Breaking News

13/05/2019

మామిడికి నీటి కష్టం (కృష్ణాజిల్లా)

నూజీవీడు, మే 13 (way2newstv.in): 
జిల్లాలో మామిడి పంట పరిస్థితి దుర్భరంగా  మారింది. ఆశించిన మేరకు దిగుబడి రాకపోగా నీటి తడులు అందక చెట్లు సైతం ఎండుముఖం పడుతున్నాయి. అసలే కొన్నేళ్లుగా ఆశించిన ఫలసాయం రాక మామిడి తోటలు నరుకుతుంటే.. దీనికి తోడు సాగరు జలాలు సకాలంలో అందని పరిస్థితి. ఫలితంగా ఇది నాణ్యమైన దిగుబడిపై ప్రభావం చూపింది. జిల్లా వ్యాప్తంగా 62 వేల హెక్టార్లలో మామిడి సాగు అవుతుంటే సింహభాగం నూజివీడు డివిజన్‌ పరిధిలోనే ఉంది. ఈ డివిజన్‌ పరిధిలోని 35 వేల హెక్టార్లలో మామిడి తోటలు ఉండగా తిరువూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 17 వేల హెక్టార్లలో  సాగుచేస్తున్నారు. ఎ.కొండూరు మండలంలో 5 వేల హెక్టార్లలో సాగవుతున్నట్లు అధికారులు చెప్పారు. గత ఏడాది జిల్లా వ్యాప్తంగా 63 వేల హెక్టార్లలో మామిడితోటలు విస్తరించాయి. ఈ సంవత్సరం 1,000 హెక్టార్లకు పైగా మామిడి తోటలను నరికివేసినట్లు అధికారుల అంచనా. ఏటా మామిడి సాగు విస్తీర్ణం తగ్గుతోంది.


మామిడికి నీటి కష్టం (కృష్ణాజిల్లా)

మామిడి పంటకు ఆశించిన రీతిలో దిగుబడి రావాలంటే నవంబరు ప్రారంభం నుంచి కాపు చేతికి వచ్చేవరకు నాలుగైదు సార్లు నీటి తడులు అందించాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఆది నుంచి సడిన అరకొర వర్షాలు రైతన్నను కుదేలు చేస్తే, ఇది చాలదన్నట్లు మామిడితోటల తడులకు ఆధారమైన సాగర్‌ జలాలు పూర్తి స్థాయిలో విడుదలకాలేదు. దీంతో సాగర్‌ జలాల ఆధారంగా తిరువూరు డివిజన్‌ పరిధిలో సాగులో ఉన్న మామిడి తోటల దిగుబడిపై గణనీయంగా ప్రభావం చూపింది. సాగర్‌ జలాలను నమ్ముకుని మామిడి తోటలు సాగుచేస్తున్న రైతులకు ఇప్పటికీ సాగునీరు అందక తోటలకు తడులు అందించలేకపోయారు. దీంతో సకాలంలో పూతలు రాక, వచ్చినా పూత, పిందెలు నిలబడక దిగుబడి తగ్గిందని, అరకొరగా కాసిన మామిడి కాయలు సైతం నీటితడులు అందక ఆశించిన పరిమాణంలో లేవని రైతులు వాపోతున్నారు.   దశాబ్దకాలం క్రితం జిల్లా వ్యాప్తంగా మామిడి రైతులు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొన్నారు. ఆ సమయంలో మామిడి చెట్లు పూర్తిగా ఎండిపోయి తీవ్ర నష్టాన్ని చవిచూశారు. కాలం చూస్తుంటే అప్పటి పరిస్థితే పునరావృతం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయని రైతులు వాపోతున్నారు. రాష్ట్ర విభజనకు ముందు వరకుసాగర్‌ జలాలు అందుబాటులో ఉండటంతో రైతులు తమ తోటలకు వాటిసాయంతో నీటితడులు అందించేవారు. కానీ ఈ ఏడాది ఐదు నెలలుగా వర్షాలు లేకపోవడంతో పాటు సాగర్‌ జలాలు రాలేదు. దిగుబడి సంగతి పక్కన పెడితే ఈ వేసవిలో తోటలను ఎలా కాపాడుకోవాలోనని తీవ్ర మనోవేదన చెందుతున్నారు.

No comments:

Post a Comment