవడం, చెప్పుడు మాటలు వినడం, టిడిపిపై బురద జల్లడమే వైసిపి త్రిసూత్రంగా పెట్టుకుంది. పోలవరం ప్రాజెక్టు పనుల విషయమైనా, రాజధాని అమరావతి అభివృద్ధి అంశమైనా, ప్రతి అభివృద్ధి కార్యక్రమంలోనూ ఇదే విధంగా వ్యవహరించడం వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుంది.దీనిని శాసన సభ ద్వారా ప్రజలకు తెలియజెప్పాలి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి.ఈ సమావేశంలో  కళా వెంకట్రావు,  అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, నిమ్మకాయల చినరాజప్ప, నారా లోకేష్, గంటా శ్రీనివాసరావు, రామానాయుడు, కరణం బలరామ్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వీరాంజనేయులు, నందమూరి బాలకృష్ణ, మద్దాల గిరి, సాంబశివరావు, వల్లభనేని వంశీ, ఆదిరెడ్డి భవాని, గణబాబు, గద్దె రామ్మోహన్, జోగేశ్వర రావు, ఇతర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment