Breaking News

05/04/2019

నాగబాబుకు మెగా స్టార్స్ ప్రచారం

ఏలూరు, ఏప్రిల్ 5 (way2newstv.in)
సినిమా హీరోగా తనకంటూ ప్రత్యేక క్రేజ్‌, అభిమాన గణాన్ని సంపాదించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీని స్థాపించి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చిన జనసేనాని, ఆ తరవాత తెగతెంపులు చేసుకుని ప్రస్తుతం ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి దిగారు. వాస్తవానికి ఏడాది క్రితం నుంచే పవన్ కళ్యాణ్ జనంలో మమేకమయ్యారు. ఉత్తరాంధ్ర నుంచి ప్రజా పోరాట యాత్రను మొదలుపెట్టి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇక నోటిఫికేషన్ వెలువడిన తరవాత ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు. పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఒంటరిగానే ప్రజల్లోకి వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యులు ఎవరూ ఏనాడు ఆయనతో ఏ రాజకీయ కార్యక్రమంలో పాల్గొనలేదు. వాస్తవానికి పవన్ కళ్యాణే వాళ్లను దూరం పెట్టారు. తాజాగా సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరవాత చిన్న అన్నయ్య నాగబాబును పార్టీలోకి ఆహ్వానించి నరసాపురం ఎంపీ టిక్కెట్టు ఇచ్చారు. 


నాగబాబుకు మెగా స్టార్స్ ప్రచారం

ప్రస్తుతం నాగబాబు, ఆయన భార్య పద్మజ, కుమార్తె నిహారిక నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం, పవన్ పోటీకి దిగిన భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు సినీ గ్లామర్‌ను ప్రచారానికి ఉపయోగించుకుంటున్నాయి. అయితే, వీళ్లలో స్టార్ నటీనటులు ఎవరూ లేరు. కాబట్టి జనసేన తరఫున మెగా హీరోలు ప్రచారం చేస్తే జనసేనకు మరింత ప్లస్ అవుతుందని జనసైనికులు, మెగా అభిమానులు భావిస్తు్న్నారు. వాళ్లకు నాగబాబు సతీమణి పద్మజ తీపి కబురు అందించారు. వరుణ్ తేజ్, అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారానికి వస్తారని ఖరారు చేశారు. వరుణ్ తేజ్ ఏప్రిల్ 5న అమెరికా నుంచి తిరిగొస్తారని.. ఆ తరవాత ఆయన, బన్నీ కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని వెల్లడించారు. ఈ మేరకు ఓ యూట్యూబ్ ఛానెల్‌‌ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ఈ విషయం చెప్పారు. రామ్ చరణ్ ప్రస్తుతం కాలి చీలమండ గాయంతో బాధపడుతున్నారు కాబట్టి ఆయనెలాగూ ప్రచారంలో పాల్గొనలేరు. గాయం నయంకావడానికి డాక్టర్లు మూడు వారాల విశ్రాంతి అవసరమని చరణ్‌కు చెప్పారు. కాబట్టి అప్పటికి ఎన్నికలు కూడా పూర్తయిపోతాయి. చరణ్ రాకపోయినా వరుణ్ తేజ్, బన్నీ కలిసి ప్రచారం నిర్వహిస్తే జనసైనికుల్లో కొత్త ఉత్సాహం వస్తుంది. ఎన్నికల తేదీ దగ్గరపడుతుంది కాబట్టి ఎంత త్వరగా వీరు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే అంత మంచిది. బన్నీకి ఎన్నికల ప్రచారం కొత్తేమీ కాదు. గతంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున తన తండ్రి అల్లు అరవింద్ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పుడు బన్నీ ప్రచారం నిర్వహించారు.

No comments:

Post a Comment