Breaking News

03/05/2019

ఒక్కటి కానున్న మూడు విభాగాలు

నల్గొండ, మే 3, (way2newstv.in)
సర్వశిక్ష అభియాన్లలో మార్పు రానుంది. ఇన్నాళ్లుగా సర్వశిక్ష అభియాన్(ఎస్‌ఎస్‌ఏ), రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్(ఆర్‌ఎంఎస్‌ఏ), రాష్ట్ర విద్యా పరిశోధన మండలి(ఎస్‌సీఈఆర్‌టీ)లు వేర్వేరుగా విధులు నిర్వర్తించగా ఇక ఇవి మొత్తం విలీనం కానున్నాయి.విద్యాశాఖలో పలు విభాగాలు ఉండటం కారణంగా అధికారులు, సిబ్బంది మధ్య సమన్వయం పూర్తిగా లోపించింది. ఇన్నాళ్లు సర్వశిక్ష అభియాన్, రాజీవ్ విద్యామిషన్ పరిధిలో ఉండటంతో దీనికి ప్రత్యేకంగా ఒక అధికారి ఉండేవారు. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షాఅభియాన్ మాత్రం విద్యాశాఖ పరిధిలో ఉండేది. ఈ రెండింటి ద్వారా పాఠశాలల్లో జరిగే వివిధ కార్యక్రమాలు, ఉపాధ్యాయులకు శిక్షణలు వేర్వేరుగా ఉండేవి. కొన్ని సందర్భాల్లో ఒకేసారి శిక్షణలు నిర్వహించాల్సి వస్తుండటంతో ఉపాధ్యాయులు ఇబ్బందులతో పాటు విద్యార్థులు అవస్థలు పడేవారు. అలాగే ఎస్‌ఎస్‌ఏ ద్వారా వచ్చే నిధులతో పాఠశాల భవనాల నిర్మాణం, పిల్లల వికాసానికి తోడ్పాటునందించే వివిధ కార్యక్రమాల నిర్వహణ, బడిబాట, విద్యార్థుల ఆధార్ నమోదుతో పాటు ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థుల సమగ్ర వివరాలను వీరే నిర్వహించే వారు. 

ఒక్కటి కానున్న మూడు విభాగాలు

పర్యవేక్షణ కూడా వీరి పరిధిలో ఉండేది. ఇక ఆర్‌ఎంఎస్‌ఏ ద్వారా ఉన్నత పాఠశాలల్లోని తొమ్మిది నుంచి ఇంటర్ వరకు విద్యార్థుల ప్రగతితో పాటు పాఠశాలల నిర్వహణకు ప్రతి ఏటా సుమారు రూ.50వేల వరకు నిధులు అందజేసేది.  వీటిని ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని భావించిన విద్యాశాఖ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి సమగ్ర శిక్షా అభియాన్‌గా నూతన నామకరణంతో ఒకే శాఖ ఏర్పాటు కానుంది. ప్రస్తుతం ఈ రెండు విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది వీటి పనులు, ఇతర వివరాలన్నింటినీ క్రోడీకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ మూడు విభాగాలు ఒకే దగ్గరకు రావడంతో పాఠశాలల్లో పర్యవేక్షణ మెరుగుపడటంతో పాటు సిబ్బంది కొరతను అధిగమించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ మూడు విభాగాలు కలిసిన సందర్భంలో విద్యావ్యవస్థలో చోటు చేసుకునే మార్పులపై నమస్తే తెలంగాణ కథనం సర్వశిక్ష అభియాన్ ద్వారా ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు సైతం ప్రతి ఏటా పాఠశాల నిర్వహణకు నిధుల కేటాయింపు జరుగుతోంది. ప్రాథమిక పాఠశాలకు రూ.7వేలు, ప్రాథమికోన్నత పాఠశాలకు రూ.8వేలు, ఉన్నత పాఠశాలకు రూ.12వేలు కేటాయిస్తారు. ఇవి కాకుండా అటెండర్లు లేని చోట పాఠశాల పనుల నిర్వహణ, మొక్కలను కాపాడుకోవడం, పారిశుధ్య కార్యక్రమాల కోసం స్కావెంజర్లను నియమించి వారికి గౌరవ వేతనాలను అందజేస్తున్నారు. వాస్తవానికి విద్యాశాఖకు సంబంధించి నిధుల కేటాయింపు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నుంచి 60శాతం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 40శాతం కేటాయింపులు జరుగుతున్నాయి. ఈ నిధుల నిర్వహణను విద్యాశాఖ పరిధిలో ఉండే విభాగం అధికారులు పర్యవేక్షించేవారు. ఆర్‌ఎంఎస్‌ఏ విభాగానికి జిల్లాలో ప్రత్యేకంగా సిబ్బంది ఉండకపోవడంతో పాఠశాలల పర్యవేక్షణకు ఇబ్బందులు వచ్చేవి. రాష్ట్రవ్యాప్తంగా ఈ రెండు విభాగాలకు వేర్వేరు అధికారులు, సిబ్బంది ఉండటంతో ఎవరికి వారే కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా ఈ రెండు విభాగాలతో పాటు ఉపాధ్యాయులకు శిక్షణలు అందించే ఎస్‌సీఈఆర్‌టీని ఇందులోనే కలిపేశారు. దీంతో ఈ మూడు విభాగాలు సైతం ఒకే గొడుగు కిందకు రానున్నాయి. 

No comments:

Post a Comment