Breaking News

13/04/2019

ఆదాయం సరే... సౌకర్యాలెక్కడ..? (మెదక్)

మెదక్, ఏప్రిల్ 13  (way2newstv.in): 
మున్సిపాలిటీలో కూరగాయల వేలం ద్వారా వచ్చే ఆదాయం అంతా ఇంతా కాదు. మొత్తం వచ్చే రాబడుల్లో 4వ వంతు కూరగాయల సంతదే కావడం విశేషం. తూప్రాన్‌ పురపాలిక పరిధిలో ఈ ఏడాది కూరగాయల సంతకు వేలం పాటలో రూ.30 లక్షల ధర వచ్చింది. గతేడాది పంచాయతీగా ఉన్నప్పుడు రూ.29.50 లక్షల రాబడితో జిల్లాలోనే అత్యధిక వేలం పాటగా రికార్డు సృష్టించింది. ఈ ఏడాది రూ.30 లక్షల ఆదాయం వచ్చినా కూరగాయల మార్కెట్‌లో కనీస సదుపాయాలు లేక వ్యాపారులు, రైతులు అవస్థలు పడుతున్నారు. ప్రతిరోజు పురపాలిక కార్యాలయం పక్కన కూరగాయల మార్కెట్‌ను నిర్వహిస్తున్నారు. మంగళవారం సంత రోజు మహంకాళి వీధి నుంచి ఆలయం ఆవరణంలో మార్కెట్‌ను నిర్వహిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొన్నా అధికారులు అక్కడ కనీస సదుపాయాలు కల్పించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. భారీగా ఆదాయం వస్తున్నా అందులో 10 శాతాన్ని కూడా మార్కెట్‌కు ఖర్చు చేయడం లేదంటే ఎంత చిన్నచూపు చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. 

ఆదాయం సరే... సౌకర్యాలెక్కడ..? (మెదక్)

తూప్రాన్‌ కూరగాయల మార్కెట్‌లో తూప్రాన్‌, చేగుంట, వర్గల్‌, వెల్దుర్తి, శివ్వంపేట మండలాల్లో పండించిన పంటలను రైతులు ఇక్కడి విక్రయిస్తుంటారు. అర్ధరాత్రి 2 గంటల నుంచి ప్రధాన రహదారిపై రైతులు వ్యాపారులకు పంటలను విక్రయిస్తున్నారు. చీకట్లో ఏదైనా ప్రమాదం తలెత్తితే తీవ్ర నష్టాలు వాటిల్లే అవకాశం ఉంది.తూప్రాన్‌ పంచాయతీగా ఉన్నప్పుడు రెండేళ్ల క్రితం అప్పటి గ్రామ పంచాయతీ పాలకులు రూ.20లక్షలకు పైగా నిధులు ఖర్చు చేసి ప్రస్తుతం ఉన్న మార్కెట్‌లో గద్దెలు కట్టించారు. కేవలం గద్దెలను మాత్రమే నిర్మించడంతో వ్యాపారులే సొంతంగా రేకులు ఏర్పాటు చేసుకొని వ్యాపారం చేస్తున్నారు. దీంతోపాటు స్థలాల పంపిణీ సరైన చర్యలు తీసుకోకపోవడంతో ఎవరికి ఇష్టమొచ్చినట్లు వారు దుకాణాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. రాత్రి సమయంలో ఎవరి దుకాణం వద్ద వారు విద్యుత్తు దీపాలను అమర్చుకుంటున్నారు. ఇక మంగళవారం రోజు మహంకాళి దేవాలయ ఆవరణలో పదుల సంఖ్యలో దుకాణాలు ఏర్పాటు చేయడంతో స్థలం సరిపోక కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చే ప్రజలు అవస్థలు పడుతున్నారు.గ్రామ పంచాయతీ నుంచి పురపాలికగా మారడంతో ఇప్పటికైనా కూరగాయల మార్కెట్‌లో సదుపాయాల కల్పనకు అధికారులు చొరవ తీసుకుంటారనే అభిప్రాయంలో వ్యాపారులు, రైతులు ఉన్నారు. తైబజార్‌లో అధిక ఆదాయం రావడంతో అందులో కొంత మేర మార్కెట్‌ అవసరాలకు ఖర్చు చేస్తే కొద్ది మేర మేలు జరిగే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. ఈ దిశగా పురపాలిక కార్యాలయం, జిల్లా అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైతులు, కొనుగోలు చేసేందుకు వచ్చే ప్రజలకు తాగునీటి సదుపాయం లేదటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

No comments:

Post a Comment