Breaking News

13/05/2019

సౌరకాంతి (విజయవాడ)

విజయవాడ, మే 13 (way2newstv.in): 
జయవాడ సహా కృష్ణా జిల్లాలో సౌర విద్యుత్తు వినియోగం గత ఐదేళ్లలో భారీగా పెరిగింది. నగరంలోని పెద్ద విద్యా సంస్థలన్నీ సౌర విద్యుత్తును ఏర్పాటు చేసుకునేందుకు అమితాశక్తి చూపుతున్నాయి. ఇప్పటికే.. కేబీఎన్‌, లయోలా, సిద్ధార్థ, ఎన్‌ఆర్‌ఐ, ఎస్‌ఆర్‌ఆర్‌, సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాల, ఉషారామా, వాహిని, శారద.. సహా చాలా విద్యా సంస్థలు సౌర పలకలను తమ విద్యాలయాల భవన సముదాయాలపై ఏర్పాటు చేసుకున్నారు. విజయవాడలోని ఇళ్లకు సైతం సోలార్‌ విద్యుత్తును ఏర్పాటు చేసుకునేందుకు నగరవాసులు చాలా ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే 400 ఇళ్లకు పైగా నగరంలో సోలార్‌ విద్యుత్తును అమర్చుకున్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం, గుణదల విద్యుత్తు సౌధ, గన్నవరం విమానాశ్రయం.. వంటి ప్రభుత్వ కార్యాలయాలు, ప్రాంగణాల్లో సౌర విద్యుత్తు ప్లాంట్లను భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. నగరంలోని చాలా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోనూ సౌర పలకలను ఏర్పాటు చేసుకుంటున్నారు.


సౌరకాంతి (విజయవాడ)

విజయవాడ, చుట్టూపక్కల ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఏడాదిలో ఎనిమిది నెలలు ఉంటుంది. సౌర విద్యుత్తుకు అత్యంత అనువైన ప్రాంతం ఇది. అందుకే.. ఏటేటా సౌర విద్యుత్తు వినియోగం నగరంతో పాటూ జిల్లా వ్యాప్తంగా గణనీయంగా పెరుగుతోంది. విశాలంగా ఉండే భవనాలన్నీ సౌర పలకలతో నిండిపోతున్నాయి. ప్రస్తుతం గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ రూ.6 కోట్లతో రోజుకు ఒక మెగావాట్‌ విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను తాజాగా ఏర్పాటు చేశారు. నగరపాలక సంస్థ కార్యాలయ భవనాలపైనా సౌర పలకలను ఏర్పాటు చేసి.. విద్యుత్తు బిల్లులను పొదుపు చేసుకుంటున్నారు. అందరికీ విద్యుత్తును ఇచ్చే ఎస్‌పీడీసీఎల్‌ ప్రధాన కార్యాలయానికి సైతం సౌర వెలుగులు పంచుతుండడం గమనార్హం. గుణదలలో ఉండే విద్యుత్తు సౌధలోని పార్కింగ్‌ షెడ్డుకు సైతం ఏకంగా సౌర పలకలను బిగించి.. పర్యావరణ హిత విద్యుత్తును ఉత్పత్తి చేసుకుని వినియోగిస్తున్నారు. ఇలాగే.. విజయవాడ వన్‌టౌన్‌లోని కె.బి.ఎన్‌.కళాశాలలో మొత్తం భవనాలన్నింటిపైనా సౌర విద్యుత్తు పలకలను ఏర్పాటు చేశారు. కళాశాలకు అవసరమైన మొత్తం విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటున్నారు. ఇలాగే.. నగరంలోని చాలా విద్యాసంస్థలు సైతం ఇలాగే పర్యావరణ హిత విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటూ.. ఆదర్శంగా నిలుస్తుండడంతో పాటూ ఆదాయాన్ని సైతం పొదుపు చేసుకుంటున్నారు. విజయవాడలోని 400 ఇళ్లకు పైగా ఇప్పటికే సౌర విద్యుత్తు పలకలను ఏర్పాటు చేశారు. విద్యుత్తు సంస్థ నుంచి వీరికి తిరిగి డబ్బులు వచ్చే పరిస్థితి ఉంది. వేసవిలో ఉండేంత వినియోగిం శీతాకాలం, వర్షాకాలంలో ఉండదు. ఆ సమయంలో.. మిగులు విద్యుత్తును ఎస్‌పీడీసీఎల్‌ కొనుగోలు చేసుకుంటోంది. దీనికోసం ఎగుమతి, దిగుమతి నెట్‌ మీటర్లను ఇళ్లకు బిగిస్తున్నారు. ఇళ్లకు సౌర విద్యుత్తు యూనిట్లను ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం 30శాతం రాయితీని సైతం అందిస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను.. నెడ్‌ క్యాప్‌ సంస్థకు చెందిన వెబ్‌సైట్‌  లో చూసుకోవచ్ఛు విజయవాడ ఆటోనగర్‌లోని.. జేఏఎంఏసీ కోపరేటివ్‌ స్టోర్స్‌ లిమిటెడ్‌ హౌసింగ్‌ కాలనీలోని 12 నివాస అపార్ట్‌మెంట్‌ల భవన సముదాయాలపై రూ.2.7కోట్లతో భారీస్థాయిలో సౌర విద్యుత్తు ప్యానెళ్లను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా.. రోజుకు రెండు వేల కిలోవాట్స్‌ విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. ఇలా.. అపార్ట్‌మెంట్లపై సౌర విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటుకు సైతం నగరవాసులు ఆసక్తి చూపిస్తున్నారు.

No comments:

Post a Comment