Breaking News

26/04/2019

కృష్ణా జిల్లా కోట్లలో బెట్టింగ్ లు

విజయవాడ, ఏప్రిల్ 26, (way2newstv.in)
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఈ నెల 11వ తేదీన జరిగాయి. పోలింగ్ రోజు నుంచే విశ్లేషణలు మొదలయ్యాయి. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికల కమిషన్ పై పోరాటానికి పోలింగ్ రోజునే దిగడంతో ఆ పార్టీ విజయంపై అనేక అనుమానాలు తలెత్తాయి. వైసీపీ అధినేత జగన్ సయితం పోలింగ్ రోజు అధికారంలోకి తామే వస్తున్నామంటూ ప్రకటించుకున్నారు. దీంతో బెట్టింగ్ బంగార్రాజులు లక్షల కొద్దీ పందేలు కాశారు. ఎలా అంటే వైసీపీ గెలుస్తుందని లక్షల్లో పందేలు కాశారు. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో ఈ బెట్టింగ్ లు కోట్లలో సాగాయి.ప్రధానంగా తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన ద్వితీయ శ్రేణినేతలే ఈ బెట్టింగ్ లలో ఎక్కువగా పాల్పడినట్లు సమాచారం. వైసీపీ గెలవబోతుందని విపరీతమైన ప్రచారం జరగడంతో కోట్లరూపాయలు పందేలు కాశారు. ముఖ్యంగా మంగళగిరి, గుడివాడ, మైలవరం, గన్నవరం నియోజకవర్గాల్లోనే ఈ బెట్టింగ్ లు ఎక్కువగా సాగినట్లు తెలుస్తోంది. 


కృష్ణా జిల్లా  కోట్లలో బెట్టింగ్ లు

రూపాయికి రెండు రూపాయలు ఇస్తామని వైసీపీకి చెందిన నేతలు పెద్దయెత్తున లక్షల్లో పందేలు కాశారు. పోలింగ్ ముగిసిన మూడురోజుల్లోనే ఈ నియోజకవర్గాల్లో దాదాపు వంద కోట్లకు పైగానే బెట్టింగ్ లు జరిగాయి.అయితే ఇప్పుడు బెట్టింగ్ బాబులు కొంత దూకుడు తగ్గించినట్లు కనపడుతోంది. పోలింగ్ ముగిసిన తర్వాత బూత్ ల వారీగా వివరాలు తెప్పించుకుంటున్నారు. అయితే తాము ఊహించిన దానికి, పోలింగ్ జరిగిన దానికి మధ్య తేడా రావడంతో కొంత భయపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా మైలవరం, గన్నవరం, గుడివాడల్లో భారీగా బెట్టింగ్ లు కట్టిన వైసీపీ నేతలు తొందరపడ్డామేమోనన్న డైలమాలో పడిపోయారట. బయటజరుగుతున్న ప్రచారానికి, క్షేత్రస్థాయిలో పోలింగ్ జరిగిన తీరుకు మధ్య తేడాను వారు గుర్తించారని, అందుకోసం కొందరు పందేలు వెనక్కు తీసుకోవడానికి సిద్ధపడుతున్నట్లు చెబుతున్నారు.మైలవరం, గుడివాడ, గన్నవరం నియోజకవర్గాల్లో అయితే రూపాయికి రెండు రూపాయలు కట్టారు. అంటే లక్ష పందెం కడితే అక్కడ టీడీపీ గెలిస్తే రెండు లక్షలు ఇవ్వాలన్నామాట. ఇక విజయవాడ నగరంలో ఉన్న తూర్పు, పశ్చిమ, సెంట్రల్ నియోజకర్గాల్లో ఏ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుస్తుందన్న దానిపైన కూడా భారీగా బెట్టింగ్ లు జరిగాయి. పసుపు కుంకుమ, పింఛను దారులు టీడీపీ పక్షాన నిలిచారన్న విశ్లేషణలు వెలువడటంతో బెట్టింగ్ బాబులు డీలా పడ్డారు. మొత్తం మీద వచ్చే నెల 23వ తేదీ వరకూ ఫలితాలు తేలకున్నా…పోలింగ్ తర్వాత రెండు ప్రధాన పార్టీలు తమదే గెలుపు అన్న ధీమాను వ్యక్తం చేస్తుండటంతో వీరిలో భయం పట్టుకుంది. పోలింగ్ రోజు వచ్చిన ఊపు మీద బెట్టింగ్ లు జరిపిన వారు తర్వాత బెంగపడిపోతున్నారు.ః

No comments:

Post a Comment