Breaking News

03/05/2019

జగన్, అమిత్ షా చర్చలు....

బీజేపీతో చేతులు కలపనున్న వైసీపీ
న్యూఢిల్లీ, మే 3, (way2newstv.in)
లోక్‌సభ ఎన్నికలు ఇంకా ముగియలేదు. అప్పుడే హంగ్ పార్లమెంట్ వస్తుందంటూ వివిధ రాజకీయ పార్టీలు లెక్కలు వేస్తున్నాయి. ఈ క్రమంలో హంగ్ పార్లమెంట్ వస్తే ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో ముందస్తుగా బీజేపీ అగ్రనేతలు ఎన్డీయేతర పక్షాలతో చర్చలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెరవెనుక మంత్రాంగం జరుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ జోరు కొనసాగుతుందని, ఆ పార్టీకి మెజారిటీ ఎంపీ సీట్లు కూడా వస్తాయంటూ కొందరు లెక్కలు వేస్తున్నారు. ఈ క్రమంలో అమిత్ షా ముందు జాగ్రత్తగా జగన్‌తో తెరవెనుక చర్చలు ప్రారంభించినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో 25 ఎంపీ సీట్లు ఉన్నాయి. 


జగన్, అమిత్ షా చర్చలు....

అందులో వైసీపీ 20 నుంచి 22 సీట్లు గెలిచే అవకాశం ఉందంటూ ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఒకవేళ హంగ్ పార్లమెంట్ ఏర్పడిన పక్షంలో వైసీపీ కీలకం అవుతుంది. 20 ఎంపీ సీట్లు ఉన్న పార్టీకి అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి, ఇప్పటి నుంచే వైఎస్ జగన్‌‌తో చర్చలు జరిపి రెడీగా పెట్టుకోవడం మంచిదనే ఉద్దేశంలో బీజేపీ నేతలు ఉన్నట్టు కనిపిస్తోంది.అమిత్ షాతో తెరవెనుక చర్చల సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి కూడా పలు డిమాండ్లు పెట్టినట్టు తెలుస్తోంది. రాష్ట్రానికి ప్రధాన డిమాండ్ అయిన ప్రత్యేక హోదా, రాష్ట్రానికి ఆర్థిక సాయం, వైసీపీ ఎంపీలకు మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్‌ను అమిత్ షా ముందు ఉంచినట్టు తెలిసింది. అయితే, అమిత్ షా, జగన్ మోహన్ రెడ్డి తెరవెనుక చర్చల గురించి తమకు తెలియదని వైసీపీ నేతలు చెబుతున్నారు.లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటి వరకు నాలుగు దశలో పూర్తయ్యాయి. మరో మూడు దశల పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే, చివరి నాలుగు దశలో బీజేపీకి అత్యంత కీలకం. చివరి నాలుగు దశల్లో 240 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ 240 సీట్లకు గాను 2014లో బీజేపీ 160 సీట్లు గెలుచుకుంది. ఈ సారి కూడా అదే హవా కొనసాగితే ఓకే, లేకపోతే ఎన్డీయేతర పార్టీల మద్దతు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని బీజేపీ నేతలు లెక్కలు వేస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్‌తో అమిత్ షా టచ్‌లోకి వచ్చినట్టు చెబుతున్నారు.ఇటీవల నర్సాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి, వ్యాపారవేత్త రఘురామకృష్ణం రాజు ఇళ్లు, కార్యాలయాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. బ్యాంకులకు రూ.947 కోట్లు ఎగ్గొట్టారన్న ఆరోపణలతో ఆయన మీద సీబీఐ దాడులు చేసింది. హంగ్ పార్లమెంట్ వస్తే, కేంద్రంలో వైసీపీ సహకారం కోసం బీజేపీ ఇచ్చిన హింట్‌గా కూడా కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

No comments:

Post a Comment