Breaking News

05/04/2019

నీటి ఎద్దడి నివారణకు జలమండలి కసరత్తు

హైద్రాబాద్, ఏప్రిల్ 5, (way2newstv.in)
వేసవి ఎండలు ముదురుతుండటంతో నగరంలో ప్రతి ఒక్కరికీ సరిపోయేలా మంచినీటి అందించేందుకు జలమండలి కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే రూ. 6.81 కోట్లతో వేసవి కార్యచరణను సిద్ధం చేసిన జలమండలి ఉన్నతాధికారులు, ఈ ప్రణాళిక అమలును క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నారు. దీనికి తోడు నగరంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న బిపిఎల్ కుటుంబాలను గుర్తించి వారికి కేవలం ఒకరూపాయికే నల్లా కనెక్షన్‌ను అందించేందుకు జలమండలి అర్బన్ భగీరథ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు సిద్దమైంది. నేరుగా బిపిఎల్ కుటుంబాల వద్దకు జలమండలి సిబ్బంది వచ్చి ఈ కనెక్షన్‌ను మంజూరు చేసేలా ఎండి ఆదేశాలిచ్చారు. వినియోగదారులు రోడ్డు కట్టింగ్ ఛార్జీలతో పాటు కనెక్షన్ ఛార్జీలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.  వేసవిలో సుమారు లక్ష కనెక్షన్లు ఇవ్వాలని, ఇందులో దాదా 60 నుంచి 70వేల కొత్త కనెక్షన్లను ఈ ఏప్రిల్ మాసంలోనే మంజూరు చేయాలని కూడా బోర్డు భావిస్తోంది. 


నీటి ఎద్దడి నివారణకు జలమండలి కసరత్తు

నూతన దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసి రెండు,మూడు రోజుల్లో నల్లా భిగించే ప్రక్రియను చేపట్టాలని ఎండి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే కొత్తగా నిర్మించిన 12 రిజర్వాయర్లను ఈ నెలల్లోనే ప్రారంభించేందుకు కూడా సన్నాహాలు చేస్తోంది. అలాగే మరో 15 రిజర్వాయర్లను వచ్చే నెలలో ప్రారంభించాలని యోచిస్తోంది. ఇందుకోసం సుమారు 1800 కిలోమీటర్ల మేరకు కొత్త పైప్‌లైన్ పనులను పూర్తి చేశారు. రెండు లక్షల కొత్త కనెక్షన్ల ప్రతిపాదనలు రూపొందించారు. ముఖ్యంగా అర్బన్ భగీరథ కార్యక్రమం కింద రూపాయికే నల్లా కనెక్షన్ ఇచ్చే ప్రక్రియను చేపట్టడంతో పాటు హడ్కో ప్రాజెక్టు కింద ఆటోనగర్, నడిగడ్డ తాండా రిజర్వాయర్ ప్రాంతాల్లో మిషన్ మోడ్ ప్రాజెక్టు కింద ట్రయల్ రన్‌ను కూడా నిర్వహించేందుకు జలమండలి ఏర్పాట్లు చేస్తోంది.అర్బన్ భగీరథ కార్యక్రమం కింద అర్హులైన బిపిఎల్ కుటుంబాలకే లబ్ది చేకూర్చేందుకు, కార్యక్రమం పకడ్బందీగా అమలయ్యేందుకు గాను క్షేత్ర స్థాయిలో హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు గాను జలమండలి సిబ్బందికి కంప్యూటర్లు, స్కానర్లు, ఒక నగదు కౌంటర్ కూడా సమకూర్చుతున్నారు. అంతేగాక, ఈ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ‘మెప్మా’కు చెందిన స్వయం సహాయక బృందాలతో కార్యక్రమాలను కూడా చేపట్టనున్నారు. దీనికి తోడు ఎంపిక చేసిన ప్రాంతాల్లో కరపత్రాలను కూడా పంపిణీ చేస్తున్నారు.

No comments:

Post a Comment