Breaking News

03/05/2019

మాండ్యలో కుమార పరాజయం

బెంగళూర్, మే 3, (way2newstv.in)
కుమార స్వామికి పుత్ర పరాజయం తప్పదా? జనతాదళ్ ఎస్ అధినేతకు పరాభవం తప్పేట్లు లేదా? అవును మాండ్య విషయంలో ఇదే జరుగుతుందంటున్నారు. కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ పోటీ చేసిన మాండ్య నియోజకవర్గంలో జేడీఎస్ ఎదురీదక తప్పదన్న అంచనాలు వస్తున్నాయి. ఇంటలిజెన్స్ నివేదికలు కూడా అవే స్పష్టం చేస్తున్నాయి. పోలింగ్ సరళి ప్రకారం సుమలత విజయం ఖాయమని పలు సర్వేలు కూడా చెబుతుండటంతో ముఖ్యమంత్రి కుమారస్వామిలో ఇటీవల కాలంలో అసహనం ఎక్కువగా కన్పిస్తోంది.మాండ్య నియోజకవర్గంలో కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా దివంగత అంబరీష్ సతీమణి సుమలత పోటీ చేశారు. 


మాండ్యలో కుమార పరాజయం

ఆమెకు భారతీయ జనతా పార్టీ నేరుగా మద్దతిచ్చింది. ప్రత్యక్షంగా కొందరు, పరోక్షంగా కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలు సుమలతకే జై కొట్టారు. మాండ్య పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనతాదళ్ ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ వారి పనితీరు సక్రమంగా లేదని కుమారస్వామి సయితం అంచనా వేశారు. ఇటీవల జరిగిన సమావేశంలో మాండ్య నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలపై అసంతృప్తి బాహాటంగానే కుమారస్వామి వ్యక్తం చేశారు. నిఖిల్ గౌడ ఓటమి తప్పదన్న సర్వే నివేదికలతో జేడీఎస్ లో కొంత కంగారు ప్రారంభమయింది. అయితే సర్వేలు నమ్మవద్దని ఇప్పటికే దళపతి దేవెగౌడ పార్టీ నేతలను, క్యాడర్ కు సూచించారు. నిఖిల్ గౌడ రెండు లక్షల భారీ మెజారిటీతో గెలుస్తున్నారని కూడా దేవెగౌడ చెప్పడం విశేషం. కానీ కుమారస్వామిలో మాత్రం నమ్మకం కుదరటం లేదు. ఇందుకు ప్రధాన కారణం ఇంటలిజెన్స్ నివేదిక అని చెబుతున్నారు. అందుకోసమే కుమారస్వామి మాండ్యలో పదిహేను రోజుల పాటు తిష్ట వేశారన్నది కూడా జేడీఎస్ వర్గాల నుంచి తెలుస్తోంది.స్వతంత్ర అభ్యర్థి సుమలత మాత్రం గెలుపు పై ధీమాగా ఉన్నారు. పోలింగ్ అనంతరం కూడా ఆమె ప్రజలను కలుసుకుంటూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మీడియా ఎక్కువగా సుమలతకు పాజిటివ్ గా ప్రచారం చేయడం వల్లనే ఇంత హైప్ వచ్చిందని కుమారస్వామి భావిస్తున్నారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా మీడియా మాండ్యపైనే దృష్టి పెట్టిందని ఆయన అక్కసును వెళ్లగక్కారు. అయితే కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం సంకీర్ణ సర్కార్ పై ఉండదని కూడా కుమారస్వామి ధీమా వ్యక్తం చేశారు. తన ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పేమీ లేదని కూడా అయన అంటున్నారు. మొత్తం మీద మాండ్య నియోజకవర్గం ఫలితం కుమారస్వామి కుటుంబానికి ఇబ్బంది తెచ్చి పెట్టే విధంగానే ఉంటుందన్నది విశ్లేషకుల అంచనా.

No comments:

Post a Comment