Breaking News

20/05/2019

మార్చి నుంచి 200 మందిని చంపేసిన సూరీడు


హైద్రాబాద్, మే 20 (way2newstv.in)
తెలంగాణలో సూరీడు ప్రజల ప్రాణాలు తోడేస్తున్నాడు. సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న జిల్లాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. మార్చి నుంచి మే నెల వరకు తెలంగాణలో సుమారు 200 వరకు వడదెబ్బ మరణాలు నమోదయ్యాయి. ఒక్క మే నెలలోనే 72 మంది చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. వరుసగా ఐదురోజుల పాటు 40 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదైతే ఆ ప్రాంతంలో వడగాలులు ఉన్నట్లు పరిగణనలోకి తీసుకుంటారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం జిల్లాలోని చాలా మండలాల్లో 45 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


మార్చి నుంచి 200 మందిని చంపేసిన సూరీడు

రాష్ట్రంలో వడదెబ్బకు చనిపోతున్న వారిలో ఆరుబయట పనిచేస్తున్న వారు, ప్రయాణికులే ఎక్కువగా ఉంటున్నారు. కూలి పనులకు వెళ్లేవారు, వ్యవసాయ పనులు, ధాన్యం విక్రయాలకు వెళ్తున్న రైతులు కూడా మరణిస్తున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 50 మంది వరకు వడదెబ్బతో మరణించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 22 మంది, ఆదిలాబాద్ జిల్లాలో 14 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. సిద్ధిపేట జిల్లాలో వడదెబ్బకు గురై 150 మంది వరకు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నెలాఖరు వరకు ఉష్ణోగ్రతలు అధికంగానే నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతుండటంతో ఈ మరణాలు ఇంకా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వడగాలుల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యమైన పనులు ఉంటే తప్ప మధ్యాహ్న సమయంలో బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు.

No comments:

Post a Comment