Breaking News

27/05/2019

నల్గొండ లో గులాబీ రచ్చ రచ్చ


నల్గొండ, మే 28  (way2newstv.in)
పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని నల్లగొండ, భువనగిరి రెండు స్థానాలను కోల్పోయి ఢీలా పడిన టీఆర్‌ఎస్‌కు ఓటమికి దారితీసిన పరిస్థితులపై తాజాగా పార్గీ వర్గాల మధ్య సాగుతున్న రచ్చ మరింత తలనొప్పిగా తయారైంది. ముఖ్యంగా భువనగిరి పార్లమెంట్ స్థానంలో సిట్టింగ్ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ఓటమికి ఈ పార్లమెంట్ పరిధిలోని సొంత పార్టీకే చెందిన మరో సామాజిక వర్గం ఎమ్మెల్యేలు సహకరించలేదంటు బూర వర్గీయులు సామాజిక మాద్యమాల వేదికగా విమర్శలు గుప్పించడం చర్చనీయాంశమైంది. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా హోటల్ వివేరాలో భువనగిరి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి తన అనుచరులతో ఉండగా అదే సమయంలో హోటల్‌కు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాగా వారిరువురు మర్యాదపూర్వకంగా కలిశారు. వేర్వేరు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఎన్నికల సమయంలో కలిసిన ఘటన ఇప్పుడు రచ్చగా మారింది. వారు కలిసిన వేళ రాజకీయాలపై పిచ్చపాటిగా మాట్లాడుకున్న వీడియోను కొందరు వాట్సాప్‌లలో పోస్టు చేశారు. 


నల్గొండ లో గులాబీ రచ్చ రచ్చ
ఈ  వీడియో ఘటనను ఉటంకిస్తు బూర గెలుపుకు ఎమ్మెల్యే పైళ్ల సహకరించలేదని, తన సామాజిక వర్గంకు చెందిన కాంగ్రెస్ అభ్యర్ధి వెంకట్‌రెడ్డి గెలుపుకు లోపాయికారిగా సహకరించారంటు వాట్సాప్ వేదికగా బూర వర్గీయులు ఆరోపణల దాడి ఆరంభించారు. ప్రతిగా పైళ్ల వర్గీయులు మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భాన్ని అడ్డుపెట్టుకుని బూర వర్గీయులు పైళ్లపై కల్పిత కథలతో బురద చల్లి రాజకీయంగా దెబ్బతీయాలనుకోవడంపై మండిపడ్డారు. అటు పార్లమెంట్ ఎన్నికల సమయంలో బూర నామినేషన్ ఏర్పాట్లకు సంబంధించి ఆయన వర్గీయులతో ఎమ్మెల్యే పైళ్ల మాట్లాడిన సందర్భంలో సామాజిక వర్గం పేరుతో చేసిన సంభాషణను సైతం వాట్సాప్‌లో పోస్టు చేసి బూర ఓటమి కారణాల్లో పైళ్ల సహాయ నిరాకరణ కారణమంటు ఆరోపణలు సంధించారు. దీనికి ప్రతిస్పందనగా పైళ్ల  వర్గీయులు మరో పోస్టులో ఎమ్మెల్యే పైళ్ల తన ఎన్నికల ప్రచారం కంటే బూర గెలుపు కోసమే ఎక్కువగా తిరిగారంటు తప్పుడు ప్రచారం మానుకోవాలంటు హితవు పలికారు. మొత్తం మీద భువనగిరి పార్లమెంట్ స్థానంలో టీఆర్‌ఎస్ ఓటమిపై వాట్సాప్ వేదికగా బూర, పైళ్ల వర్గాల మధ్య సాగుతున్న వార్ మునుముందు టీఆర్‌ఎస్‌లో ఎలాంటి రాజకీయ మలుపులు తీసుకుంటుందోనన్న ఆందోళన గులాబీ వర్గాల్లో వినిపిస్తుంది. ఈ వివాదంపై సీఎం కేసీఆర్, కేటీఆర్‌లు ఏ విధంగా స్పందిస్తారోనన్న ఆసక్తి పార్టీ వర్గాల్లో నెలకొంది.

No comments:

Post a Comment