Breaking News

28/05/2019

తెలంగాణలో కాంగ్రెస్ కు నెక్స్ట్రటేంటీ


రంగారెడ్డి, మే 28 (way2newstv.in
పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో మూడు నియోజకవర్గాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నప్పటికీ రాష్ట్రంలో ఆ పారీ నిలబడేనా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. గెలిచిన వారు చివరి వరకు కాంగ్రెస్‌లో కొనసాగుతారా? లేక మధ్యంలోనే హ్యాండిస్తారా? అన్న సందేహాలు పెద్దఎత్తున వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మనుగడపై మళ్ళీ రాజకీయవర్గాల్లో వాడివేడి చర్చ మొదలైంది. రాష్ట్ర కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీల్లోకి పెద్దఎత్తున వలసలు పెరిగిపోవడంతో తెలంగాణలో ఆ పార్టీ భవిష్యత్ పూర్తిగా అంధకారంగా మారింది.ఇలాంటి పరిస్థితుల్లో లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ మూడు స్థానాల్లో విజయం సాధించింది. ఇది హస్తం పార్టీకి ఒకరంగా ఆక్సిజన్ లభించినట్లు అయింది. విజయం సాధించిన వారిలో మల్కాజ్‌గిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడి, నల్గొండ నుంచి పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడి, భువనగిరి నుంచి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు. 


తెలంగాణలో కాంగ్రెస్ కు నెక్స్ట్రటేంటీ
ఈ విజయం కాంగ్రెస్ నాయకులు, పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. అయితే ఈ ఉత్సాహం ఎన్ని రోజుల పాటు ఉంటుందన్నదే ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ సాగుతోంది.ఆరు మాసాల క్రితం అసెంబ్లీ ఎన్నికల అనంతరం కూడా రాష్ట్రంలో ఇటువంటి పరిణామాలు ఉత్పన్నమైన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మొత్తం 19 మంది శాసనసభ్యులు గెలిచినప్పటికీ అందులో 11 మంది ఒకరితో ఒకరు పోటీపడినట్లుగా పార్టీ వీడారు. అధికార టిఆర్‌ఎస్‌లో చేరిపోయారు. ఇదే దారిలో మరో ఇద్దరు, ముగ్గురు ఎంఎల్‌ఎలు కూడా ఉన్నారని తెలుస్తోంది. నేడో, రేపో వారంతా టిఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారని కాంగ్రెస్ వర్గాల్లోనే వినిపిస్తోంది. అలాగే శాసనమండలిలోని ముగ్గురు ఎంఎల్‌సిలు కూడా కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి అధికార పార్టీలో చేరిపోయారు. వారితో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎంఎల్‌ఎలతో పాటు పెద్దసంఖ్యలో కాంగ్రెస్ నేతలు ఆ పార్టీని వీడి గులాబీ గూటికి చేరిన విషయం తెలిసిందే.దీంతో పలు జిల్లాల్లో కాంగ్రెస్ పూర్తిగా ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్‌ను దీటైన నేతల కోసం వెతుక్కోవాల్సిన హీన పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు పూర్తిగా ఆగమ్య గోచరంగా మారిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ ఉంటుందా? లేక పూర్తిగా కనుమరుగు అవుతుందా? అన్న అనుమానాలు నెలకొన్నాయి. ఈ పరిణామాలు హస్తం నేతలను తీవ్ర కలవరానికి గురి చేశాయి.ఇలాంటి సమయంలో లోక్‌సభ ఎన్నికల్లో మూడు నియోజకవర్గాలను గెలుచుకోవడం, చేవెళ్ళ నియోజకవర్గంలో చివరి నిమిషం వరకు పోరాడి అపజయం పాలు కావడం, పలు నియోజకవర్గాల్లో టిఆర్‌ఎస్‌కు దీటుగా పోటీ ఇవ్వడం వంటి అంశాలు కాంగ్రెస్ నేతల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తున్నాయి. అయితే ఈ ఆశలు ఎంత కాలం వరకు సజీవంగా ఉంటుందన్నది మాత్రం అనుమానంగానే కనిపిస్తోంది. గెలిచిన లోక్‌సభ సభ్యులైనా పూర్తి కాలం పార్టీలో కొనసాగుతారా? లేక ఎంఎల్‌ఎల మాదిరిగానే గోడ దూకుతారా? అన్నది ప్రస్తుతానికి వేచి చూడాల్సిందే.

No comments:

Post a Comment