Breaking News

13/05/2019

సింగిల్ ఫేజ్ లోనే మున్సిపల్ ఎన్నికలు

వరంగల్, మే 13, (way2newstv.in)
పంచాయతీ ఎన్నికలు ముగియగానే...ఒకే దశలో మున్సిపల్‌ ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్నది. అందుకు కొత్త మున్సిపల్‌ చట్టానికి తుది మెరుగులు దిద్దుతున్నది. ఆ చట్టం ప్రకారమే ఎన్నికలు జరగనున్నాయి. పాత మున్సిపాల్టీలతోపాటు, కొత్త మున్సిపాల్టీలలో వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసినట్టు తెలిసింది. అయితే కొత్త చట్టం అమలులోకి వచ్చిన తర్వాతనే ఎన్నికల ప్రక్రియ వేగవంతం కానుంది. 1500 నుంచి 2వేల జనాభాను ప్రాతిపదిక తీసుకుని వార్డులను విభజించినట్టు సమాచారం. పాత మున్సిపాల్టీల్లో 1900 వార్డులు ఉంటే, ఇప్పుడు 2400 వార్డులు ఏర్పాటు కానున్నాయి. అయితే మున్సిపల్‌ చైర్మెన్ల ఎన్నికను ప్రత్యక్షంగానా లేక పరోక్షంగా ఎన్నుకోవాలా? అనే అంశంపై సర్కారు తర్జనభర్జనలు పడుతున్నది. పాత మున్సిపాల్టీల పాలక మండళ్ల గడువు జూన్‌ వరకు ఉన్నది. కొత్త మున్సిపాల్టీలకు, పాత మున్సిపాల్టీలకు కలిపి ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది. అప్పటివరకు కొత్త మున్సిపాల్టీల్లో స్పెషలాఫీసర్ల పాలననే కొనసాగిస్తున్నది. ఇప్పటికే పది నెలలు అవుతున్నది. మున్సిపాల్టీలకు పాలకమండళ్లు లేకపోవడంతో అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. 

సింగిల్ ఫేజ్ లోనే మున్సిపల్ ఎన్నికలు

ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపాల్టీలను ఏర్పాటు చేసే సమయంలో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ గొప్పగా చెప్పారు. అవకాశం ఉన్న ప్పుడు పనులు చేయని ప్రభుత్వం... అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల కోడ్‌ అమలులో ఉండటంతో పనులకు మరింత ఆలస్యమవుతున్నది. ఇక నుంచి పౌరసేవలు మొత్తంగా ఆన్‌లైన్‌ ద్వారానే సేవలు అందించేలా కొత్త చట్టంలో సంస్కరణలు తీసుకొస్తున్నది. నిర్ణీత కాలవ్యవధిలో భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వని అధికారులపై చర్యలు తీసుకునేలా చట్టంలో మార్పులు చేయనుంది. అవినీతి, అక్రమాలకు తావులేని విధంగా కొత్త మున్సిపల్‌ చట్టం రూపకల్పన జరుగుతున్నట్టు అధికారులు అంటున్నారు. గతేడాది ఆగస్టు నెలలో కొత్త మున్సిపాల్టీలు అమలులోకి వచ్చాయి. గ్రామపంచాయతీల్లో జనాభా పెరగడం, రెండు, మూడు గ్రామాలు కలిసిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త మున్సిపాల్టీలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 73 పాత మున్సిపాల్టీలు ఉండగా, సర్కారు 68 కొత్తగా మున్సి పాల్టీలను ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కొత్త మున్సిపాల్టీల్లో వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ ఇప్పటికే చేపట్టారు. దానికి సంబంధించిన నివేదికను పురపాలక శాఖ సర్కారుకు సమర్పించింది. దాన్ని ప్రస్తుతం పెండింగ్‌లో పెట్టినట్టు తెలిసింది. కొత్త మున్సిపాల్టీల్లో సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా తయారైంది. స్పెషలాఫీర్ల పాలనలో సర్కారు కనీస నిధులు కూడా కేటాయించలేదు. ఎంపీడీవోలు, ఎమ్మార్వోలను స్పెషలాఫీర్లుగా నియమిం చింది. వారికి మున్సిపాల్టీల పాలనపై సరైన అవగాహన లేదు. దీంతోపాటు ఉద్యోగులు, సిబ్బంది కొరత తీవ్రంగా ఉన్నది. కొత్త మున్సిపాల్టీల్లో 2వేల మంది సిబ్బంది అవసర మని మున్సిపల్‌ శాఖ సర్కారుకు గతంలోనే ప్రతిపాదనలు పంపింది. దానిపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కొత్త మున్సిపాల్టీల చట్టం ప్రకారం రోడ్లు, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీలు, పార్కులు, శ్మశానాలను ఏర్పాటు చేయాల్సి ఉన్నది. ముఖ్యంగా పరిశుభ్రమైన మంచినీటి సౌకర్యం కల్పించాలి. రోడ్ల పరిశుభ్రత, చెత్త నిర్వహణ, డంపింగ్‌ యార్డు స్థలాల గుర్తించడం వంటి అనేక పనులు చేపట్టడం లేదు. చెత్త నిర్వహణ కోసం స్థలాల సేకరణ, చెత్త కంపోస్టు చేయడానికి సాంకేతిక తోడ్పాటు అందించాల్సి ఉంటుంది.

No comments:

Post a Comment