Breaking News

27/05/2019

సర్పంచ్ లకు చెక్ పవరేనా


నిజామాబాద్, మే 28  (way2newstv.in)
గ్రామ ప్రథమ పౌరులుగా బాధ్యతలు చేపట్టి నాలుగు మాసాలు పూర్తి కావస్తున్నా చెక్ పవర్ కల్పించకపోవడంతో సర్పంచులు అనేక రకాల ఇబ్బందులను చవిచూస్తున్నారు. వ్యక్తిగత ప్రతిష్టగా భావించి సర్వశక్తులు ఒడ్డి గెలుపొందిన వారికి గెలిచామన్న సంతృప్తి కూడా లేకుండా పోయిందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సుమారు 1600 పైచీలుకు పంచాయతీలకు మూడు విడతలుగా జనవరి నెలలో ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 2వ తేదీన కొత్త సర్పంచులకు పదవి బాధ్యతలు అప్పగించారు. పంచాయతీల నిర్వహణకు అవసరమైన నిధులను ఖర్చు చేసుకునేందుకు అకౌంట్ల నుండి డబ్బులు డ్రా చేయడానికి వెసులుబాటు కల్పిస్తూ చెక్ పవర్‌ను కల్పించాల్సి ఉంది. ప్రభుత్వం ఈ విషయంలో ఇప్పటి వరకు స్పందించకపోవడంతో సర్పంచులు అవస్థలకు గురవుతున్నారు.


సర్పంచ్ లకు చెక్ పవరేనా
ప్రధానంగా గ్రామాల్లో త్రాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం మెరుగు పర్చడం, రోడ్ల నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటు తదితర వౌళిక వసతులపై దృష్టి సారించాల్సి ఉంటుంది. కొన్ని గ్రామ పంచాయతీల్లో నిధులు ఉండగా, చాలా గ్రామ పంచాయతీలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి కూడా కొత్తగా నిధులంటూ వచ్చిన దాఖలాలు నాలుగు నెలలుగా కనిపించడం లేదు. వరుస బెట్టి ఎన్నికలు వస్తుండటం, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి రావడం కూడా కొత్తగా ఎన్నికైన సర్పంచుల పాలిట శాపంగా పరిణమిస్తోందని చెప్పవచ్చు. అసలే వేసవి కాలం ఆపై తీవ్రమైన నీటి కొరతను అధిగమించలేక గెలిపించిన ప్రజల ముందు సర్పంచులు అవహేళన పాలవుతున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. త్రాగునీటిని సరఫరా చేసే బోరు మోటార్లు కాలిపోయినా, పండగలు, పబ్బాల సందర్భంగా వీధి దీపాలు అమర్చాలన్న సర్పంచులు స్వంత డబ్బులు ఖర్చు చేయాల్సిన దుస్థితి నెలకొంది. గెలుపు కోసం లక్షలకు లక్షలు అప్పులు చేసిన సర్పంచులు లేకపోలేదు. ఆ అప్పుల భారం తీర్చడానికి అవస్థలు పడుతుండగా అదనంగా గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి డబ్బులు వెచ్చించాల్సి వస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. మరో పక్షం రోజుల్లో మృగశిరాకార్తె ప్రవేశం కానుండగా తొలకరి జల్లులతో వర్షాకాలం ప్రారంభం కానుంది. వర్షాకాలంలో గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్య జటిలంగా ఉంటుంది. మురికి కాలువలను శుభ్రం చేయించడం, త్రాగునీటి సరఫరా పైపులైన్ల లీకేజీలను అరికట్టడం లాంటి సమస్యలను పరిష్కరించడం  కూడా సర్పంచులకు భారంగా మారింది. గతంలో ఉమ్మడి జిల్లాలో వెయ్యి పైచీలుకు పంచాయతీలు ఉంటే, 500 జనాభ కలిగిన గ్రామాలను సైతం పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో అక్కడ సమస్యలు ఎక్కడికక్కడే వెక్కిరిస్తున్నాయి. ప్రధానంగా అనేక తండాలు పంచాయతీలుగా మారడంతో తండాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడం ఎన్నికైన సర్పంచులకు తలకుమించిన భారమై  కూర్చుందని వాపోతున్నారు. కొత్త పంచాయతీలకు స్వంత భవనాలు లేకపోవడం, కొనసాగుతున్న అద్దె భవనాలకు కావల్సిన ఫర్నీచర్‌ను సమకూర్చుకోవడం కూడా అదనంగా భరించుకోవాల్సి వస్తుందని సర్పంచులు ఆవేదన చెందుతున్నారు. ఈ నెల 27వ తేదీన నిర్వహించాల్సిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు వాయిదా పడటంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముందుకు పొడిగించే అవకాశం తలెత్తింది. 27న ఓట్ల లెక్కింపుతో కోడ్ తొలగిపోతే ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటుందేమోనన్న ఆశలు అనేక మంది సర్పంచులు వ్యక్తం చేసారు. పరిషత్తు ఓట్ల లెక్కింపు అయ్యే వరకు వేచిచూడాల్సిందేనా అంటూ నిట్టూరుస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నాలుగు నెలల కాలంగా ఎదురు చూస్తున్న సర్పంచులకు చెక్ పవర్ కల్పించాలని కోరుకుందాం.

No comments:

Post a Comment