Breaking News

27/05/2019

ఖరీఫ్ సందడి మొదలు


నిజామాబాద్, మే 26, (way2newstv.in)
తొలకరి చినులకు పడకముందే... పల్లెల్లో సాగు సందడి మొదలైంది. ఎరువులు, విత్తనాల దుకాణాల్లో కొనుగోళ్లు జోరందుకున్నాయి. గతంలో వానకాలం పంటల పెట్టుబడి కోసం రైతులు అప్పుల కోసం..బ్యాంకులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించేవారు. ఇప్పుడా పరిస్థితి మారింది.వానలు రాకముందే ఎరువులు, విత్తనాల కొనుగోళ్ల కోసం రైతన్నలు క్యూ కడుతున్నారు. పెట్టుబడి లేక బీడుగా వదిలేసిన భూములలో పంటలు సాగు చేయడానికి సిద్ధం చేస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు ఖరీఫ్ లక్ష్యాన్ని ఇప్పటికే నిర్ణయించారు. సర్కారు సాయంతో జిల్లాలో అన్ని పంటల సాగు విస్తీర్ణం గత ఏడాదికన్నా సుమారు 20 వేల హెక్టార్ల వరకు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని రైతులు ఇప్పటికే బ్యాంకులలో నగదు తీసుకుని ఖరీఫ్ పంటల సాగుకు సన్నద్ధం అవుతున్నారు. దుక్కులు దున్ని విత్తనాలు, ఎరువులు, మందులు కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో ని 20 మండలాలలోని 391 రెవెన్యూ గ్రామాల్లో సుమారు 2,14,345 మంది రైతులు ఉన్నారు. వీరికి 3.85 లక్షల ఎకరాల సాగుభూములు ఉన్నాయి. 


ఖరీఫ్ సందడి మొదలు
ఏటా వానకాలంలో ఎక్కువగా వరి, మొక్కజొన్న, కంది, పత్తి ,సోయాబీన్ ,జోన్న లాంటి పంటలను సాగు చేస్తారు. రైతుబంధు పథకంలో భాగంగా ప్రభుత్వం అన్నదాతలకు ఈసీజన్‌లోని పంట పెట్టుబడి కోసం ఎకరాకు రూ.4వేల చొప్పున పంపిణీ చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సీజన్‌కు ముందుగానే రైతుల చేతుల్లో డబ్బులు ఉండడంతో రైతులు ఉత్సాహంగా వానకాలం పంటల సాగుకు సిద్ధం అవుతున్నారు. సర్కార్ అందించిన పెట్టుబడి సాయాన్ని ఎరువులు, విత్తనాల కోసం వినియోగించుకుంటున్నారు. బ్యాంకులో నగదును మార్చుకున్న వెంటనే ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. వానకాలానికి సంబంధించి సాగు విస్తీర్ణం బట్టి 44,943 క్వింటాళ్ల విత్తనాలు రైతులకు అందుబాటులో ఉన్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పరుశరాంనాయక్ తెలిపారు. 97వేల హెక్టార్లలో పంటసాగు కోసం కార్యాచరణ సిద్ధం చేయగా అందుకు అనుగుణంగా ఎరువులు, విత్తనాలను రైతన్నలకు ప్రభుత్వ ఆదేశాల మేరకు అందుబాటులోకి తెచ్చినట్లు జిల్లా వ్యవసాయ అధికారి తెలిపారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా సుమారు 75 వేల హెక్టార్లలో మాత్రమే పంటలు సాగు చేశారు. ఈ సంవత్సరం వర్షాలు బాగా పడే అవకాశం ఉండడంతో పాటు ప్రభుత్వం అందించిన పెట్టుబడి సాయంతో సుమారు 95వేల హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగు చేసే అవకాశం ఉంది. జిల్లాలో ఎక్కువగా వరి పంట సాగు చేస్తారు. అందుకోసం అవసరమైన ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచాం. వ్యవసాయ శాఖ ద్వారా టీఎస్ సీడ్స్‌కు చెందిన ఏంటీయూ 1010, కేఎన్‌ఎం 118, బతుకమ్మ, బీపీటీ5204, తెలంగాణ సోన (ఆర్‌ఎన్‌ఆర్ 15048) తదితర వరివిత్తనాలు, జీలుగ, పెద్దజనుము విత్తనాలు, కందులు, పెసలు, మినుములు తదితర విత్తనాలు వ్యవసాయ శాఖ కార్యాలయాలు, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయి.

No comments:

Post a Comment