Breaking News

03/05/2019

సోమిరెడ్డి సమీక్షల వెనుక వ్యూహం

నెల్లూరు, మే 3, (way2newstv.in)
తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వరస ఓటములు ఎదురయినా, ఆయన సీనియారిటీని చూసే చంద్రబాబు సోమిరెడ్డిని ఎమ్మెల్సీ చేసి మరీ మంత్రి పదవిని ఇచ్చారు. వ్యవసాయశాఖ మంత్రిగా దాదాపు రెండున్నరేళ్ల పాటు సోమిరెడ్డి పనిచేశారు. అయితే ఎన్నికలకు ముందు తన ఎమ్మెల్సీ పదవికి ఆయన రాజీనామా చేశారు. మరొకరికి అవకాశం ఇవ్వాలనో…? తాను గెలుస్తానన్న ధీమానో కాని సోమిరెడ్డి మాత్రం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం అప్పట్లో పార్టీ చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు సూచనతోనే సోమిరెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారంటారు కొందరు.సర్వేపల్లిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. మిగిలిన మంత్రులందరిదీ ఒక ఎత్తైతే సోమిరెడ్డిది మరొక ఎత్తు. ఆయన గత రెండు రోజుల నుంచి సమీక్షల పేరిట సచివాలయంలో హల్ చల్ చేస్తుండటం ఆ శాఖ అధికారులకు చికాకు తెప్పిస్తుంది. 
 

సోమిరెడ్డి సమీక్షల వెనుక వ్యూహం

ఏపీ ముఖ్యమంత్రి సమీక్షలకే ఎన్నికల సంఘం అడ్డుపుల్లలు వేస్తుంటే సోమిరెడ్డి తాను పనిగట్టుకుని వచ్చి మరీ సమీక్షలు చేస్తానంటారేంటి? అని ఐఏఎస్ లే సచివాలయంలో చర్చించుకుంటున్నారు. రెండు రోజుల నుంచి సమీక్షలంటూ సోమిరెడ్డి చేస్తున్న హంగామాతో అధికారులు హడలి పోతున్నారు.ఎన్నికల నిబంధనలు అమల్లో ఉండగా తీవ్రమైనపరిస్థితుల్లో తప్ప ముఖ్యమంత్రి కాని, మంత్రులు కాని ఎటువంటి సమీక్షలు చేయకూడదన్నది నిబంధన. అత్యవసర పరిస్థితుల్లో ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకుని మాత్రమే రివ్యూలు చేయాల్సి ఉంటుంది. కానీ సోమిరెడ్డి మాత్రం గత రెండు రోజుల నుంచి సమీక్షలకు రమ్మంటూ వ్యవసాయ అధికారులకు ఆహ్వానాలు పంపుతున్నారు. అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వారిని ఆదుకోవడానికి, పంటనష్టంపై సమీక్షించాలని చంద్రమోహన్ రెడ్డి పట్టుబడుతున్నారు. కానీ అధికారులు మాత్రం చంద్రమోహన్ రెడ్డి సమీక్షలకు హాజరు కావడం లేదు.అయితే దీనికి సంబంధించి చంద్రమోహన్ రెడ్డి అధికారులపై వత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని సచివాలయంలో కొందరు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. తన సమీక్షలకు ఎందుకు హాజరుకావడం లేదో? లిఖితపూర్వకంగా తెలపాలంటూ సోమిరెడ్డి వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి, స్పెషల్ కమిషనర్ లకు లేఖలు రాశారు. ఎన్నికల నిబంధన అమల్లో ఉన్నప్పటికీ మంత్రుల రోజువారీ పాలనను ఎవరూ నియంత్రించలేరని సోమిరెడ్డి చెబుతున్నారు. అయితే ఇంతమంది మంత్రులు ఉండగా, ఎవరూ ఇలాంటి రివ్యూలకు రాలేదని, ఒక్క సోమిరెడ్డికి మాత్రమే ఎందుకన్న ప్రశ్న తలెత్తుతోంది. చంద్రబాబునాయుడు ఒకవైపు ఎన్నికల కమిషన్ పై విరుచుకుపడుతుండటంతో సోమిరెడ్డి కూడా తన స్థాయిలో ఏదో ఒకటి చేయాలని చేస్తున్నారని టీడీపీలోని కొందరు నేతలే గుసగుసలాడుతున్నారు. మొత్తం మీద సోమిరెడ్డి వ్యవహారం ఏపీ సచివాలయంలో అధికారులకు మింగుడుపడకుండా తయారైంది.

No comments:

Post a Comment