Breaking News

23/04/2019

చిత్తూరులో గెలుపు ఎవరిది... ఎవరది సత్తా

తిరుపతి, ఏప్రిల్ 23, (way2newstv.in)
చిత్తూరు జిల్లాలోని ప్రతి నియోజ‌క‌వ‌ర్గమూ కీల‌క‌మే. చంద్రబాబు సొంత జిల్లా, ఆయ‌న‌ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న జిల్లా కావ‌డంతో ఆయ‌న‌ను ఎదిరించేందుకు, తీవ్రంగా దెబ్బకొట్టేందుకు ప్రత్యర్థులు ఈ జిల్లానే ఎంచుకుంటారు. ఇప్పుడు కూడా ఎన్నిక‌లు ముగిసిన నేప‌థ్యంలో చిత్తూరు జిల్లాలోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల‌పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇక్కడ నుంచి ఎవ‌రు గెలుపు గుర్రం ఎక్కుతారు? ఎవ‌రు స‌త్తా చాటుతారు? అనే అంశాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేగా గుర్తింపు సాధించిన చెవిరెడ్డి భాస్కర‌రెడ్డి గురించి ప్రత్యేకంగా చ‌ర్చించుకుంటున్నారు. చంద్రగిరి నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త 2014 ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన చెవిరెడ్డి త‌న‌దైన శైలిలో దూకుడు ప్రద‌ర్శించారు.ముఖ్యంగా సీఎం చంద్రబాబు, టీడీపీ నేత‌ల‌ను టార్గెట్ చేసుకుని అనేక సంచ‌ల‌నాల‌కు కేంద్ర బిందువుగా మారారు. దీంతో తాజా ఎన్నిక‌ల్లో చెవిరెడ్డికి చెక్ పెట్టాల‌ని చంద్రబాబు భావించారు. ఈక్రమంలోనే నియోజ‌క‌వ‌ర్గంపై గ‌ట్టి ప‌ట్టున్న పుల‌వ‌ర్తి వెంక‌ట మ‌ణిప్రసాద్ ఉర‌ఫ్ పుల‌వ‌ర్తి నానికి టీడీపీ టికెట్ ఇచ్చింది. ఇక‌, జ‌న‌సేన త‌ర‌ఫున‌ శెట్టి సురేంద్ర పోటీకి దిగారు.


చిత్తూరులో గెలుపు ఎవరిది... ఎవరది సత్తా

ప్రధానంగా ఇక్కడ పోరు చెవిరెడ్డి వ‌ర్సెస్ పుల‌వ‌ర్తి నాని మ‌ధ్యే జ‌రిగింది. వాస్తవంగా చూస్తే చంద్రగిరి నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ బ‌ల‌హీనంగా ఉంది. ఎప్పుడో 1994లో చంద్రబాబు సోద‌రుడు నారా రామ్మూర్తినాయుడు టీడీపీ నుంచి గెల‌వ‌డమే ఇక్కడ ఆ పార్టీకి చివ‌రి విజ‌యం. ఆ త‌ర్వాత జ‌రిగిన నాలుగు ఎన్నిక‌ల్లోనూ ఇక్కడ టీడీపీ ఓడిపోతూ వ‌స్తోంది.చంద్రబాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో ఈసారి ఇక్కడ ఎలాగైనా టీడీపీ జెండా ఎగ‌ర‌వేయాల‌ని బాబుతో పాటు లోకేష్ ప్రత్యేకంగా ఈ నియోజ‌క‌వ‌ర్గంపై దృష్టి పెట్టారు. దీనికి తోడు టీడీపీకి బాగా డిస్టర్బ్‌గా మారిన చెవిరెడ్డిని ఓడించ‌డం కూడా ఇక్కడ టీడీపీ వ్యూహంలో ఓ భాగం. ఈ క్రమంలోనే బాబు ఇక్కడ వ్యూహాత్మకంగా దాదాపు ఎన్నిక‌ల‌కు మూడు మాసాల ముందుగానే పుల‌వ‌ర్తిని లైన్‌లోకి దింపారు. ప్రచారం దుమ్ము రేపారు. పుల‌వ‌ర్తికి టికెట్ ఖ‌రారు కావ‌డంతో రేగిన అస‌మ్మతిని కూడా బాబు నిలువ‌రించారు. ఇద్దరు కీల‌క నేత‌ల‌కు ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. ఇలా త‌న‌దైన వ్యూహంతో బాబు వ్యవ‌హ‌రించ‌డంతో టీడీపీ నేత‌లు క‌ల‌సి క‌ట్టుగా ఈ ఎన్నిక‌ల‌ను టార్గెట్ చేసుకున్నారు.ఇక‌, చెవిరెడ్డి విష‌యానికి వ‌స్తే.. నియోజ‌క‌వ‌ర్గంలోని ప్రతి ఇంటికీ ఈ పేరు సుప‌రిచితం. ఏ చిన్న కార్యక్రమానికి ఎవ‌రు పిలిచినా.. భేష‌జాలు లేకుండా హాజ‌ర‌వుతూ.. ప్రజ‌ల్లో ఒక‌రిగా ఆయ‌న క‌లిసిపోయారు. ప్రజ‌ల‌కు క‌ష్టాల‌కు వెంట‌నే స్పందిస్తూ.. తాను ప్రతిప‌క్షంలో ఉన్నప్పటికీ.. ప్రజ‌ల‌కు సాధ్యమైనంత వ‌రకు సేవ‌లు అందించారు. ఉద్యోగుల‌కు కానుక‌లు కూడా ఇచ్చారు. ఇక నియోజ‌క‌వ‌ర్గం స‌మ‌స్యల‌పై అసెంబ్లీలోనూ స‌మ‌యం చిక్కిన‌ప్పుడు ప్రశ్నించారు. మొత్తానికి నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న వ్యతిరేక‌త‌లేకుండా చూసుకున్నారు. వైసీపీలో నూ అస‌మ్మతి రాకుండా వ్యవ‌హ‌రించారు. దీంతో ఇటు చెవిరెడ్డి, అటు పుల‌వ‌ర్తిలు కూడా హోరా హోరీ పోరు చేశార‌ని చెప్పాలి. ప్రచార ప‌ర్వంలో రెండు పార్టీల మ‌ధ్య చంద్రగిరిలో పెద్ద యుద్ధమే న‌డిచింది. కొన్ని చోట్ల ఇరు వ‌ర్గాలు కొట్టుకోవ‌డం, దాడులు చేసుకోవ‌డం కూడా చేసుకున్నారు. ప్రచారంలోనే టీడీపీ, వైసీపీ మ‌ధ్య చంద్రగిరిలో చెల‌రేగిన ప‌గ‌లు, ప్రతీకారాల నేప‌థ్యంలో ఇక్కడ ఎవ‌రు గెలుపు గుర్రం ఎక్కినా.. కూడా స్వల్ప మెజారిటీతోనే అంటున్నారు ప‌రిశీల‌కులు.

No comments:

Post a Comment