Breaking News

21/05/2019

రాజ్ నాథ్ గెలుపు నల్లేరు పై నడకేనా


లక్నో, మే 21, (way2newstv.in)
రాజ్ నాధ్ సింగ్ భారతీయ జనతా పార్టీ త్రిమూర్తుల్లో ఒకరు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ‌్ జైట్లీ, హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ మధ్యే పాలనా వ్యవహారాలు సాగుతుంటాయి. పార్టీ వ్యవహారాలు అధ్యక్షుడు అమిత్ షాతో కలసి మోదీ పర్యవేక్షిస్తుంటారు. పాలనకు సంబంధించి మాత్రం అరుణ‌ జైట్లీ, రాజ్ నాధ్ సింగ్ లపైనే ఆధారపడతారు. న్యాయకోవిదుడు అరుణ్ జైట్లీకి పాలన వ్యవహారాలు కొట్టిన పిండి. యూపీ ముఖ్యమంత్రిగా, పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన రాజ్ నాధ్ సింగ్ కు పాలనతో పాటు అంతర్గత వ్యవహారాలపైనా పట్టుంది. ఇక శాఖాపరంగా, పాలనా పరంగా చూసినా హోంశాఖ అత్యంత కీలకమైంది. ప్రధాని తర్వాత హోంశాఖ మంత్రి మాత్రమే అధికార కేంద్రంగా ఉంటారు. వివిధ రాష్ట్రాల గవర్నర్లు ఆయనతో భేటీ అవుతుంటారు. రాష్ట్రాల్లో శాంతిభద్రతల పరిస్థితిని నివేదిస్తుంటారు. అంతిమంగా ఆర్థికమంత్రి కన్నా హోంమంత్రి కీలకమన్న విషయం తెలిసిందే. పాలనాపరమైన పట్టుతో పాటు సామాజికంగా బలమైన ఠాకూర్ వర్గానికి చెందిన రాజ్ నాధ్ సింగ్ పార్టీలో అత్యంత కీలకమైన నేత. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఆయన యూపీ రాజధాని లక్నో నుంచి లోక్ సభకు మళ్లీ వచ్చేందుకు పోరాడుతున్నారు. 2009లోనూ రాజ్ నాధ్ ఇక్కడి నుంచే గెలిచారు. పార్టీ పరంగా మంచి పట్లున్న నియోజకవర్గం లక్నో. 



రాజ్ నాథ్ గెలుపు నల్లేరు పై నడకేనా

1991 నుంచి ఇక్కడ కాషాయ పార్టీ అభ్యర్థే విజయకేతనం ఎగురవేస్తున్నారు. 1991 నుంచి 2004 వరకూ దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు.లక్నోలో రాజ్ నాథ్ విజయం తధ్యమని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆయనకు ప్రత్యర్థిగా ఒకప్పటి బీజేపీ నాయకుడు, ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న షాట్ గన్ శతృఘ్న సిన్హా సతీమణి పూనం సిన్హా బరిలో ఉన్నారు. శతృఘ్న సిన్హా పట్నా నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పూనం సిన్హా ఎస్పీ, బీఎస్పీ కూటమి అభ్యర్థిగా గట్టి పోటీ ఇవ్వనున్నారు. ఈ రెండు పార్టీలకు నియోజకవర్గంలో గట్టి పట్టే ఉంది. ఎస్పీ, బీఎస్పీ అధినేతలు మాయావతి, అఖిలేష్ యాదవ్ లు రాజ్ నాధ్ సింగ్ లక్ష్యంగా వ్యూహాలు రచించారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి ప్రమోద కృష్ణ గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన నామమాత్ర అభ్యర్థి మాత్రమే.లక్నో లోక్ సభ స్థానం పరిధిలో అయిదు అసెంబ్లీ స్థానాలున్నాయి. లక్నో పశ్చిమం, లక్నో ఉత్తరం, లక్నోన తూర్పు, లక్నో సెంట్రల్, లక్నో కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వాస్తవానికి రాజ్ నాథ్ సింగ్ స్థానికుడు కాదు. గతంలో అనేక నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. అయినప్పటికీ బలం ఉంది. గత ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి రీటా జోషిని ఆయన 2.72 లక్షల మెజారిటీతో ఓడించారు. అదే రీటా జోషీ ఇప్పుడు బీజేపీలో కొనసాగుతుండటం విశేషం. ఈమె ఒకప్పటి కాంగ్రెస్ దిగ్గజం హేమవతినందన్ బహుగుణ సతీమణి. ఆమె ప్రస్తుతం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ మంత్రివర్గంలో మంత్రి. నియోజకవర్గంలో మొత్తం 19.49 లక్షల ఓటర్లున్నారు. రాష్ట్రంలోని వీఐపీ నియోజకవర్గాల్లో ఇది ఒకటి. రాయబరేలి, అమేధీ తర్వాత ఇది కీలక నియోజకవర్గం.ఇక్కడ గెలుపు కోసం రాజ్ నాధ్ శ్రమిస్తున్నారు. నామినేషన్ వేసే ముందు భారీ రోడ్ షో నిర్వహించారు. తద్వారా తన సత్తా చాటారు. ఎస్పీ, బీఎస్పీ కూటమి అభ్యర్థి పూనమ్ సిన్హా కూడా పోటీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆమె తరుపున కూతురు, సినీనటి సోనమ్ సిన్హా, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ రోడ్ షోలను నిర్వహించారు. కేంద్ర, రాష్ట్రాలపై వ్యతిరేకత, జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు వంటి అంశాలు తమకు కలసి వస్తాయని పూనమ్ సిన్హా ధీమాతో ఉన్నారు. గత ఏడాది జరిగిన కైరానా, గోరఖ్ పూర్ లోక్ సభ ఉప ఎన్నికల్లో అధికార బీజేపీ ఓడిపోయిందని ఆమె గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకతకు నాటి ఎన్నికల ఫలితాలే నిదర్శనమని ఆమె చెబుతున్నారు. రాజ్ నాధ్ మాత్రం విజయంపై ధీమాతో ఉన్నారు. కేంద్రమంత్రిగా తన పలుకుబడి, నియోజకవర్గానికి తాను చేసిన సేవలు, ప్రధాని మోదీ ఆకర్షణ తన విజయానికి దోహదపడతాయని రాజ్ నాథ్ విశ్వాసంతో ఉన్నారు. అయితే గియితే మెజారిటీ తగ్గవచ్చని, విజయానికి ఢోకాలేదన్నది కమలనాధుల అభిప్రాయంగా ఉంది. దానిని తోసిపుచ్చడమూ కష్టమే మరి.

No comments:

Post a Comment