Breaking News

26/04/2019

కన్నాకు అన్నీ మంచి శకునాలే

గుంటూరు, ఏప్రిల్ 26, (way2newstv.in)
కష్టకాలంలో భారతీయ జనతా పార్టీని నడిపిస్తున్న కన్నా లక్ష్మీనారాయణకు త్వరలోనే మంచి రోజులు రానున్నానయట. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఎలా ఉన్నా కేంద్రంలో మరోసారి నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే కన్నా లక్ష్మీనారాయణ దశ తిరుగడం ఖాయమని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. ఈసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే కన్నాకు కేంద్ర మంత్రి పదవి ఖాయమట. ఈ మేరకు ఇప్పటికే ఆయనకు బీజేపీ పెద్దలు హామీ ఇచ్చారు. దీంతో రాష్ట్రంలో ఎలా ఉన్నా కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి రావాలని కన్నా లక్ష్మీనారాయణ, ఆయన అనుచరులు బలంగా కోరుకుంటున్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట నుంచి పార్లమెంటు బరిలో ఉన్న కన్నా లక్ష్మీనారాయణకు గెలిచినా, ఓడినా మంత్రి పదవి మాత్రం ఖాయమని చెబుతున్నారు.సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ హయాంలో గుంటూరు జిల్లాలో ఓ వెలుగువెలిగారు. 1989 నుంచి గుంటూరు జిల్లా పెదకూరపాడులో వరుసగా నాలుగుసార్లు, గుంటూరు పశ్చిమ నుంచి ఒకసారి గెలిచి 25 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేశారాయన. 


కన్నాకు అన్నీ మంచి శకునాలే

నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లలో ఆయన మంత్రిగా పనిచేశారు. వైఎస్ మరణం తర్వాత ఉమ్మడి రాష్ట్రానికి పలుమార్లు ముఖ్యమంత్రి పదవి రేసులో కన్నా లక్ష్మీనారాయణ పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ, ఆయనకు ముఖ్యమంత్రి పీఠం లభించలేదు. విభజన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరిపోయారు. తర్వాత కొంతకాలం బీజేపీలో సరైన ప్రాధాన్యత ఆయనకు దక్కలేదు. దీంతో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా జరిగాక.. తెల్లారి వైసీపీలో చేరుతారనగా అనూహ్య పరిణామాల్లో ఆయన తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకొని బీజేపీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు.అయితే, వైసీపీలో చేరకపోవడానికి బీజేపీ పెద్దలు ఆయనకు ఇచ్చిన ఆఫర్లే కారణమట. కాపు సామాజకవర్గానికి చెందిన బలమైన నేతగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణను వదులుకోవద్దని భావించిన బీజేపీ ఆయనకు తర్వాత రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టింది. దీంతో పాటు అప్పుడే ఆయనకు కేంద్రమంత్రి పదవి ఆఫర్ ఇచ్చారట. ఈ ఎన్నికల్లో ఆయన నరసరావుపేట నుంచి గెలిచి, కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే కేంద్ర క్యాబినెట్ లోకి ఆయనను తీసుకుంటారంట. ఒకవేళ ఆయన ఎన్నికల్లో ఓడినా, బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యసభసభ్యునిగా అవకాశం ఇచ్చి మరీ క్యాబినెట్ లో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారట. దీంతో ఆయన రాష్ట్రంలో ఎన్ని గెలుస్తామో చూడకుండా కేంద్రంలో బీజేపీ మళ్లీ రావాలని బలంగా కోరుకుంటున్నారు. మరి, ముఖ్యమంత్రి పదవి అందినట్లే అంది చేజారిపోయినా ఆయన కేంద్రమంత్రి పదవి అయినా ఆయనకు దక్కుతుందేమో చూడాలి.

No comments:

Post a Comment