Breaking News

01/06/2019

కొత్త సిగ్నల్స్.. (కృష్ణాజిల్లా)


విజయవాడ, జూన్ 1, (way2newstv.in)
నగరంలో ప్రజలకు ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు అధునాతన ట్రాఫిక్‌ సిగ్నల్‌ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. దీని కోసం నగరంలో వాహనాల రద్దీని అధ్యయనం చేశారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు తగ్గించేందుకు వీలైన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించారు. నగరంలోని ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ను కమాండ్‌ కంట్రోల్‌ సెంటరుకు అనుసంధానం చేశారు. వాహనాల రద్దీని పరిగణనలోకి తీసుకుని సిగ్నళ్లను మారుస్తారు. ప్రధాన వీధుల్లో ట్రాఫిక్‌ సమాచారాన్ని వాహనాదారులకు తెలిసేందుకు ఇంటిలిజెంట్‌ ట్రాన్స్‌పోర్టు విధానాన్ని సిద్ధం చేశారు. దీని కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. దీని ద్వారా అన్ని కూడళ్లు, వీధుల్లో వాహన రద్దీని పర్యవేక్షిస్తుంటారు. ఫలితంగా ప్రజలు ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా మైకుల ద్వారా రికార్డు చేసిన సమాచారంతో పాటు, తాజా ప్రకటనలను ప్రజలకు వినిపిస్తారు.ఒక ప్రాంతంలో సిగ్నల్‌ లైటు పడితే తమ వంతు వచ్చే వరకు కనీసం 5 నుంచి 10 నిమిషాలపాటు ఆగాల్సి ఉంటోంది. ఇంటిలిజెంట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్‌లో రద్దీకి అనుగుణంగా సిగ్నల్‌ లైటు మార్చేస్తారు. ఒక మార్గంలో వాహనాలు ఎక్కువగా ఉంటే ఆ మార్గాన్ని వెంటనే సిగ్నల్‌ వదులుతారు. 


కొత్త సిగ్నల్స్.. (కృష్ణాజిల్లా)
ఈ క్రమంలో మిగిలిన మార్గాలను సైతం పరిగణనలోకి తీసుకుని ఆ మార్గంలో వాహనాలు పెరగకుండా వాహనాలను పంపిస్తారు. ఇలా ఎక్కువ దూరం వాహనాలు నిలవకుండా ఉండేలా చర్యలు తీసుకుంటారు. ఈ వ్యవస్థను 24 గంటలూ అందుబాటులో ఉంచుతారు. ఈ క్రమంలో అత్యవసర వాహనాలు అంబులెన్సులు, వీఐపీ వాహనాలు, పోలీస్‌, అగ్నిమాపక వాహనాలు సిగ్నల్‌ లైట్ల వద్ద ఆగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ వాహనాలకు జీపీఎస్‌ పరికరాలు ఏర్పాటు చేసి వాటిని ఇంటిలిజెంట్‌ ట్రాన్స్‌పోర్టు సిస్టమ్‌కు అనుసంధానం చేస్తారు. అత్యవసర వాహనం వస్తుంటే దాన్ని ఇంటిలిజెంట్‌ ట్రాన్స్‌పోర్టు సిస్టమ్‌ గుర్తించి ఆ మార్గంలో ట్రాఫిక్‌ సిగ్నల్‌లైట్లు మారుస్తూ అత్యవసర వాహనాలు ఆగకుండా చర్యలు తీసుకుంటాయి.నూతన పద్ధతిలో ఏర్పాటు చేసే ట్రాఫిక్‌ సిగ్నల్‌ స్తంభాలను ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. వీటికి వాహన రద్దీని గమనించేందుకు వీలుగా ప్రత్యేక కెమెరాలను సిగ్నలింగ్‌ స్తంభాలకు ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఇవి సూర్యరశ్మితో పనిచేస్తాయి. వీటికి బ్లింకర్స్‌ అమర్చి ఉంటాయి. యూటర్న్‌లు, కూడళ్లు, జీబ్రాక్రాసింగ్‌ తదితరాలను గుర్తించేందుకు వీలుగా పెలికాన్‌ సిగ్నళ్లను కూడా అమర్చనున్నారు. రోడ్డుపై వాహనాదారులకు ఎప్పటికప్పుడు సూచనలను స్పష్టంగా కనిపించేందుకు వీలుగా ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేయనున్నారు. వీటిని బెంజ్‌ సర్కిల్‌, రామవరప్పాడు జంక్షన్‌, రమేష్‌ హస్పిటల్‌, ఆటోనగర్‌ జంక్షన్‌, పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌, గుంటూరు హైవే, ప్రకాశం బ్యారేజ్‌, గొల్లపూడి కూడళ్లలో వీటిని ఏర్పాటు చేస్తారు. వృద్ధులు, వికలాంగులు, మహిళలు నగర వీధుల్లో రోడ్డు దాటేందుకు తీవ్ర ఇబ్బందులను నియంత్రించేందుకు పాదచారుల కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇలా నగరంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా సజావుగా వాహనాలు వెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తద్వారా బెజవాడకు ట్రా‘ఫికర్‌’ పేరును మార్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

No comments:

Post a Comment